ఎన్నాళ్లీ హత్యా రాజకీయాలు?

25 Feb, 2020 09:38 IST|Sakshi

అధికారం పోయిందన్న అక్కసుతో రెచ్చిపోతున్న పచ్చ నేతలు  

జిల్లాలో  వైఎస్సార్‌సీపీ నేతలపై వరుసగా దౌర్జన్యాలు  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వం ఉన్నంతకాలం టీడీపీ నేతలు అధికార మదంతో విర్రవీగిపోయారు. ప్రత్యర్థులపై పాశవికంగా దాడి చేసి హతమార్చిన సందర్భాలున్నాయి. తప్పు చేసి ఎదురు కేసులు పెట్టిన దాఖలాలున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లూ ప్రతిపక్షాలకు చెందిన వారంతా టీడీపీ నేతలు ఏం చేసినా భరించాల్సిన పరిస్థితి ఉండేది. అధికారం కోల్పోయాక కూడా వారి ఆగడాలు ఆగడంలేదు. తమ సహజ శైలిలో కత్తులతో, కర్రలతో విరుచుకుపడుతున్నారు. పదవులు పోయాయన్న అక్కసుతో అతి కిరాతకంగా దాడులు చేసి చంపుతున్నారు. మొగుడ్ని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు కత్తులు, కర్రలతో దాడులు చేసి తిరిగి తమపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. వాటికి పచ్చపత్రికలు వత్తాసు పలుకుతున్నాయి. టీడీపీ నేతల దాడుల్లో ఎవరైనా చనిపోతే ఇరువర్గాల మధ్య ఘర్షణ అంటూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. అదే ఇరువర్గాల ఘర్షణలో టీడీపీ కార్యకర్తలు ఎవరైనా గాయపడితే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడిలో అంటూ వక్రభాష్యం చెబుతున్నాయి.

ఆ మధ్య కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌ భయభ్రాంతులకు గురి చేసేలా అధికారులపై విరుచుకుపడ్డారు. తిరిగి అధికారులు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ నేతలు కక్షపూరితంగా నడుచుకుంటున్నారని బుకాయించారు. ‘ఆఫీసులోనే తలుపులు వేసి మరీ బాదేస్తాను. చెట్టుకు కట్టి కాల్చేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. చెప్పింది చేయకపోతే నేనేంటో చూపిస్తా’ అంటూ ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శిని మాజీ విప్‌ కూన రవికుమార్‌ బెదిరించిన ఘటన చూశాం.

‘ఏయ్‌ ఎగ్రస్టాలు చేయొద్దు. ట్రైనింగ్‌ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్‌లెస్‌ ఫెలో’ అని  రాజధాని పోలీసు ఉన్నతాధికారులపై నోరు పారేసుకుని చివరికీ కోర్టు ఆదేశాలతో కింజరాపు అచ్చెన్నాయుడు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఇలా నోటికి, చేతికి పని చెప్పి దాడులు చేస్తున్నారు. అధికారం లేకపోయినా కూడా బరితెగిస్తున్నారు. ఏకంగా ప్రత్యర్థుల ప్రాణాలనే తీసేస్తున్నారు. దీనికి ఉదాహారణగా జలుమూరు మండలం అల్లాడపేటలో చోటు చేసుకున్న సంఘటననే తీసుకోవచ్చు. ఎన్నికలకు ముందు పార్టీ మారారన్న అక్కసుతో మాజీ సర్పంచ్‌ అచ్చెన్నపై టీడీపీ నేతలు అతి కిరాతకంగా కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. మహిళ అని చూడకుండా ఆయన మరదలు, తమ్ముడిపై కూడా దౌర్జన్యానికి దిగారు. ఇదే కాదు పార్టీ ఓడిపోయాక అనేక పర్యాయాలు దాడులకు దిగారు. వాటి వివరాలివి..

సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేట గ్రామంలో గత ఏడాది అక్టోబర్‌ 13వ తేదీన వలంటీరు వావిలపల్లి నారాయణరావుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోరంబోకు భూములను ఆక్రమించేందుకు యతి్నస్తున్నారని అధికారులకు సమాచారం ఇచ్చారన్న అక్కసుతో వలంటీర్‌పై దాడి చేశారు.  
సంతకవిటి మండలం కృష్ణంవలస గ్రామంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరారని అక్కసుతో ముద్దాడ బాలకృష్ణ, ముద్దాడ వీరన్న, దాసరి సింహాచలం, ముద్దాడ దుక్కన్నలపై టీడీపీ నేతలు దాడి చేశారు. ముద్దాడ జోగులు, ముద్దాడ రాములు, కిక్కర సూర్యరావుల ఇళ్లపై కూడా దాడి చేశారు.  
రేగిడి మండలం కాగితాపల్లిలో సెపె్టంబర్‌ 9వ తేదీన వలంటీర్‌ కిమిడి గౌరీశంకర్‌పై టీడీపీ నాయకులు ధర్మారావు అనుచరులు దాడి చేశారు.  
అక్టోబర్‌ 1వ తేదీన టెక్కలి మండలం చాకిపల్లి గ్రామంలో కుమారస్వామి, అప్పన్న అనే ఇద్దరు వలంటీర్లపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.  
సంత»ొమ్మాళికి చెందిన కళింగపట్నం ఆశ అనే వలంటీర్‌పై దాడి చేశారు.  
పలాస మండలం కిష్టిపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు జి.మోహనరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అయితే ఆయన తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
గత ఏడాది అక్టోబరు 15న కొత్తూరు మండలం కుంటిభద్రకాలనీలో వైఎస్సార్‌సీపీకి చెందిన కామట జంగం (58) అనే వ్యక్తిని హత్య చేశారు. 
తాజాగా సంతకవిటి మండలం శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపర్చారు. తాగునీటి పైపులైన్‌ బాగు చేస్తున్న సందర్భంలో అడ్డుకుని టీడీపీ నాయకులు దాడులకు దిగారు. 15మంది టీడీపీ కార్యకర్తలు సామూహిక దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.  

వలంటీర్లనూ వదల్లేదు 
అధికారం ఉన్నంత కాలం గ్రామాల్లో చక్రం తిప్పి, అజమాయిషీ చెలాయించిన టీడీపీ నేతలకు వలంటీర్ల వ్యవస్థ మింగుడు పడటం లేదు. తమ పెత్తనం చెల్లుబాటు కాదనే అక్కసుతో గ్రామాల్లో కొత్తగా నియమించిన వలంటీర్లపై దాడులకు దిగుతున్నారు. వారి అక్రమాలను ఎత్తి చూపిస్తున్నందుకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.   

కల్యాణం అచ్చెన్న మృతి.. 
శ్రీకాకుళం, జలుమూరు: జలుమూరు మండలం అల్లాడపేటలో ఆదివారం రాత్రి టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్‌ కల్యాణం అచ్చెన్న సోమవారం సాయంత్రం మృతి చెందారు. అచ్చెన్నను తొలుత రిమ్స్‌లో చేర్పించి మెరుగైన చికిత్స కోసం కిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతున్న అచ్చెన్న మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయారు. వైద్యులు చేసిన కృషికి ఫలితం దక్కలేదు. అచ్చెన్న మృతితో అల్లాడపేటలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ఉదయం నలుగురు సిబ్బంది ఉండగా రాత్రి పూట ఇద్దరు హెచ్‌సీలు, ఆరుగురు కానిస్టేబుల్స్‌ను మొత్తం 8 మందితో పికెట్‌ ఏర్పాటు చేసినట్లు జలుమూరు ఎస్‌ఐ వై.కృష్ణ తెలిపారు.

ఓటమి భయంతోనే..  
పక్కా ప్రణాళిక ప్రకారం కల్యాణం అచ్చెన్న హత్య జరిగింది. రానున్న స్ధానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలకు పాల్పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సుమారు 30 ఏళ్లపాటు టీడీపీలో కొనసాగిన అచ్చెన్న కుటుంబ సభ్యులు ఎన్నికల ముందు గత ఏడాది పార్టీ మారడాన్ని ప్రత్యర్థులు జీరి్ణంచుకోలేకపోయారు. ఈ ప్రాంతంలో రాజకీయంగా బలంగా ఉన్న అచ్చెన్న ఉంటే ఎన్నికల్లో నెగ్గుకురాలేమన్న భయంతో దాడి చేశారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో తన స్వంత ఆస్తులను అమ్ముకొని ప్రజాసేవ చేసిన అచ్చెన్నను టీడీపీ నాయకులు పొట్టను పెట్టుకోవడాన్ని ఆ గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు

కన్నీరు పెట్టిన మంత్రి కృష్ణదాస్‌ 
దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. కిమ్స్‌ ఆసుపత్రిలో బాధితులను, బాధిత కుటుంబీకులను సోమవారం పరామర్శించారు. బాధితులను చూసి చలించిపోయిన ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులకు తెగబడుతోందని, జిల్లాలో ఇటువంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే హోంమంత్రితో మాట్లాడామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు