వైఎస్సార్‌సీపీలో చేరారంటూ దాడి

19 Nov, 2018 13:45 IST|Sakshi
పోలీసులకు బాధితుడు గోపీచౌదరి ఫిర్యాదుపెరుగుతున్న నాని అనుచరుల దౌర్జన్యాలు

ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. చంద్రగిరిలో అప్పుడే యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అనుచరులు అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా  వైఎస్సార్‌ సీపీలో చేరిన వారిపై దాడులకు తెగబడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నారు. అంతేకాకుండా మండల వ్యాప్తంగా దళితులను, కార్యకర్తలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారు.

చిత్తూరు, చంద్రగిరి: మండలంలోని మొరవపల్లికి చెందిన గోపీచౌదరి వైఎస్సార్‌సీపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై తన కార్యకర్తలతో కలిసి మూడు రోజుల క్రితం చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరాడు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన గోపీచౌదరి వైఎస్సార్‌సీపీలో చేరడంపై నాని అనుచరులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో స్థానిక కొత్తపేటలోని దోస కార్నర్‌ వద్ద పని చేసుకుంటున్న గోపీచౌదరిపై దాడికి పాల్పడ్డారు. ‘నీకు ఎంత ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీలో చేరుతావ్‌.. నువ్వు ఇక్కడ దోస కార్నర్‌ ఎలా నడుపుతావో చూస్తాం.. మొరవపల్లిలో నీ ఇంటిని నేలమట్టం చేస్తాం’ అంటూ బెదిరించారు. కర్రలతో దాడి చేశారు. నేలపై పడేసి కాళ్లతో తన్నారు. ఇంతలో అటుగా వెళుతున్న కొంతమంది కేకలు వేయడంలో వారు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌కు చేరుకుని బాధితుడితో కలిసి ఫిర్యాదు చేశారు.

నాని అనుచరులను అరెస్టు చేయాలంటూ నిరసన
నియోజకవర్గంలో నాని అనుచరుల దౌర్జాన్యాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకులు స్థానిక పోలీసు స్టేషన్‌కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. గోపీచౌదరిపై దాడికి పాల్ప డిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ నిరసనకు దిగేందుకు సమాయత్తమయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ ఈశ్వరయ్య స్టేషన్‌కు చేరుకుని నాయకులతో చర్చించారు. చంద్రగిరిలో ఇప్పటి వరకు లేని సంస్కృతిని టీడీపీ నాయకులు తీసుకొస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. రౌడీయిజాన్ని, దాడులకు పాల్పడే వారిని ఉపేక్షిం చేది లేదని తేల్చిచెప్పారు. గోపీ చౌదరిపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి, నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నాయకులు నిరసన విరమించుకున్నారు. నాయకులు మాట్లాడుతూ ఇన్నేళ్ల రాజకీయంలో చంద్రగిరిలో ఏనాడు ఇలాంటి దాడులు జరగలేదన్నారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివర్తి నాని ఖరారైనప్పటి నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. తమ నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపిం చిన శాంతి మార్గంలోనే నడుస్తామన్నారు. టీడీపీ నాయకుల దాడితో ఇప్పటికే మండల వ్యాప్తంగా ప్రజలు ఆ పార్టీని అసహ్యంచుకుంటున్నారని తెలిపారు. బాధితుడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు.

టీడీపీపై స్థానికుల ఆగ్రహం
చిత్తూరుకు చెందిన నాని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించినప్పటి నుంచి చిత్తూరు రౌడీ యిజాన్ని ఇక్కడ చలాయిస్తు న్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడులు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న చంద్రగిరిలో ఇలా దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు ఎన్నికల్లో మాత్రమే చేయాలని, తర్వాత అభివృద్ధి  కోసం పనిచేయాలని సూచిస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు