అర్ధరాత్రి ఇష్టారాజ్యం

13 Nov, 2017 10:38 IST|Sakshi
ఉలవపాడు పాత బస్టాండ్‌లో నిర్మించిన దిమ్మె

గుట్టుచప్పుడు కాకుండా ఎన్టీఆర్‌ విగ్రహ నిర్మాణ పనులు

అనుమతి లేకుండా రాత్రికి రాత్రే పనులు ప్రారంభం

ఇతర మహనీయుల విగ్రహాలు నిర్మించకుండా అడ్డుకట్ట

ఉలవపాడు: అధికారం మనదే.. మన పార్టీ నాయకుని విగ్రహం .. అనుమతితో మనకు పనేంటి అనుకున్నారు..అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు. శనివారం రాత్రి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు. అధికారులందరూ సహకరించినా పక్కన ఉన్న స్థలాలు, దుకాణాల చిరు వ్యాపారులు అడ్డుకుంటారని తెలిసి దిమ్మె గుట్టుచప్పుడు కాకుండా నిలబెట్టారు. ఉలవపాడు పాత బస్టాండ్‌ సెంటర్‌లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాలు.. సెంటర్‌లో చాలాకాలంగా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పదేళ్ల కాలంలో అప్పటి టీడీపీ ఇన్‌చార్జిలు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు వివాదాస్పదంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నించలేదు. దీని వలన ఇబ్బంది లేకుండా ఉండేలా చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే పోతుల రామారావు నియమించిన మండల ఇన్‌చార్జి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహం నిర్మించాలని భావించారు. వైఎస్సార్‌ విగ్రహం పక్కనే ఎన్టీఆర్‌ విగ్రహం ఉండాలని రోడ్డు పక్కన ఆర్‌అండ్‌బీ రోడ్డులో విగ్రహ దిమ్మెను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా రాత్రికి రాత్రి దిమ్మె నిర్మించడంతో పక్క దుకాణాల యజమానులు విస్తుపోయారు.

పట్టించుకోని అధికారులు
ప్రస్తుతం అనుమతి లేకుండా ఎలాంటి విగ్రహాలు నిర్మించకూడదని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఆర్‌అండ్‌బీ రోడ్డులో పంచాయతీ అనుమతి లేకుండా విగ్రహ దిమ్మె నిర్మించారు. అధికారులు షరామామూలుగా అధికార పార్టీకి లొంగిపోయారు. గతంలో జగ్జీవన్‌రామ్‌ బొమ్మ దిమ్మెను నిర్మించినప్పుడు సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు దగ్గరుండి దిమ్మె కట్టనీయకుండా అడ్డుకున్నారు. ఇక దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం విగ్రహం నిర్మించేందుకు కొందరు పనులు ప్రారంభిస్తే గంటకు పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. హైస్కూల్‌ సంఘంలో మృతి చెందిన ఓ ఆర్మీ సైనికుడి విగ్రహం కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి లేదని అలగాయపాలెం రోడ్డులో నిర్మించకుండా అడ్డుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క అధికారి, పోలీసులు ఆ పక్కకు రాకుండా పనులు జరిగాయంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం అవుతోంది.

వ్యవహారం వివాదాస్పదం
ప్రస్తుతం ఎన్టీఆర్‌ దిమ్మె అంశం చర్చనీయాంశంగా మారింది. దిమ్మె వెనుక ముఠా వర్కర్స్‌ యూనియన్‌ ఆఫీసు ఉంది. 20 ఏళ్ల క్రితం ఆ స్థలాన్ని కార్మికులు పోరాడి సాధించుకున్నారు. దాని ముందు ఎన్టీఆర్‌ విగ్రహ నిర్మాణానికి దిమ్మె ఏర్పాటు చేశారు.  ఆ యూనియన్‌ అధ్యక్షుడు నోరు మెదపకుండా ఉండేందుకు ఓ లోన్‌ శాంక్షన్‌ చేయించారు. గ్రీన్‌ అంబాసిడర్‌లో ఉద్యోగం ఇప్పించారు. పార్టీకి అనుకూలంగా ఉన్న ఎస్సీ నాయకులతో వారిని మాట్లాడనీయకుండా చేశారు. ఇటీవలే ఓ ఎస్సీ అధికారిపై దాడి జరిగిన పరిస్థితుల నేపథ్యంలో బస్డాండ్‌లో ఎస్సీ యూనియన్‌కు ఉన్న స్థలాన్ని కనపడనీయకుండా ఎన్టీఆర్‌  విగ్రహ దిమ్మెనిర్మించడం గమనార్హం. స్థానిక ఎమ్మెల్యే వివాదాలను పెంచి పోషిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.  

మరిన్ని వార్తలు