టీడీపీ రహస్య సమావేశంలో రగడ

9 Nov, 2018 07:57 IST|Sakshi
ఇన్‌చార్జి జయకృష్ణతో వాగ్వాదం చేస్తున్న టీడీపీ నాయకులు

శ్రీకాకుళం , సీతంపేట/ పాలకొండ రూరల్‌: టీడీపీ రహస్య సమావేశం రసాభాసగా మారింది. గురువారం రాత్రి పాలకొండ నియోజకవర్గ నాయకులు సీతంపేటలోని టీడీపీ కార్యాలయంలో రహస్య సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణపై ఉన్న అసంతృప్తితో ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండానే సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాలకొండ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా ప్రస్తుతం వ్యవహరిస్తున్న చింత సంఘంనాయుడిని పక్కన పెట్టి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావుకి సన్నిహితుడినని చెప్పుకుంటున్న కర్నేన అప్పలనాయుడుకు ఈ పదవి అప్పంగించేలా నియోజకవర్గ ఇన్‌చార్జి ఇప్పటికే పార్టీ అధిష్టానంకు లేఖ అందించటంతో వ్యతిరేకులంతా ఏకమై సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

సమావేశం జరుగుతోందనే విషయం తెలుసుకున్న జయకృష్ణ ఆకస్మికంగా ఆ ప్రదేశానికి రావడంతో అక్కడ ఉన్న వారు గట్టిగా నిలదీశారు. ఒంటెద్దు పోకడలు పోతున్నారని, పక్క మండలం రాజాం మాదిరి నియోజకవర్గంలో వ్యతిరేకత తప్పదని హెచ్చరించటంతో ఇన్‌చార్జికి ఇతర నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఒంటరైన జయకృష్ణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళాకు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశంలో సీతంపేట జెడ్పీ కోఆప్షన్‌ సభ్యులు తోట ముఖలింగం, కనీస వేతన సలహామండలి డైరెక్టర్‌ బిడ్డిక దమయంతి నాయుడు, టీడీపీ సీతంపేట మండల పార్టీ అధ్యక్షులు బిడ్డిక వెంటక రమణ, వీరఘట్టం మండలం ముఖ్య నాయకులు కండాపు వెంకటరమణ మూర్తి, పాలకొండ జెడ్పీటీసీ సామంతుల దామొదరావు, ఎంపీపీ ప్రతినిధి వారడ సుమంత్‌ నాయుడు, భామిని జెడ్పీటీసీ గోపాల్‌రావు, భామిని ఎంపీపీ ప్రతినిధి భూపతి ఆనంద్‌రావు, జగదీశ్వరావు,  పైల సత్యంనాయుడు తదితరులున్నారు.

>
మరిన్ని వార్తలు