టీడీపీ నేతల పైశాచికత్వం 

4 Sep, 2019 10:19 IST|Sakshi

సాక్షి, గుంటూరు(తాడికొండ) : రాజధాని తాడికొండ, తుళ్లూరు ప్రాంతాల్లోని టీడీపీ నేతల నోళ్లకు అడ్డూఅదుపూ లేదు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై మూడు నెలల వ్యవధిలో రెండు సార్లు నోరు పారేసుకున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు నాడు సొంత పార్టీలో ఉన్న దళితులను ఇబ్బందులకు గురి చేయడంతో ఎన్నికల్లో వారికి దిమ్మతిరిగే షాకిచ్చారు. దీంతో అక్కసు పెంచుకున్న వారు తమకు ఓట్లేయలేదంటూ గ్రామాల్లో దళితులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజధానిలో ప్రతిపక్ష నేత పర్యటిస్తే మైల పడిందంటూ పసుపు నీళ్లు చల్లడం వంటి పైశాచిక ఘటనలు వీరికే చెల్లింది. చంద్రబాబు అండదండలతో రాజధాని ప్రాంతంలో దళితులపై దాడులు, పచ్చనేతల ఆగడాలు మచ్చుకు కొన్ని....
⇔ ఎన్నికల రోజు తుళ్లూరు మండలం పెదపరిమిలో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌ చేస్తున్నారనే సమాచారంతో పోలింగ్‌ బూత్‌ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకుడు పుల్లారావు, అతని అనుచరులు అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ సాధారణంగా కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. 
⇔ తాజాగా వినాయకచవితి సందర్భంగా తుళ్లూరు మండలం అనంతవరంలో విగ్రహం వద్ద పూజలు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని గ్రామానికి చెందిన కొమ్మినేని శివయ్య మరి కొందరు పరుష పదజాలంతో దూషించారు. శాసన సభ్యురాలు ఏడ్చేసినప్పటికీ వారిలో మార్పు రాలేదు. అడ్డుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడి చేశారు.  
⇔ నెక్కల్లులో స్థల వివాదంలో బీసీ వర్గానికి చెందిన మహిళలపై దాడి చేసిన టీడీపీ నాయకులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నారని తెలుసుకొని ఆటో కోసం రోడ్డుపై వేచి చూస్తుండగా ట్రాక్టరుతో తొక్కించి హత్య చేశారు.

విలేకర్లపైనా దాడులు 
⇔ 2017లో రాజధానిలో జరుగుతున్న భూదందాలపై వార్తలు ప్రచురించినందుకు అప్పటి సాక్షి విలేకరి బాకి నాగేశ్వరరావు, సాక్షి ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధి రమేష్‌పై కేసులు నమోదు చేశారు. ఇప్పటికీ ఈ తప్పుడు కేసులలో వీరు నిందితులుగా కొనసాగుతుండటం గమనార్హం. తాడికొండ ప్రాంతానికి చెందిన ఓ విలేకరిపైనా ఇదే అనుచిత వైఖరి ప్రదర్శించారు.  
⇔ ఉద్దండరాయునిపాలెంలో చెరుకు తోటలు తగలబెట్టిన ఘటనలో వైఎస్సార్‌ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయించారు. రాజధానిలో పర్యటిస్తున్న నాటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు పెదపరిమి సెంటర్‌లో ఆపి తమ సమస్యలు తెలుపుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఇంతటితో ఆగకుండా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తే రాజధానిలో మైల పడిందంటూ పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసే పైశాచికత్వాన్ని ప్రదర్శించారు.  

నాటి టీడీపీ ఎమ్మెల్యేనా..
వర్గ పోరులో భాగంగా వారి సామాజిక వర్గానికి కొమ్ముకాయడం లేదనే అక్కసుతో ఆయనను టీడీపీ నాయకులే పలుమార్లు బెదిరింపులకు గురి చేశారు. బేజాత్పురం గ్రామంలో కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేని ఓ టీడీపీ సీనియర్‌ నాయకుడు తమ గ్రామంలో గంటకుపైగా నిర్భందించారు. చివరకు ఎన్నికల సమయంలో సైతం శ్రావణ్‌కుమార్‌కు టికెట్‌ ఇస్తే ఓడిస్తామంటూ బహిరంగంగా ప్రకటనలు చేశారు. దీంతో దళితులంతా వైఎస్సార సీపీకి అండగా నిలిచారు.
 
భూముల విషయంలోనూ..
సాధారణ భూములకు ఇచ్చే ప్యాకేజీని దళితుల లంక, అసైన్డ్‌ భూముల రైతులకు ఇప్పించడంలో ఓ సామాజిక వర్గం ఏ మాత్రం చొరవ చూపలేదు. దళితుల పక్షాన పోరాడిన వామపక్షాల నాయకులను సైతం అడ్డుకొని దాడులకు దిగారు.

అగ్రవర్ణాల ఆధిపత్యం ఎప్పటి నుంచో..
కొన్ని తరాలుగా ఈ ప్రాంతంలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోంది. దళితులపై దాడులు చేయడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా బెదిరించే స్థాయికి ఎదిగారంటే చంద్రబాబు ఆ సామాజిక వర్గానికి కొమ్ము కాయడమే కారణం. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా