పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ నేతల దాడి

5 Jun, 2016 08:26 IST|Sakshi

వరికుంటపాడు: మండలంలోని గువ్వాడి క్లస్టర్ పంచాయతీ కార్యదర్శి కె.వెంకట్రామిరెడ్డిపై టి.బోయమడుగుల టీడీపీ నేత తోడెందుల వెంకటేశ్వర్లు యాదవ్ వర్గీయులు దాడిచేసిన సంఘటన శుక్రవారం రాత్రి వరికుంటపాడులో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. కార్యదర్శి కె.వెంకట్రామిరెడ్డి ఏడాది క్రితం గువ్వాడి పంచాయతీ క్లస్టర్‌కు కార్యదర్శిగా నియమితులయ్యారు. టి.బోయమడుగుల కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపడుతున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత తోడెందుల వెంకటేశ్వర్లు యాదవ్ అనుచరులకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు.దానిద్వారా ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ కోసం మీసేవలో దరఖాస్తు చేశారు. మీసేవలో జరిగిన తప్పువల్ల మరణ ధ్రువీకరణ పత్రంలో చనిపోయిన తేదీ తప్పు దొర్లింది. దీంతో టీడీపీ నేత మీసేవ ద్వారా వచ్చిన సర్టిఫికెట్‌లో చనిపోయిన తేదీ ఏదైతే నమోదైందో అదే తేదీతో తిరిగి మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చారు. అలా కాదనడంతో వివాదం మొదలైంది.

దీనిపై ఎంపీపీ వెంకటాద్రి వద్ద  పంచాయతీ జరిగింది. కానీ కార్యదర్శి తేదీ మార్చి సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన్ను టి.బోయమడుగుల పంచాయతీ కార్యదర్శిగావున్న బాధ్యతలను తొలగించి వేరే కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. యినా ఆ టీడీపీ నేత పలు రకాలుగా బయటి వ్యక్తులతో దుర్భాషలాడుతున్నారని తెలుసుకొని శుక్రవారం రాత్రి పంచాయతీ కార్యదర్శి వెంకట్రామిరెడ్డి సదరు నేతకు ఫోన్ చేసి అడిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇది జరిగిన కొంతసేపటికి టీడీపీ నేత అనుచరులు వరికుంటపాడులోని తన గదిలో పిడిగుద్దులు గుప్పించి రికార్డులను చించేశారు. చుట్టుపక్కల వారు రావడంతో మోటర్‌బైక్‌లు అక్కడే పడేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం బాధితుడు ఎస్సై కె.నాగార్జునరెడ్డికి తనపై జరిగిన దాడిని వివరించి మోటర్‌బైక్‌లను వారికి అప్పగించారు. ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

 దాడిపై కార్యదర్శుల ఖండన
పంచాయతీ కార్యదర్శి వెంకట్రామిరెడ్డిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కార్యదర్శులు డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్‌చేసి తగిన చర్యలు తీసుకోకపోతే సోమవారం విధులకు గైర్హాజరు కావడమే కాకుండా ధర్నా చేపడతామన్నారు. గతంలో కూడా మహ్మదాపురం సర్పంచ్ బంధువు పంచాయతీ కార్యదర్శి వెంకటకృష్ణపై దాడికి పాల్పడ్డారని గుర్తుచేశారు.
 

మరిన్ని వార్తలు