కార్యకర్తలపై దాడి హేయమైన చర్య

2 Jul, 2019 06:34 IST|Sakshi
బాధితులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కంబాల జోగులు 

సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. సంతకవిటి మండలం కృష్ణంవలస గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన దాడిలో గాయపడిన బాధిత కుంటుంబాలను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా దాడి కారణంగా కార్యకర్తల ఇళ్లలో విరిగిపోయిన తలుపులు, కిటికీలు, టీవీలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు గూండాలు మాదిరిగా అమాయక ప్రజల ఇళ్లపై దాడులకు తెగబడడం దారుణమన్నారు. గత ఐదేళ్లుగా చేసిన దాడులకు ప్రతిఫలంగా ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును మర్చిపోయారా అంటూ దుమ్మెత్తిపోశారు. వైఎస్సార్‌సీపీలో చేరినందుకు కక్షగట్టి దాడులకు పాల్పడితే క్షమించేదిలేదని హెచ్చరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులని కఠినంగా శిక్షించాలని రాజాం రూరల్‌ సీఐ పి.శ్రీనివాసరావుకు ఆదేశించారు. గ్రామాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
బాధితుల కన్నీరుమున్నీరు
ఎమ్మెల్యే కంబాల జోగులు ఎదుట కృష్ణంవలస గ్రామానికి చెందిన కె.సూర్యారావు, దాసరి సింహాచలం, బాలకృష్ణ తదితర బాధిత కుటుంబాలకు చెందిన మహిళలు, చిన్నారులు కన్నీరుమున్నీరయ్యారు. తమను చంపేస్తామని, ఊర్లో ఉండనీయకుండా చేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని వాపోయారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు వేసినందుకు గ్రామంలో తమకు ప్రాణహాని ఉందని తెలియజేశారు. తమకు ఎటువంటి హాని జరగకుండా చూడాలని కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే జోగులు సీఐతో మాట్లాడి భయపెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురపు జగన్‌మోహనరావు, పార్టీ మండల కన్వీనర్‌ గురుగుబెల్లి స్వామినాయుడు, పార్టీ నాయకులు కనకల సన్యాసినాయుడు, రాగోలు రమేష్‌నాయుడు, చెలికాన మహేశ్‌బాబు, వావిలపల్లి వెంకటేశ్వర్లు, రూపిటి శ్రీరామమూర్తి, పప్పల గణపతి, పొన్నాడ ప్రసాదరావు, వావిలపల్లి రమణారావు, దవళ నర్శింహమూర్తి, పైల వెంకటనాయుడు, యడ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు