బేరసారాలకు దిగిన అధికార పార్టీ నేతలు, పోలీస్‌ అధికారులు

20 Feb, 2019 12:42 IST|Sakshi
కౌలు రైతు కోటేశ్వరరావు మృతదేహం

సీఎం సభ పార్కింగ్‌ స్థలం వివాదంలో  బీసీ రైతును పొట్టన బెట్టుకున్న పోలీసులు

చావు ఇంట బేరసారాలకు దిగిన అధికార పార్టీ నేతలు, పోలీస్‌ అధికారులు

గుంటూరు: ఇంటి పెద్ద మృతి చెంది కొండంత దుఃఖంలో కూరుకుపోయిన కౌలు రైతు కుటుంబ సభ్యులను ఓదార్చాల్సిన పాలకులు, టీడీపీ నాయకులు, పోలీసులు మానవత్వం మరచి ప్రవర్తించారు. సీఎం సభ నేపథ్యంలో పోలీసులదౌర్జన్యం కారణంగా రైతు మృతిచెందిన ఘటనను పక్కదారి పట్టించేందుకు సరికొత్త పన్నాగాలు పన్నుతున్నారు. విషాదం నెలకొన్న కౌలు రైతు ఇంట శవ రాజకీయాలు చేస్తున్నారు. రూ.3 లక్షలు తీసుకుని వదిలేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు అప్పుల బాధతోనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటూ అసత్య ప్రచారం సాగిస్తున్నారు. పోలీసులు కొట్టినందునే కౌలు రైతు కోటేశ్వరరావు చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తుండగా రూరల్‌ ఎస్పీ మాత్రం ఖండించారు.

ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతును తమ సిబ్బందే ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ కౌలు రైతును పోలీసులు భుజాలపై తీసుకెళ్తున్నట్లు ఉన్న వీడియోను విడుదల చేశారు. అయితే ఘటన జరిగిన అనంతర పరిణామాలు మాత్రం పోలీసులనే దోషులుగా చూపుతున్నాయి. సీఎం సభా ప్రాంగణం వద్ద జిల్లా వైద్యాధికారి, హెలీప్యాడ్‌ వద్ద అంబులెన్సులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండగా పోలీసులు ఎందుకు తరలించాల్సి వచ్చింది? సీఎం చంద్రబాబు సైతం పోలీసుల వల్లనో, మరే కారణంగానో అవమానంగా భావించి కౌలు రైతు చనిపోయాడంటూ ఎందుకు ప్రసంగించారు? పోలీసుల తప్పు లేనప్పుడు రాజీపడాలంటూ ఉన్నతాధికారులు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ నేత విడదల రజనిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? కోటేశ్వరరావుకు తోడుగా వెళ్లిన పున్నారావు పోలీసు వాహనంలో ఎందుకు ఉన్నాడు? అతని సెల్‌ఫోన్‌ను ఓ సీఐ తన వద్ద ఎందుకు ఉంచుకున్నాడు? పోస్టుమార్టం వద్ద టీడీపీ నాయకులు ఎందుకు హల్‌చల్‌ చేశారు? అన్న ప్రశ్నలకు జవాబిచ్చేదెవరు?

మరిన్ని వార్తలు