క్వారీపై ‘పచ్చ’ జెండా

7 Mar, 2016 02:55 IST|Sakshi
క్వారీపై ‘పచ్చ’ జెండా

తెలుగు తమ్ముడు గుప్పెట్లో ఇసుక
లారీకి రూ.వెయ్యి, ట్రాక్టర్‌కు రూ.500  ఉచితం పేరుతో దోపిడీ

 
  పెదపులిపాక(పెనమలూరు): అందరికి ఉచితంగా ఇసుక ఇస్తానని సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటన చేసి కొద్ది రోజులకే టీడీపీ నేత క్వారీని తన గుప్పెట్లోకి తీసుకున్నారు. గ్రామంలోని ఇసుక క్వారీపై పచ్చజెండా ఎగురవేశారు. క్వారీలో ఇసుక లోడింగ్ తాను నిర్ణయించిన ధరలకే జరగాలని హుకుంజారీ చేశారు. ఉచితంగా ఇసుక తీసుకువెళదామని వచ్చిన వారు కంగుతిన్నారు. క్వారీలో ఇంతకాలం ఆన్‌లైన్ బుకింగ్‌లో ఇసుక అమ్మకాలు సాగాయి. బుక్ చేసిన దాదాపు 2500 డీడీలు పెండింగ్‌లో ఉన్నాయి. లోడింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్ ఆదివారం పని చేయలేదు. అధికారులు క్వారీ నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత అసలు తతంగం మొదలైంది. టీడీపీ నేత అనుచరులు క్వారీని కబ్జా చేశారు. ఇది నిజమేననుకుని లారీలు, ట్రాక్టర్ల యజమానులు క్వారీలో ఇసుకకు వచ్చారు. ఆ తరువాత అసలు పరిస్థితి చూసి వారు నివ్వెరపోయారు. లారీకి రూ.వెయ్యి, ట్రాక్టర్‌కు రూ.500 వసూలు మొదలు పెట్టారు. మొదటి రోజే దాదాపు రూ.ఐదు లక్షలు టీడీపీ నేత జేబులో పడ్డాయని వాహనదారులు చెబుతున్నారు.

సీఎం మాటను బే ఖాతరు చేస్తూ ఇక్కడ దందా మొదలైందని వాహన యజమానులు వాపోతున్నారు. క్వారీలో తామే లోడింగ్ చేసుకుందామంటే టీడీపీ నేత అనుచరులు అడ్డు తగులుతున్నారని చెబుతున్నారు. క్వారీని ప్రభుత్వం టీడీపీ నేతకు రాసి ఇచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో లోడింగ్ క్యూబిక్ మీటర్‌కు రూ.30. లారీకి రూ.180. ఇప్పుడు ఏకంగా రూ.వెయ్యి చేయటం దారుణమని తెలిపారు. ఉచిత ఇసుక జీవో విషయం తమకు తెలియదని స్థానిక అధికారులు చెబుతున్నారు. పెదపులిపాక క్వారీలో దందా జరుగుతున్నా కలెక్టరే పట్టించుకోవటం లేదని, ఇక తామేం చేయగలుగుతామని ఓ అధికారి(పేరు రాయవద్దన్నారు) తెలిపారు. కాగా దందా చేస్తే కోర్టును ఆశ్రయిస్తామని పలువురు సాక్షికి తెలిపారు.

మరిన్ని వార్తలు