డొంక కదులుతోంది !

10 Feb, 2020 12:03 IST|Sakshi
కురగల్లు గ్రామంలోని అసైన్డ్‌ భూములు

సీఐడీ లేఖతో రంగంలోకి   దిగనున్న ఐటీ అధికారులు

దళితులను మభ్యపెట్టి అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలు

మంగళగిరి: టీడీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు రాజధాని గ్రామాల్లో చేసిన భూ దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భూసమీకరణ పేరుతో రైతులను దగా చేసిన టీడీపీ ప్రభుత్వంతో పాటు నాయకులు, కార్యకర్తలు దళితులను మోసం చేసి వందలాది ఎకరాలు అసైన్డ్‌ భూములను కొనుగోలు చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో భూమాయపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలతో పాటు మరికొందరుపై కేసు నమోదు చేసిన సీఐడీ ఇప్పుడు రాజధానిలో 106 భూలావాదేవీలపై విచారణ జరపాలని సీఐడీ అధికారులు ఆదాయపు పన్నుశాఖ అధికారులకు లేఖ రాసింది. దీంతో టీడీపీ నాయకులు, భూములు కొన్న వారు కలవరపడుతున్నారు. 106 భూ లావాదేవీలలో అధికంగా 95 లావాదేవీలు మండలంలోని కురగల్లు గ్రామంలో ఉండడం విశేషం. 2018, 2019 సంవత్సారాలలో జరిగిన లావాదేవీపై విచారణ జరపాలని సీఐడీ విభాగం ఆదాయపుపన్నుశాఖను కోరింది. 

కురగల్లులో 550 ఎకరాల అసైన్డ్‌ భూములు...
మండలంలోని కురగల్లు గ్రామంలో 550 ఎకరాలు అసైన్డ్‌ భూములున్నాయి. రాజధాని ప్రకటించిన వెంటనే గద్దల్లా వాలిన టీడీపీ నాయకులు అసైన్డ్‌ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదని, తమకు విక్రయిస్తే ఎంతో కొంత ఆదాయం వస్తుందని దళితులను భయబ్రాంతులకు గురిచేశారు. దీంతో  ఆందోళనకు గురయిన భూ యజమానులు ఎంతో కొంత వస్తుందని భావించి ఎకరం రూ.10 నుంచి 20 లక్షల లోపు అమ్ముకున్నారు. మండలంలోని నీరుకొండ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, 2004 గుంటూరు పార్లమెంట్‌కు పోటీ చేసిన టీడీపీ నేత ఏకంగా గ్రామంలో 300 ఎకరాల అసైన్డ్‌ భూములను కొనుగోలు చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న మరో టీడీపీ నాయకుడు వంద ఎకరాలకుపైగా కొనుగోలు చేసి ఆ భూములను రాజధాని భూసమీకరణకు ఇచ్చి పరిహారంగా ప్లాట్లు పొంది వాటిని విక్రయించడం ద్వారా వందల కోట్లు అక్రమంగా ఆర్జించారు. అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసి పరిహారంగా వచ్చిన ప్లాట్లును విక్రయించి కోట్లు ఆర్జించిన నాయకులు 2019లో జరిగిన ఎన్నికలలో లోకేష్‌ గెలుపు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారనే విమర్శలున్నాయి. ఇప్పటికే గ్రామానికి చెందిన రైతు తమను మోసం చేసి భూములు కొనుగోలు చేశారని సీఐడీకి ఫిర్యాదు చేయగా అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రాజధానిలో జరిగిన భూలావాదేవిలపై విచారణ జరపాలని ఆదాయపు పన్నుశాఖను రాతపూర్వకంగా కోరడం అటు టీడీపీ నాయకులతో పాటు వారి అండతో భూములు కొనుగోలు చేసిన వారిని ఆందోళనకు గురిచేస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు