టీడీపీ వర్గీయుల బరితెగింపు 

3 Dec, 2019 11:10 IST|Sakshi
కూర్చీలతో దాడికి పాల్పడుతున్న టీడీపీ వర్గీయులు(ఇన్‌సెట్‌)లో గాయపడిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నిక్కు సత్యం

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి 

ముగ్గురికి గాయాలు 

వైద్యం కోసం ఒకరిని శ్రీకాకుళం తరలింపు 

సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఘటన 

ఎల్‌.ఎన్‌.పేట: జిల్లాలో ఎక్కడో ఓ చోట టీడీపీ నాయకులు నిత్యం బరితెగిస్తూనే ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేక వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. నియోజకవర్గంలోని కొత్తూరు మండలానికి చెందిన కుంటిభద్రకాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడి దాడిచేసి హతమార్చిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటన మరుకముందే మరో ఘాతుకానికి తెగబడ్డారు. మండల పరిషత్‌ ప్రాంగణంలో జరిగిన ఉపాధి హామీ పథకం ప్రజా వేదికలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం వర్గీయులు దాడి చేశారు. ఇందులో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. మండలంలోని 19 పంచాయతీల్లో 2018 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2019 మార్చి ఆఖరు వరకు జరిగిన ఉపాధి పనులకు సోషల్‌ అడిట్‌ను సోమవారం నిర్వహించారు.

ఈ ప్రజావేదికలో కరకవలస పంచాయతీకి సంబంధించిన ఆడిట్‌లో గుర్తించిన అంశాలను సోషల్‌ ఆడిట్‌ డీఆర్పీ బి.అశోక్‌కుమార్‌ సభలో చదివి వినిపిస్తున్నారు. బుక్క చిన్నమ్మడు 2018 ఏప్రిల్‌ 5 నుంచి 2019 ఏప్రిల్‌ 30వ తేదీల మధ్యలో పనులకు వెళ్లినట్లు మస్టర్లు నమోదయ్యాయన్నారు.  అక్కడే ఉన్న చిన్నమ్మడు భర్త, వైఎస్సార్‌సీపీ నాయకుడు జనార్దనరావు మాట్లాడుతూ నా భార్య ఒక్కరోజు కూడా ఉపాధి పనికి వెళ్లలేదన్నారు. ఆమెకు డబ్బులు కూడా అందలేదన్నారు. ఆమె పేరుతో రూ.13,839 సంబంధిత ఫీల్డ్‌ అసిస్టెంట్‌ స్వాహా చేసినట్లు ఆరోపించారు. సభలోనే ఉన్న మాజీ ఎంపీపీ భర్త, టీడీపీ నాయకుడు ఒమ్మి ఆనందరావు కలుగుజేసుకున్నారు. ఇది మా ఊరు, మా కుటుంబానికి చెందిన సమస్య అని, మీరు జోక్యం చేసుకోవద్దని జనార్దనరావు అన్నారు.

వేదికపై ఉన్న డ్వామా పీడీ  హెచ్‌.కూర్మారావు కలుగచేసుకుని తప్పు చేస్తే ఎవరినీ వదిలేది లేదని, అవసరం అనుకుంటే విజిలెన్స్‌ విచారణకు ఆదేశిస్తాన్నారు. ఇంతలో అక్కడున్న టీడీపీ వర్గీయులు కుర్చీలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విసిరారు. వైఎస్సార్‌సీపీకి చెందిన నిక్కు సత్యంకు తీవ్ర, బుక్క జనార్దనరావు, బుక్క చంద్రరావులకు స్వల్పగాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని ఆమదావలస సీఐ బి.ప్రసాదరావు పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సభలో పాల్గొన్న అధికారులను, కార్యాలయం సిబ్బందిని, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. తలపైన, నుదుటిపైన తీవ్రగాయాలైన నిక్కు సత్యంను లక్ష్మీనర్సుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందజేశారు. 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని డాక్టర్‌ రెడ్డి హేమలత తెలిపారు. నిక్కు సత్యంను స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు పరామర్శించారు. టీడీపీ వర్గీయులపై వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి చెందిన నలుగురిని వైఎస్సార్‌సీపీ నాయకులు గాయపర్చారని మరో ఫిర్యాదు అందిందని సరుబుజిలి ఇన్‌చార్జి ఎస్‌ఐ జి.అప్పారావు తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా