చెత్తతో పబ్బం గడుస్తుందా?

7 Mar, 2014 03:46 IST|Sakshi
చెత్తతో పబ్బం గడుస్తుందా?

* చంద్రబాబు తీరుపై టీడీపీ సీనియర్ల ఆగ్రహం
* పార్టీని కాంగ్రెస్ నేతలతో నింపేస్తున్నారు
* ప్యాకేజీలిస్తామని మరీ తీసుకొస్తున్నారు..  
* ముందు నుంచి ఉన్నవారికీ  టికెట్లు దక్కే స్థితి లేదని అసంతృప్తి
 
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నేపథ్యంలో పార్టీ నుంచి సీనియర్ నేతలు వెళ్లిపోతుంటే.. ఇతర పార్టీల్లో అవకాశాలు లేక కొట్టుమిట్టాడుతున్న నేతలందరినీ చేర్చుకోవడం... ఇలా పబ్బం గడుపుకోవచ్చన్న రీతిలో అధినాయకత్వం నడిపిస్తున్న వ్యవహారాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కుదిపేస్తున్నాయి. ప్రజల్లో చులకనైన నేతలందరినీ చేర్చుకుని పార్టీని నింపేస్తున్న అధ్యక్షుడు చంద్రబాబు వైఖరిపై టీడీపీ నేతల నుంచే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

2004, 2009 ఎన్నికల్లో వరుస పరాజయాల నుంచి పార్టీ ఇప్పటికీ కోలుకోకపోగా.. గత ఐదేళ్లలో 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, పలువురు పొలిట్‌బ్యూరో సభ్యులు, మరెంతో మంది నేతలు టీడీపీని వీడివెళ్లిపోయారు. టీడీపీపై నమ్మకం కోల్పోయిన కారణంగా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుంటే.. ఆ స్థానాలను భర్తీ చేయడానికన్నట్టు పనికిరాని సరుకును సైతం చేర్పించుకుంటున్నారని పార్టీలోని పాతతరం సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

అది కూడా ఇతర పార్టీల్లోకి వెళ్లాలని ప్రయత్నం చేసి అక్కడ అవకాశాలు దొరకని కాంగ్రెస్ నేతలందరినీ చేర్చుకుని మొత్తం పార్టీని కాంగ్రెస్ మయం చేస్తున్నారన్న అసంతృప్తి తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అనేకసార్లు పార్టీలు మారిన వారిని సైతం ప్యాకేజీలిస్తామని ఆశలు పెట్టి మరీ పార్టీలోకి తీసుకోవడం.. టీడీపీ దయనీయస్థితిని తెలియజేస్తోందని కోస్తాకు చెందిన మాజీ మంత్రి ఒకరు అసంతృప్తి వ్యక్తంచేశారు.

వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌లో చేరడానికి తనకు అనేక అవకాశాలొచ్చినా పార్టీ కోసం వదులుకున్నాననీ, కానీ ఇప్పు డు కాంగ్రెస్‌లో పనికిరాని చెత్తగా తయారైన వాళ్లను కూడా చేర్చుకుంటుంటే టీడీపీ భవిష్యత్తు ఏమవుతుందన్న ఆందోళన ఉందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా తథ్యమని, టీడీపీ పోరాడేది ప్రతిపక్ష హోదాకేనని.. ఇలాంటి నేతలందరినీ తీసుకుంటే ఆ హోదా కూడా దక్కదని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 
ఆది నుంచీ ఉన్నవారికి మొండిచేయే...
రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న చివరి నిమిషం వరకు అధికారంలో కొనసాగిన కొందరు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌లో వెళ్లడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. మాజీ మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు, టీజీ వెంకటేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పార్టీలో చేరినా టికెట్ ఇవ్వలేమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తేల్చిచెప్పడంతో అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న వారిని ఏరికోరి మరీ టీడీపీలో చేర్చుకున్నారని మరో సీనియర్ టీడీపీ నేత రుసరుసలాడారు.

పార్టీకేదో బలం ఉంది కాబట్టి నేతలు ఆకర్షితులవుతున్నారన్న ప్రచారం చేసుకోవడానికి ఇలా ఇష్టానుసారంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కోటరీలో కీలకపాత్ర పోషించే ఎంపీలు గరికపాటి మోహనరావు, సి.ఎం.రమేష్, సుజనాచౌదరి తదితరులు ఆయా నేతల ఇళ్లకు వెళ్లి గంటల తరబడి చర్చలతో అనేక విధాలుగా ఒప్పించి మరీ చంద్రబాబును కలిపిస్తున్నారని.. దీనివల్ల పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న నేతలెవరికీ టికెట్లు కూడా దక్కే పరిస్థితి లేదని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు.
 
అయ్యన్న, కోడెల బహిరంగ విమర్శలు...
ఎక్కడా దిక్కులేక ఈ రకంగా చేర్పించుకుంటున్న నేతల విషయంలో కోడెల శివప్రసాదరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు తదితర పార్టీ సీనియర్లు బహిరంగంగానే చంద్రబాబు వైఖరిని తప్పుపడుతున్నారు. టీడీపీ కార్యకర్తల హత్యకు కారకులను, దొంగలను పార్టీలో చేర్చుకోవటం ఎంతవరకూ సబబో ఆలోచించాలని చంద్రబాబు కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే ప్రశ్నించారు.

టీడీపీ అంతా కాంగ్రెస్ మయమవుతోందని, ఇది మంచి పరిణామం కాదని, టీడీపీలో కాంగ్రెస్ విలీనమైందని అందరూ భావిస్తున్నారని కోడెల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలోని మరికొందరు సీనియర్లు కొద్ది రోజులుగా ఇదే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు.

>
మరిన్ని వార్తలు