‘ఆకర్ష్’పై అంతర్మథనం

26 Feb, 2016 02:05 IST|Sakshi
‘ఆకర్ష్’పై అంతర్మథనం

నాడు కార్యకర్తలే దేవుళ్లంటూ బాబు ప్రశంసల వర్షం
నేడు కొత్తగా చేరేవారికి  తాయిలాల వల
తమ్ముళ్ల మధ్య చిచ్చు పెడుతున్న టీడీపీ అధినేత తీరు
పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చెలరేగుతున్న వివాదాలు
ఆది నుంచి జెండా మోసిన వారికి పలకరింపులు     కూడా కరువు
కొత్తవారిని అందలమెక్కిస్తున్నారంటూ కినుక
తమ సంగతి తేల్చాలని తమ్ముళ్ల డిమాండ్
 

సాక్షి ప్రతినిధి, గుంటూరు టీడీపీ అధినేత ఆకర్ష్ పథకం తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చుపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఆ పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం మొదలైంది. రెండేళ్లు గడిచినా నామినేటెడ్ పదవులు కట్టబెట్టకుండా చూద్దాం.. చేద్దాం అంటూ దాటవేత ధోరణి అవలంభించిన ప్రజా ప్రతినిధులు, మంత్రుల వద్దకు వెళ్లి తమ సంగతి తేల్చాలని ద్వితీయ శ్రేణి నాయకులు పట్టుపడుతున్నారు. ఎన్నికల తర్వాత కార్యకర్తలే దేవుళ్లు.. వారి రుణం తీర్చుకుంటాం.. అంటూ వారి త్యాగాల గురించి స్తుతించిన టీడీపీ నాయకులు కార్తకర్తలను విస్మరించి కొత్త వ్యక్తులను పార్టీలోకి తెచ్చి వారికి పదవులు కేటాయించాలని చూస్తుండటంతో వివాదాలు చెలరేగుతున్నాయి. ఆకర్ష్ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ చిన్నాచితక నాయకులను ఆకర్షించాలని పార్టీ అధినేత ద్వారా సంకేతాలు అందటంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అంతర్మథనం మొదలైంది. పార్టీలో ఉన్న కార్యకర్తలను విస్మరించి, కొత్తగా చేరుతున్నవారికి తాయిలాలు, ప్రలోభాలకు గురిచేస్తుండటంతో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఫలితాల తరువాత గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు చేసిన త్యాగాలు వర్ణిస్తూ ప్రసంగాలు చేశారు. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో తమకు మంచి అవకాశం రాబోతుందని ఆశించారు.

 సీన్ కట్ చేస్తే....
జెండాలు మోసిన కార్యకర్తల పరిస్థితి ఇప్పుడు టీడీపీలో అయోమయంగా తయారైంది. మా మంత్రిగారు, మా ఎమ్మెల్యే అంటూ అంటిపెట్టుకొని తిరిగిన వారికి చుక్కెదురైంది. ఇక మంత్రుల నియోజకవర్గాల్లో కొంతకాలంగా వారి దర్శన భాగ్యమే కష్టంగా మారింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో అయితే తమ సమస్యలు చెప్పుకొని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కలవాలని వచ్చిన వారికి ఆయన నుంచి స్పందన కరువైంది. ఒకటి రెండు పొడిమాటలు, చేద్దాం..చూద్దాం అనడం మినహా స్పష్టమైన హామీ కరువైంది. ఇంటి లోపలికి వెళ్లడం మాట అలా ఉంచి బయటకు వచ్చినప్పుడు తమ ైవె పు చూసి పలకరిస్తారని ఆశిస్తున్న ఆశావాహులకు అమాత్యులు కనీసం వారివైపు కూడా చూడకపోవటంతో నిరసన వ్యక్తం అవుతోంది. మిగిలిన నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇందుకు మినహాయింపు కాదు. తమ అభిమాన నాయకుడు మంత్రి అయ్యాడని, ఎమ్మెల్యే అయ్యాడని తమను అందలం ఎక్కిస్తారని కలలు కన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని గ్రహిస్తున్నారు.


ఎన్నికలకు ముందు చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరం
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో వలసలను ప్రోత్సహించారు. పార్టీ అధికారంలోకి వస్తే అందలం ఎక్కిస్తామని హామీల వర్షం కురిపించి పార్టీలో చేర్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి ప్రస్థానం ఇక్కడే ముగిసిపోయింది. పార్టీలో వారి స్థానం ఏమిటో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. ఒకరిద్దరు సీనియర్లు తమ సంగటేమిటని మంత్రుల వద్ద  ప్రస్తావిస్తే పార్టీ అధినేత సూచించిన దాని ప్రకారం కొత్తవారికి ఇప్పట్లో పదవుల విషయంపై స్పష్టత లేదని సమాధామిచ్చారు. దీంతో వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. ఈ క్రమంలో కొత్త వారిని కూడా పార్టీలోకి తెచ్చుకోవాలన్న ఆలోచన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీని ఎప్పుటి నుంచో నమ్ముకొని ఉన్న తమను కాదని కొత్తగా వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వటం తమ్ముళ్లలో మరింత నిరాశ నిసృహలకు కారణమవుతుంది.


పుకార్లను తిప్పికొడుతున్న పార్టీ నేతలు..
తమ పార్టీ కేడర్‌లో కలకలం సృష్టించేందుకు టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా టీడీపీ నేతలు అసరిస్తున్న అక్రమ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యత్నాలు ప్రారంభించారు.
 
 బెజవాడ పశ్చిమలో కలకలం..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీలో కలకలం ఆరంభమైంది. ఆ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ టీడీపీలో చేరడంతో మిగిలిన నేతల్లో కలకలం ఆరంభమైంది. మొదటి నుంచి పార్టీని బతికించిన అనేక మంది నాయకుల సేవలను పరిగణనలోకి తీసుకోకుండా అధినేత చంద్రబాబు జలీల్‌ఖాన్ చేర్చుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. పార్టీ ఇక్కడ మూడు ముక్కలు కావడం ఖాయమని, వర్గాలు, గ్రూపులుగా మారిపోతుందనే అభిప్రాయం వినపడుతోంది. ఇక జలీల్‌ను నమ్మి ఆయన వెంటనే కొనసాగుతున్న కొందరు ద్వితీయ శ్రేణినాయకులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. పార్టీ పునర్మిణానికి సమాయత్తం అవుతున్నారు.

మరిన్ని వార్తలు