డిష్యుం.. డిష్యుం

24 Dec, 2018 07:19 IST|Sakshi
గొడవ పడిన వారిని స్టేషన్‌కు లాక్కొని వెళ్తున్న పోలీసులు

టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ

రోడ్డున పడికొట్టుకున్న తమ్ముళ్లు

పోలీసుల లాఠీచార్జి

వైఎస్‌ఆర్‌ జిల్లా, చిన్నశెట్టిపల్లె(రాజుపాళెం) : రాజుపాళెం మండలంలోని చిన్నశెట్టిపల్లె గ్రామంలో అధికార పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. వారిని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా స్టేషన్‌ ముందే ఇరువర్గాల నాయకులు బాహాబాహాకి దిగారు. రాజుపాళెం మండలంలో మొదలైన గొడవ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి పాకింది. వివరాలు...రాజుపాళెం మండలంలోని చిన్నశెట్టిపల్లె గ్రామంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ మెట్టుపల్లె ప్రభాకర్‌రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు దాడి చేశారు. ఈ సంఘటనలో ప్రభాకర్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు గత ఐదు రోజులుగా గ్రామంలోని చిన్నకాలువ వద్ద మైలవరం పంట కాలువ పక్కనే సిమెంటు పైపులు వేయడం వల్ల వివాదం ఏర్పడింది. ప్రభాకర్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ అండదండలు ఉన్నాయి. ఆయనకు వరద వర్గానికి చెందిన సూర్యనరసింహారెడ్డి మధ్య గ్రామంలో మొదటి నుంచి వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ కారణంగా టీడీపీలోని సూర్యనరసింహారెడ్డి ఆదివారం ఉదయం పైపులను జేసీబీతో దౌర్జన్యంగా తీసివేయడంతో అక్కడ వివాదం చోటు చేసుకుంది. రాళ్లు, కట్టెలతో దాడులు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలను ప్రొద్దుటూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఘర్షణకు దారి తీసిన పైప్‌లైన్‌
చిన్నశెట్టిపల్లె గ్రామం సమీపంలోని మైలవరం పంట కాలువపై గ్రావెల్‌ రోడ్డు వేస్తున్నారు. ఈ పనులను ఆ గ్రామానికి చెందిన మెట్టుపల్లె ప్రభాకర్‌రెడ్డి సోదరుడు రామమోహన్‌రెడ్డి కాంట్రాక్టు చేస్తున్నాడు. పంట పొలంలో వర్షం నీరు నిల్వ ఉండకుండా కాలువలోకి వెళ్లేందుకు సిమెంటు పైపులు కూడా వేశారు. దీనిపై సూర్యనరసింహారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన వర్గీయులతో కలిసి జేసీబీతో పైపులనుతొలగించాడు. విషయం తెలియడంతో కాంట్రాక్టర్‌ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పైపులు ఎందుకు తొలగించారని వారిని ప్రశ్నించారు. ఇక్కడ మీ పొలం లేదు కదా.. నీకెందుకు అభ్యంతరమంటూ వారు సూర్యనరసింహారెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకొని ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు రాళ్లు, కట్టెలతో దాడులకు దిగడంతో కొంత సేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణలో ప్రభాకర్‌రెడ్డికి గాయాలు అయ్యాయి. సూర్యనరసింహారెడ్డి అనుచరులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

ప్రభాకర్‌రెడ్డితో పాటు సోదరుడు, కుమారుడు మాత్రమే ఉన్నారు. విషయం తెలుసుకున్న ప్రభాకర్‌రెడ్డి అనుచరులు కొద్ది సేపటి తర్వాత పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే సూర్యనరసింహారెడ్డి అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిన్నశెట్టిపల్లె పొలాల్లో రెండు వర్గాల మధ్య గొడవ జరగుతోందనే సమాచారం రావడంతో రాజుపాళెం ఎస్‌ఐ శ్రీనివాసులు, కమాండ్‌ కంట్రోల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పొలంలో ఉన్న ప్రజలను చెల్లాచెదురు చేశారు. ఇరువర్గాలకు చెందిన ముఖ్య నాయకులను రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రెండు వర్గాల వారిని వేర్వేరు స్టేషన్లకు తరలించారు. వీరికి చెందిన ద్విచక్రవాహనాలను, ట్రాక్టర్లను, జీపులను రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సంఘటనపై రెండు వర్గాల్లోని 10 మంది చొప్పున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

మరిన్ని వార్తలు