దాడులు సహించం

3 Jun, 2014 00:31 IST|Sakshi
దాడులు సహించం

 సాక్షి, గుంటూరు :సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారని, ఇలాంటి వాటిని సహించబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి హెచ్చరించారు. గుంటూరు అరండల్‌పేటలోని వైన్ డీలర్స్ కల్యాణ మండపంలో సోమవారం గుంటూరు, బాపట్ల పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం పార్థసారధి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. శ్రేణులపై దాడులు చేసి వారిని భయబ్రాంతులకు గురిచేయడం ద్వారా వారిలో మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని, వీరికి కొందరు పోలీసు అధికారులు సైతం సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు క్షుణ్ణంగా విచారించి ఎవరిది తప్పయితే వారిని కఠినంగా వ్యవహరించాలని, అలా కాకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కక్ష సాధింపునకు దిగితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
 
 పార్టీని వీడుతున్నారంటూ అసత్య ప్రచారం..
 వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి టీడీపీ, బీజేపీల్లో చేరుతున్నారంటూ టీడీపీ నాయకులతోపాటు కొన్ని పత్రికలు, ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ వదంతులను నమ్మి ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారనేది వారి భావన అని చెప్పారు. కానీ పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయనేది సమీక్షల ద్వారా వెల్లడయిందని పార్థసారధి తెలిపారు. బలమైన ప్రతిపక్షంగా రూపొందిన వైఎస్సార్ సీపీ ఈ ఐదేళ్లు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. అధికార పక్షమైన టీడీపీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో వారిపై ఒత్తిడి తీసుకువచ్చి వాటిని అమలు చేసేలా చూస్తామన్నారు.
 
 దళితులపై వివక్ష బయటపడింది..
 టీడీపీ అధినేత చంద్రబాబుకు దళితులపై ఏమాత్రం ప్రేమ ఉందో డీజీపీ ప్రసాదరావును మార్చడంతోనే అర్థమౌతోందని  పార్థసారధి విమర్శించారు. 23 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి 13 జిల్లాలకు పనిచేయలేరా అని ప్రశ్నించారు. నీతి, నిజాయతీ గల అధికారిగా పేరొందిన  ప్రసాదరావును మార్చడం దళితులను అవమానపరిచేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అభిప్రాయాలు సేకరించాం.: గుంటూరులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గుంటూరు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించామని, వాటిని లిఖిత పూర్వక నివేదిక రూపంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందిస్తామని పార్థసారధి చెప్పారు. వీటి ఆధారంగా పార్టీ అధినేత తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
 
 ఆయా నియోజకవర్గాల్లో ఓటమికి గల కారణాలు, అభ్యర్థులు, నాయకుల పనితీరుపై సమీక్షించామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి, బాపట్ల, గుంటూరు తూర్పు ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే), కోన రఘుపతి, షేక్ మహ్మద్ ముస్తఫా, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, తెనాలి, వేమూరు, తాడికొండ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అన్నాబత్తుని శివకుమార్, మేరుగ నాగార్జున, హెని క్రిస్టినా, ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నపురెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి, నాయకులు కత్తెర సురేష్‌కుమార్, షేక్ షౌకత్, నసీర్‌అహ్మద్, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ నర్సిరెడ్డి తదితరులు హాజరై అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు