టీడీపీ దా‘రుణాలు’..!

17 Jun, 2018 09:39 IST|Sakshi

ఇష్టారాజ్యంగా టీడీపీ పయనం

ప్రభుత్వ పథకాలు తమవారికే..

సబ్సిడీ రుణాలు అప్పగించేందుకు ఎత్తుగడ

అర్హులకు న్యాయంపై అనుమానం

ఒంగోలు టౌన్‌: అధికార తెలుగుదేశం పార్టీ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. సమ న్యాయం విడిచి అన్నీ తమవారికే కట్టబెట్టేందుకు నిస్సుగ్గుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఒంగోలు నగర పరి«ధిలో సామాజిక భద్రత పింఛన్లలో అధికార పార్టీ ముద్ర కనిపించగా, తాజాగా సబ్సిడీ రుణాల్లో కూడా అదే మార్కు కోసం తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సబ్సిడీ రుణాల ఇంటర్వ్యూలో ఫోర్‌మెన్‌ కమిటీ పేరుతో అధికార పార్టీకి చెందిన నలుగురిని అక్కడ కూర్చోబెట్టి వారి కనుసన్నల్లో ఇంటర్వ్యూలు జరిగే విధంగా చూడటంపై అనేక విమర్శలకు తావిచ్చింది. సబ్సిడీ రుణాల ఇంటర్వ్యూల కోసం వచ్చిన దరఖాస్తుదారుల వివరాలను డివిజన్ల వారీగా తెలుగు తమ్ముళ్లు సేకరించారు. ఆ రుణాలు ఎవరికి ఇవ్వాలనే విషయమై జల్లెడ పడుతున్నారు. అధికారపార్టీ నాయకుల ఆశీస్సులులేని అనేకమంది సబ్సిడీ రుణాలు తమదాకా ఏమి వస్తాయంటూ ఉసూరుమంటున్నారు.

యూనిట్లు 1052.. దరఖాస్తులు 10708
ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఎంబీసీ, మైనార్టీ, క్రిష్టియన్‌ మైనార్టీ, కాపు, వైశ్య సామాజిక వర్గాలకు సంబంధించి వివిధ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 1052 యూనిట్లకు గాను 10708 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక వర్గాల వారీగా మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయ ఆవరణలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎస్సీలకు 335 యూనిట్లు కేటాయించగా, ఆన్‌లైన్‌లో 2552 మంది దరఖాస్తు చేసుకోగా, ఇంటర్వ్యూకు 1038 మంది హాజరయ్యారు. ఎస్టీలకు నిర్దిష్టంగా యూనిట్లు కేటాయించకపోవడంతో 315 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 136 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

 బీసీలకు 221 యూనిట్లు కేటాయించగా, ఆన్‌లైన్‌లో 3139 మంది దరఖాస్తు చేసుకోగా, 1586 మంది ఇంటర్వ్యూలకు వెళ్లారు. ఎంబీసీలకు 10 యూనిట్లు కేటాయించగా, 182 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 53 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈబీసీలకు 38 యూనిట్లు కేటాయించగా, ఆన్‌లైన్‌లో 417 మంది దరఖాస్తు చేసుకోగా, 206 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. కాపులకు 292 యూనిట్లు కేటాయించగా, 1743 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 754 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

మైనార్టీలకు 105 యూనిట్లు కేటాయించగా, 1812 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 673 మంది ఇంటర్వ్యూలకు వెళ్లారు. క్రిష్టియన్‌ మైనార్టీలకు 7 యూనిట్లు కేటాయించగా, 23 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 8 మంది  హాజరయ్యారు. వైశ్యులకు 55 యూనిట్లు కేటాయించగా, 496 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, 307 మంది ఇంటర్వ్యూలకు వెళ్లారు. 

ఒక్కో యూనిట్‌కు సగటున 100 మంది
గతంలో ఎన్నడూ లేనివిధంగా నగర పాలక సంస్థ పరిధిలో వివిధ రకాల యూనిట్లకు సంబంధించిన ప్రకటన వెలువడిన వెంటనే పెద్ద సంఖ్యలో సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో యూనిట్‌కు సగటున 100మంది దరఖాస్తు చేసుకున్నట్లయింది. దీంతో సామాన్యులు యూనిట్లు పొందాలంటే తల్లకిందులుగా తపస్సు చేయాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది తెలుగు తమ్ముళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

డివిజన్ల వారీగా తెలుగు తమ్ముళ్లను కలుసుకొని యూనిట్లు వచ్చేలా చూడాలని అనేకమంది దరఖాస్తుదారులు వేడుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్లు కూడా ఇదే అదనుగా భావించి డివిజన్ల వారీగా ఎంతమంది సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు, వారిలో తమ పార్టీకి చెందినవారు ఎంతమంది ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు ఎంతమంది ఉన్నారు, ఏ పార్టీకి చెందనివారు (న్యూట్రల్‌) ఎంతమంది ఉన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు. యూనిట్లకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించే సమయంలోనే ఫోర్‌మెన్‌ కమిటీ దరఖాస్తుదారులను స్క్రీనింగ్‌ చేసింది. 

పర్సంటేజీల పర్వం
సబ్సిడీ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి వాటిని మంజూరు చేయించే బాధ్యత తాము చూసుకుంటామంటూ కొంతమంది తెలుగు తమ్ముళ్లు పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యూనిట్లు మంజూరైన వెంటనే ప్రభుత్వం ఉచితంగా సబ్సిడీ ఇస్తోందని, అందులో తమ వాటా ఇంత అంటూ ముందుగానే బేరాలు కుదుర్చుకుంటున్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. యూనిట్లు రావాలంటే నానాయాగీ పడాలని, ఆ మాత్రం ఇచ్చుకోలేరా అంటూ తెలుగు తమ్ముళ్లు దరఖాస్తుదారులను ప్రశ్నిస్తున్నారు. దాంతో కొంతమంది పర్సంటేజీలు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు