మహిళపై టీడీపీ మాజీ సర్పంచ్‌ దాడి

13 Apr, 2019 11:33 IST|Sakshi
దాడి వివరాలు చెబుతున్న బాధిత మహిళ

జుత్తు పట్టుకుని ఇంట్లో నుంచి  ఈడ్చుకొచ్చిన వైనం

కుందువానిపేటలో దారుణం

శ్రీకాకుళం రూరల్‌: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటేశారన్న అనుమానంతో ఎల్‌ఐసీ ఏజెంట్‌ వాసుపల్లి రామారావు, ఆయన భార్య నీలవేణిలపై టీడీపీ మాజీ  సర్పంచ్‌ కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేశారు. మహిళ అని చూడకుండా జత్తుపట్టి మరీ ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి చావబాదారు. ఈ ఘటన మండలంలోని కుందువానిపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. ఉదయం నీలవేణి పిల్లలను స్కూల్‌కు పంపే పనిలో నిమగ్నమైంది. ఇంతలో టీడీపీ మాజీ సర్పంచ్‌ సూరడ అప్పన్న అక్కడకు చేరకుని దూషించాడు.

అక్కడితో ఆగకుండా ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి ఈమె జుత్తు పట్టుకుంటూ బయటకు ఈడ్చుకు వచ్చాడు. తన కుమారులు అప్పన్న, లక్ష్మణలతో కలసి ఈ దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న ఆమె భర్తతోనూ వాగ్వాదానికి దిగారు. అతడిపై ఇష్టానుసారంగా దూషించి పిడుగుద్దులు గుద్దారు. ఇదేక్రమంలో బాధితులకు గ్రామస్తులంతా మద్దతుగా నిలవడంతో వారు అక్కడ్నుంచి జారుకున్నారు. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి నేరుగా వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి వెళ్లి విన్నవించుకున్నారు.  

ఇష్టానుసారంగా తిడుతూ దాడి చేశారు
మహిళతో ఎలా మాట్లాడాలో టీడీపీ నేతలకు తెలీదని బాధితురాలు నీలవేణి కన్నీటి పర్యంతమైంది. నేను ఎవరికీ ఓటు వేశానో నా అంతరాత్మకు తెలుసు. ఇంట్లో పిల్లలతో ఉండగా, నన్ను బూతులు తిడుతూ నాపై ఇష్టానుసారంగా దాడికి పాల్పడ్డారు.

మాపై కక్షపూరితంగానే..
నాకు పార్టీలతో సంబంధం లేదు. ఓటు అనేది మా ఇష్టం. కానీ మేము ప్రతిపక్ష పార్టీకి ఓటు వేశామని మాపై దాడికి పాల్పడ్డారు. ఇలా దాడులు చేసుకుంటూ పోతే మా గ్రామంలో అందరిపైనా టీడీపీ మాజీ సర్పంచ్‌ చేతులో తన్నులు కాయాల్సిందేనా?  – బాధితురాలి భర్త రామారావు  

మితిమీరిన టీడీపీ అరచకాలు
టీడీపీ అరచకాలు మా గ్రామంలో ఎక్కువయ్యాయి. మాజీ సర్పంచ్‌ సూరాడ అప్పన్న కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు. ప్రతిపక్ష పార్టీకి ఓట్లు వేసిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా దాడులు చేస్తున్నాడు. ఈ దాడులు కొనసాగితే తీవ్ర పరిణామాలుంటాయి?– సీహెచ్‌ దానయ్య, వైఎస్సార్‌సీపీ నాయకుడు

మరిన్ని వార్తలు