దౌర్జన్య కాండ

20 Feb, 2019 13:21 IST|Sakshi
గాయపడిన చేనేత యువకునికి కుట్లు వేస్తున్న వైద్యుడు

చేనేత యువకులపై టీడీపీ నేతల దాడి

రాడ్డులు, కత్తులతో దాడిచేయడంతో తీవ్ర గాయాలు

అధికారం మాది.. ఏమైనా చేస్తామంటూ బెదిరింపులు

చీరాలలో పెచ్చుమీరుతున్న తెలుగు తమ్ముళ్ల ఆగడాలు

చీరాల: చీరాల తెలుగుదేశం నాయకుల దౌర్జన్యాలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. అధికారం ఉంది అడిగేవారెవరంటూ దాడులకు తెగబడుతున్నారు. పోలీసులతో సహా అన్ని వ్యవస్థలు మావే.. మేము ఏం చేసినా మీకు దిక్కేదంటూ రెచ్చిపోతున్నారు. పైపెచ్చు కట్టేసి నివాసం ఉంటున్న ఇళ్లకు ఇప్పుడు పట్టాలిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. అధికారులను సైతం ఎటువంటి ప్రొటోకాల్‌ లేకుండానే బెదిరిస్తున్నారు. మేం చెప్పిన పని చేయండి.. లేకుంటే మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చీరాలలో ఇటీవల కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్‌ టీడీపీ వీడి వైఎస్సార్‌ సీపీలోకి వచ్చిన నేపథ్యంలో కొందరు టీడీపీ నాయకులు చేస్తున్న హడావుడిఅంతాఇంతా కాదు. మంగళవారం ఇదేమని ప్రశ్నించిన కొందరు చేనేత యువకులతో పాటు ఒక మహిళను దారుణంగా కర్రలు, రాడ్లు, కత్తులతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు.

వివరాల్లోకి వెళితే... చీరాలలో టీడీపీ నేతలు చేస్తున్న హడావుడితో ఇక్కడకు కొత్తగా వచ్చిన అధికారులు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారంటూ టీడీపీ నేతలు హంగామా సృష్టిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ కూసే ముందే మీకేం కావాలో చెప్పండి...అది చేసేస్తాం అన్న రీతిలో ఓటరుకు తాయిలాల బంధాన్ని బిగిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తమకు ముఖ్యమంత్రి రాత పూర్వకంగా ఆదేశాలిచ్చారని, తాము చెప్పిందే చేయాలంటూ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. మరో వైపు ప్రజలను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. మరో పదిరోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తున్న నేపథ్యంలో ఇళ్ల స్థలాలు ఇస్తాం.. పింఛన్లు ఇప్పిస్తాం..రేషన్‌కార్డులు కావాలా...కొత్త ఇళ్లు నిర్మించుకుంటారా అంటూ ప్రజలచేత దగ్గరుండి అర్జీలను ఇప్పిస్తున్నారు. ఎమ్మెల్యే ఆమంచి పార్టీని వీడటంతో టీడీపీలో ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్న పాలేటి రామారావు, ఎమ్మెల్సీ పోతుల సునీతలు తమ అనుచరులతో కలిసి చీరాల్లో కొత్త రాజకీయాలకు తెరలేపారు.  నాలుగు రోజుల నుంచి చీరాల నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులను ఎమ్మెల్సీ పోతుల, మాజీ ఎమ్మెల్యే పాలేటిలు కలుస్తున్నారు. నాలుగేళ్లలో టీడీపీ హయాంలో చీరాల్లో జరిగిన అభివృద్ధి పనులను పర్యవేక్షించడంతో పాటుగా అధికారులతో కలిసి పనులను చూస్తూ, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని పాలేటి, పోతుల సునీతలు నియోజకవర్గంలో ప్రజలను నిలువునా మోసం చేసేలా ఉసిగొల్పుతున్నారు.

అధికారులపై టీడీపీ నేతల స్వారీ...
అధికారులు కూడా ఈ ఒత్తిళ్లతో పనిచేయడం కష్టతరమేననుకొని బదిలీ చేయించుకునే పనిలో పడ్డారు. అధికారులపై స్వారీ చేసేలా టీడీపీ నేతలు మారడంతో తప్పుకుంటే మంచిది అని వారు భావిస్తున్నట్లు సమాచారం. అలానే నేతల మధ్య కూడా కలహాలు మొదలయ్యాయి. చీరాల మున్సిపల్‌ చైర్మన్‌ మోదడుగు రమేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత మధ్య సోమవారం మున్సిపల్‌ కార్యాలయంలోనే వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో తిట్ల పురాణాలు అందుకున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ చాంబర్‌లో ఎమ్మెల్సీ పోతుల సునీత కార్యాలయం బయట టెంటు వేసి ప్రజల నుంచి అర్జీలు తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ తతంగాన్ని చూసి ప్రశ్నించిన చైర్మన్‌పై సునీత, అనుచరులు వాగ్వాదానికి దిగి ప్రభుత్వం మాది..పథకాలు మేము తెప్పించి ఇస్తాం...నీకేం సంబంధం అంటూ చైర్మన్‌ను ప్రశ్నించి దురుసుగా వ్యవహరించారు.

వేడెక్కిన చీరాల రాజకీయాలు:ఇది గడచిన మరుసటి రోజునే చేనేత యువకులపై టీడీపీ నేత పాలేటి రామారావు అనుచరులు దాడులకు తెగబడడం రాజకీయాలను మరింత వేడెక్కించాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌. రాజశేఖర రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌ ప్రభుత్వ స్థలంలో చేనేత కార్మికులకు ఇళ్ల పట్టాలు అందచేసి పెద్ద సంఖ్యలో చేనేత షెడ్డు కార్మికులకు గృహాలు నిర్మించారు. ప్రస్తుతం ఆ ఇళ్లల్లో చేనేత షెడ్డు కార్మికులు నివాసముంటున్నారు. అయితే ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో కొద్ది రోజులుగా టీడీపీ నాయకులు చీరాలలో అధికారులతో చర్చలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. చేనేతపురి కాలనీ వాసులకు కేటాయించిన ఇళ్ల నిర్మాణాలకు చెందిన ఇళ్ల పట్టాలు హౌసింగ్‌ కార్యాలయంలోనే ఉన్నాయి. కానీ ఇది తెలియని టీడీపీ నేతలు పాలేటి రామారావు, మరికొందరు నాయకులు ఆ పట్టాలన్నీ ఎమ్మెల్యే ఆమంచి వద్దే ఉన్నాయని భావించి మంగళవారం హౌసింగ్‌ డీఈ సుబ్బారావు వద్దకు వెళ్లి పట్టాల విషయం చర్చించడంతో పట్టాలన్నీ తమ వద్దే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

అయినా వినని టీడీపీ నేతలు అవి చేనేతపురి వాసుల వద్దకు వెళ్లి చూపించాలని బలవంతం చేశారు. ఈ సమావేశానికి కొందరు వెళ్లగా మరికొందరు ఇదేంటని ప్రశ్నించారు. తమకు ఎప్పుడో పట్టాలు మంజూరై ఎమ్మెల్యే ఇళ్లు నిర్మించి ఇచ్చారన్నారు. ఇప్పుడు సమావేశం అవసరం ఏముందని ప్రశ్నించడంతో టీడీపీ నాయకులకు, చేనేతపురి యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, పాలేటి వర్గీయులు కలిసి చేనేత యువకులపై కర్రలు, రాడ్‌లతో దాడికి దిగారు. ఈ ఘటనలో చేనేతపురికి చెందిన అండగుండ ప్రవీణ్‌కుమార్, గోర్పుని శశిధర్, బూడిద వరహాలును ఇళ్లలో నుంచి బయటకు లాగి ఇనుపరాడ్లు, కత్తులతో విచక్షణారహితంగా నరికారు. తమను కొట్టవద్దని చేనేత యువకులు ప్రాధేయపడినా పాలేటి అనుచరులు శాంతించలేదు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, వైఎస్సార్‌సీపీ నాయకులు పెద్ద ఎత్తున హాస్పిటల్‌కు చేరుకుని పరామర్శించారు. ఇలా రోజుకు ఒక విధంగా టీడీపీ నేతల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అధికారం మాది...పెత్తనం కూడా మాదే అన్నరీతిలో వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు ఈ స్థాయిలో ప్రవర్తించడంతో ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

మరిన్ని వార్తలు