దళితులపై టీడీపీ నాయకుల దాడి

23 Aug, 2018 08:39 IST|Sakshi
స్థలం హక్కు పత్రాలను చూపుతున్న బాధితులు ప్రసాద్, కృష్ణయ్య

నెల్లూరు(వేదాయపాళెం): రూరల్‌ మండలంలోని అంబాపురం అరుంధతీయవాడలో బుధవారం స్థానిక దళితుడైన ఇండ్ల ప్రసాద్, ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బద్దేపూడి కృష్ణయ్యలపై అదే గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకుడు, విశ్రాంత వీఆర్‌ఓ పల్నాటి రాగపనాయుడు, అతని కుమారులు మస్తాన్‌నాయుడు, మల్లికార్జుననాయుడు, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు సర్వేనంబరు 105/2లోని 33 అంకణాల నివేశన స్థలాన్ని లఘుసాని వెంకటసుబ్బమ్మ వద్ద గత కొన్నేళ్ల క్రితం ఇండ్ల ప్రసాద్‌ కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసిన స్థలంలో బుధవారం ఇంటి నిర్మాణ పనులు చేపడుతుండగా అధికార పార్టీ నాయకులు అక్కడకు చేరుకుని ఈ స్థలం తమదంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు.

స్థలానికి సంబంధించిన అన్ని హక్కు పత్రాలు తన వద్ద ఉన్నాయని ప్రసాద్‌ తెలపగా అధికార పార్టీ నాయకుడు ఏమాత్రం పట్టించుకోలేదు. కులం పేరుతో దూషించి ప్రసాద్‌పై దాడి చేశారు. ప్రసాద్‌ బంధువైన ఎమ్మార్పీఎస్‌ నాయకుడు బద్దేపూడి కృష్ణకు విషయం తెలియడంతో అక్కడకు చేరుకుని ఇదెక్కడి అన్యాయమని టీడీపీ నాయకులను ప్రశ్నించాడు. అతడిపై కూడా దాడి చేశారు. అధికారం ఉంది ఏమైనా చేస్తాం అంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు