దాచేస్తే దాగని కుట్ర

13 Nov, 2018 03:54 IST|Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హత్యకు పక్కాగా ప్రభుత్వ పెద్దల పన్నాగం

బీసీఏఎస్‌ డీజీ లిఖితపూర్వక సమాధానంతో వెలుగులోకి వాస్తవాలు

నిందితుడు శ్రీనివాసరావుకు అక్టోబరు నెలకు మాత్రమే  విమానాశ్రయంలోకి అనుమతి

కానీ ఏడాదిగా అనధికారికంగా ఎయిర్‌పోర్టులోనే పాగా 

గట్టి సెక్యూరిటీ ఉండే ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది?

అయినా పట్టించుకోని విమానాశ్రయ భద్రతాధికారులు 

ఎయిర్‌పోర్టు ముఖ్య భద్రతాధికారి వేణుగోపాల్‌కు, టీడీపీ నేత హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరితో సామీప్యం ఎలాంటిది?

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు సన్నిహితుడైన హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరి సహకారంతోనే కుట్ర

విమానాశ్రయ ఎంట్రీ పర్మిట్‌ కోసం కనీసం దరఖాస్తు కూడా చేయని శ్రీనివాసరావు, హర్షవర్ధన్‌ ప్రసాద్‌ 

నిందితుడికి తాత్కాలికంగా అనుమతి ఇచ్చినట్లు తాజాగా వెల్లడించిన ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ప్రకటనపైనా సందేహాలు

ప్రతిపక్ష నేతను హత్య చేసేందుకు ఏడాదిగా వ్యవహారాలు

హత్యాయత్నం కేసులో కీలకమైన ఈ కోణాల్లో దర్యాప్తు చేయని సిట్‌ అధికారులు 

కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వ పెద్దల స్క్రిప్ట్‌ను అమలు చేస్తున్న సిట్‌

విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం వెనక పకడ్బందీగా వ్యూహ రచన జరిగిందని, ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఈ కుట్రకు బీజం పడిందనే వాదనలకు బలం చేకూర్చేలా ఈ అంశాలపై బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) డీజీ నివేదిక ఇవ్వడం గమనార్హం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విశాఖ విమానాశ్రయంలోకి పదునైన కత్తి ఎలా వచ్చింది? నిందితుడు వీఐపీ లాంజ్‌లోకి ఎలా రాగలిగాడు? ఎవరు సహకారం అందించారు?... ఇదంతా కేవలం ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నందువల్లే సాధ్యమనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. బీసీఏఎస్‌ డీజీ కూడా లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో నిందితుడు శ్రీనివాసరావుకు కేవలం అక్టోబర్‌ నెలకు మాత్రమే ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పాస్‌ (ఏఈపీ) జారీ అయినట్లు ప్రస్తావించడం ఇది ముమ్మాటికీ పక్కా పథకం ప్రకారం సాగిన కుట్ర అనే విషయాన్ని రుజువు చేస్తోంది. విమానాశ్రయంలో పనిచేసేందుకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన ఏఈపీ కోసం నిందితుడు కనీసం దరఖాస్తు కూడా చేయలేదని వెలుగులోకి రావడం గమనార్హం. జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగిన వెంటనే ఇది పబ్లిసిటీ కోసం జరిగిందని డీజీపీ వ్యాఖ్యలు చేయడం, విచారణ అవసరం లేదని సీఎం పేర్కొనడం, అనంతరం సిట్‌ దర్యాప్తు ప్రారంభమైనా ముందుకు సాగకపోవడం, టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరిని తూతూమంత్రంగా విచారించి వదిలేయడం, తాజాగా సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ డీజీ... నిందితుడికి అక్టోబర్‌ నెలకు మాత్రమే ఎయిర్‌పోర్టు ఎంట్రీ పాస్‌ ఉన్నట్లు పేర్కొనటం ఈ ఘటన వెనక పెద్దల ప్రమేయం ఉండటం వల్లే కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలకు బలం చేకూరుస్తోంది. 

నిందితుడు శ్రీనివాసరావుకు 2018, అక్టోబరు 1 నుంచి 30 వరకే తాత్కాలిక అనుమతి ఉందని తెలిపే బీసీఏఎస్‌ డీజీ నివేదిక 

విమానాశ్రయంలో ఏడాదిగా అనధికారికంగా పాగా
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును కుట్రదారులు వ్యూహాత్మకంగానే విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రవేశపెట్టారు. ఢిల్లీలోని బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ(బీసీఏఎస్‌) డీజీ కుమార్‌ రాజేష్‌చంద్ర రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డికి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ఇదే అంశాన్ని నిర్ధారిస్తోంది. నిందితుడు శ్రీనివాసరావుకు విమానాశ్రయం జోన్‌ ‘డి’లో  పనిచేసేందుకు 2018 అక్టోబరు 1వతేదీ నుంచి 30వతేదీ వరకు తాత్కాలిక ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పర్మిట్‌ (ఏఈపీ)ని ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ జారీ చేశారు. ఇదే విషయాన్ని బీసీఏఎస్‌ డీజీ లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. కానీ వాస్తవం ఏమిటంటే... నిందితుడు శ్రీనివాసరావు దాదాపు ఏడాదిగా విశాఖపట్నం విమానాశ్రయంలోని ఫ్యూజన్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు. సిట్‌ పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. కేవలం అక్టోబర్‌ నెలకు మాత్రమే అనుమతి ఉన్న నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో ఎలా కొనసాగాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. అనుమతిలేని వ్యక్తి విమానాశ్రయంలో ఏడాదిగా దర్జాగా తిరుగుతుంటే భద్రతా విభాగం అధికారులు ఎందుకు పట్టించుకోలేదన్నది సందేహాస్పదంగా మారింది.  

పక్కా పథకం ప్రకారమే..
ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కుట్రకు ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా తమకు నమ్మకస్తుడైన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ నిర్వాహకుడు హర్షవర్థన్‌ప్రసాద్‌ చౌదరిని సాధనంగా చేసుకున్నారు. ïఉత్తరాంధ్రలో పాదయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. ఆ సమయంలో అదను చూసి ఆయన్ను మట్టుబెట్టేందుకు విమానాశ్రయంలో ఉన్న హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరి రెస్టారెంట్‌ కేంద్రంగా పన్నాగం పన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల అండదండలతోనే హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరికి 2017లో విశాఖ  విమానాశ్రయంలో రెస్టారెంట్‌ లైసెన్సు లభించింది. నిబంధనలకు విరుద్ధంగా హర్షవర్థన్‌ ప్రసాద్‌కు చెందిన ఒలంపిక్స్‌ అసోసియేషన్‌కు గుర్తింపునిచ్చారు. రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్యపై పెత్తనం కట్టబెట్టారు. 

టీడీపీ టికెట్‌ ఇచ్చేలా హామీ!
గత ఎన్నికల్లో గాజువాక టీడీపీ టిక్కెట్‌ కోసం హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరి తీవ్రంగా ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ దక్కేలా హామీ కూడా ఇచ్చినట్టు కూడా సమాచారం. విమానాశ్రయ ముఖ్య భద్రతాధికారి వేణుగోపాల్‌కు హర్షవర్థన్‌ ప్రసాద్‌తోపాటు విశాఖ నగరానికి చెందిన నేరచరిత్ర ఉన్న ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీన్ని కూడా తమ కుట్రకు సాధనంగా చేసుకున్నారు.

భద్రతాధికారుల సహకారంతోనే..
నిందితుడు  శ్రీనివాసరావు అనధికారికంగా విమానాశ్రయంలో ఏడాదిగా మాటేసినా భద్రతా అధికారులు పట్టించుకోలేదు. రెస్టారెంట్‌కు సరుకుల సరఫరా ముసుగులో విచ్చుకత్తిని విమానాశ్రయంలోకి తీసుకువెళ్లేలా కథ నడిపారు. తాత్కాలిక ఏఈపీ ప్రకారం కూడా కేవలం ‘డి’ బ్లాక్‌ కు మాత్రమే పరిమితం కావాల్సిన శ్రీనివాసరావు ఏకంగా వీఐపీ లాంజ్‌లోకి ప్రవేశించాడు. దీన్ని కూడా భద్రతా ధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. వైఎస్‌ జగన్‌ రాక సందర్భంగా విమానాశ్రయ భద్రతా విభాగం కుట్ర కోణంతోనే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు తెరవెనుక నుంచి నడిపించిన ఈ కుట్ర కథలో శ్రీనివాసరావు, టీడీపీ నేత హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరి తెరముందు పాత్రలు కాగా... విమానాశ్రయ భద్రతాధికారులు అందుకు తమవంతు సహకారం అందించారన్నది స్పష్టమవుతోంది. 

ఏఈపీ కోసం దరఖాస్తే చేయలేదు 
నిబంధనల ప్రకారం విమానాశ్రయంలోని వివిధ విభాగాల్లో పనిచేసే వ్యక్తులకు ఏరోడ్రోమ్‌ ఎంట్రీ పాస్‌ (ఏఈపీ) తప్పనిసరిగా ఉండాలి. ఏఈపీ జారీకి కేంద్ర విమానయాన సంస్థ (ఏఏఐ) కొన్ని మార్గదర్శకాలను నిర్దేశించింది. ప్రైవేట్‌ వ్యక్తులకు ఒక రోజు నుంచి మూడు రోజులకు ఒక కేటగిరీలో,  నాలుగు రోజుల నుంచి 90 రోజులకు మరో కేటగిరీ కింద ఏఈపీలు కేటాయిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, విదేశీయులకు మరో రెండు కేటగిరీల కింద ఏఈపీ జారీ చేస్తారు. ఇందుకోసం సదరు వ్యక్తులు గుర్తింపు కార్డు, తాము పనిచేసే సంస్థ అనుమతిపత్రం, తమపై ఎలాంటి కేసులు లేవని నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌వోసీ) మొదలైనవి సమర్పించి దరఖాస్తు చేయాలి. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు గానీ అతడి తరపున రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరిగానీ ఎలాంటి దరఖాస్తు చేయలేదని కూడా బీసీఏఎస్‌ డీజీ వెల్లడించడం గమనార్హం. కనీసం ఏఈపీ కోసం దరఖాస్తు చేయకుండానే శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలో అనధికారికంగా మాటు వేసినట్లు దీనిద్వారా తేటతెల్లమవుతోంది. 
నిందితుడు శ్రీనివాసరావు ఏడాదిగా విమానాశ్రయంలోని రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడని పోలీసులు సమర్పించిన నివేదిక  

తాత్కాలిక అనుమతిపైనా సందేహాలు 
నిందితుడు శ్రీనివాసరావుకు 2018 అక్టోబరు 1వతేదీ నుంచి 30వతేదీ వరకు విమానాశ్రయంలో పనిచేసేందుకు తాత్కాలిక ఏఈపీ జారీ చేశామని విమానాశ్రయ డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి బీసీఏసీ డీజీకి చెప్పడం సందేహాలకు తావిస్తోంది. నిందితుడు  శ్రీనివాసరావుగానీ అతడి తరపున రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరిగానీ అసలు ఏఈపీ కోసం దరఖాస్తే చేయలేదని బీసీఏఎస్‌ డీజీ కుమార్‌ రాజేష్‌చంద్ర రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి లిఖితపూర్వకంగా తెలిపారు. ఆయనే మరో ప్రశ్నకు సమాధానంగా నిందితుడు శ్రీనివాసరావుకు 2018 అక్టోబరు 1 నుంచి 30వతేదీ వరకు విమానాశ్రయంలో పనిచేసేందుకు తాత్కాలిక ఏఈపీని విమానాశ్రయ డైరెక్టర్‌ జారీ చేశారని వెల్లడించారు. ఈ తాత్కాలిక ఏఈపీపై న్యాయ నిపుణులు సందేహాలు వ్యక్తం చేసున్నారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం అనంతరం తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అప్పటికప్పుడు నెల రోజుల గడువు కలిగిన  తాత్కాలిక ఏఈపీని సృష్టించారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.  ప్రభుత్వ పెద్దలు, రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరికి  విమానాశ్రయ భద్రతా అధికారులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు శ్రీనివాసరావుకు అక్టోబరు నెలకు సంబంధించి జారీ చేశారని చెబుతున్న తాత్కాలిక ఏఈపీ ఎంతవరకు సరైందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

శ్రీనివాసరావు టీడీపీ వర్గీయుడే 
నిందితుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులంతా టీడీపీకి చెందినవారేనని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ సోదాహరణంగా వెల్లడించారు. టీడీపీ వర్గీయులైన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులను అడ్డుకున్న తీరు, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఉదంతాన్ని ఆయన బయటపెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడే శ్రీనివాసరావును రెస్టారెంట్‌ యజమాని హర్షవర్థన్‌ ప్రసాద్‌ చౌదరి వద్దకు చేర్చారని కూడా ఆయన చెప్పడం గమనార్హం. 

కుట్ర కోణాన్ని పట్టించుకోని సిట్‌ 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను అంతమొందించేందుకు ప్రభుత్వ పెద్దలు ఇంత పక్కాగా సాగించిన కుట్రపై సిట్‌ అధికారులు కనీసం దృష్టి సారించలేదు. శ్రీనివాసరావు ఏడాదిగా విశాఖపట్నం విమానాశ్రయంలో అనధికారికంగా మాటేసిన వైనం, అతడి కుటుంబం టీడీపీ సానుభూతిపరులనే వాస్తవాలను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే ఈ హత్యాయత్నం వెనుక కుట్ర కోణాన్ని కప్పిపుచ్చేందుకు కేసును నీరుగారుస్తున్నారని ఓ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు. 

స్పందించేందుకు నిరాకరించిన ఎయిర్‌పోర్టు డైరెక్టర్, ముఖ్య భద్రతాధికారి
ఈ అంశాలపై విశాఖ ఎయిర్‌పోర్డు డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, ముఖ్య భద్రతాధికారి వేణుగోపాల్‌ను సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా సూటిగా స్పందించేందుకు నిరాకరించారు. బీసీఏఎస్‌ డీజీ ఇచ్చిన నివేదికకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ అంతకుమించి స్పందించేందుకు నిరాకరించారు. ఇదే అంశంపై వేణుగోపాల్‌తో మాట్లాడేందుకు  ప్రయత్నించగా స్పందించేందుకు ఆయన నిరాకరించారు. 

మరిన్ని వార్తలు