ఫ్లెక్సీల రగడ....

17 Jan, 2019 12:20 IST|Sakshi
ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమవుతున్న దామోదర నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు

సీఎం సాక్షిగా రెచ్చిపోయిన నాని అనుచరులు

రెండు సుమోల్లో వచ్చి వృద్ధుడిపై దాడి ముంగళిపట్టులో బీభత్సం

ప్రయాణికులు అడ్డుకోకుంటే... ప్రాణాలు తీసేవాళ్లే

విరిగిన ఎముకలు..రుయాలో చికిత్స

తిరుపతి రూరల్‌/ చంద్రగిరి: ఫ్లెక్సీల  రగడ పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతోంది. అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను తొలగిం చాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినా, కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఫలితంగా పల్లెల్లో దాడుల సంస్కృతి పెరిగిపోతోంది. ఫ్లెక్సీల రగడతో సీఎం సొంత మండలంలో ఉండగానే టీడీపీ నేత పులివర్తి నాని అనుచరులు రెచ్చిపోయారు. పార్టీ ఫ్లెక్సీలను కట్టారంటూ చిత్తూరు నుంచి రెండు సుమోల్లో వచ్చిన రౌడీలు వృద్ధుడిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన మండల పరిధిలోని ముంగళిపట్టులో జరిగింది.

బాధితుడి వివరాల మేరకు...  దివంగత వైఎస్సార్‌పై ఉన్న అభిమానం, జగనన్న ప్రకటించిన నవరత్నాలకు ఆకర్షితుౖడై ముంగళిపట్టుకు చెందిన దామోదర నాయుడు సంక్రాంతి సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన హేమాంబర్‌ నాయుడు సోమవారం రాత్రి పాల కేంద్రం వద్దకు వెళ్తున్న దామోదర నాయుడును దుర్భాషలాడాడు. ఫ్లెక్సీలను తీసివేయాలని హెచ్చరించి, బెదిరించాడు. దాంతో హేమాంబర్‌ నాయుడుతోపాటు అతని బావమరిది, మరికొంత మంది దామోదర్‌ నాయుడు ఇంటికి వెళ్లి బెదిరించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో దామోదర్‌ నాయుడు పొలం వద్దకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రెండు సుమోల్లో రౌడీలను తీసుకొచ్చి, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

ప్రయాణికులు అడ్డుకోకుంటే... ప్రాణాలు తీసేవాళ్లే
సుమారు 15 మందితో కూడిన  రౌడీ మూక దామోదర నాయుడుపై పడి, కర్రలతో తీవ్రంగా దాడి చేసింది. ఒకే వ్యక్తిని అంత మంది కలసి దాడి చేస్తున్న వైనాన్ని అటుగా వెళ్తున్న ప్రయాణికులు గమనించారు.  పెద్ద ఎత్తున ప్రయాణికులు చేరుకుని అడ్డుకోవడంతో దామోదర నాయుడును వదిలేసి పారిపోయారు. ప్రయాణికులే అక్కడికి రాకుంటే దామోదర నాయుడును అంతమొందించేవారని, వారే తన ప్రాణాలు కాపాడారని దామోదర నాయుడు తెలిపాడు. గాయపడిన దామోదర నాయుడును పోలీసులు చంద్రగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

చిత్తూరు నుంచి రౌడీలు...
దామోదర నాయుడును అంతమొందించాలనే వ్యూహంతో నాని అనుచరులు చిత్తూరు నుంచి ముంగలిపట్టుకు చేరుకున్నారు. అదే గ్రామంలోని స్థానిక టీడీపీ నాయకుల అండగా ఈ దారుణానికి పాల్పడినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాడి విషయం తెలుసుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆస్పత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న దామోదర నాయుడును పరామర్శించారు. ‘ఫ్లెక్సీలు తీయనన్నందుకు చావబాదారని, వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని’ దామోదర నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ ఎమ్మెల్యేకు తమ గోడు వెల్లబోసుకున్నారు. న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటామని బాధితులకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు. అనంతరం వైద్య పరీక్షలు చేసిన వైద్యులు రెండు ఎముకలు విరిగినట్లు గుర్తించారు.   ఆయనను ఆస్పత్రి సిబ్బంది 108లో తిరుపతి రుయాకు తరలించారు.

మరిన్ని వార్తలు