పంచాయితీకి పిలిచి..

10 Mar, 2016 02:42 IST|Sakshi
పంచాయితీకి పిలిచి..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాష్టీకం
కొడవళ్లు, కర్రలు, రాళ్లతో దాడి
ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలు
అడ్డొచ్చిన మహిళలపైనా చెయ్యి చేసుకున్న వైనం

 
 
యాడికి మండలం కోన ఉప్పలపాడు వద్దనున్న కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద అదే గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగదీశ్వరరెడ్డి(30), దేవనాథ్‌రెడ్డి(45)పై టీడీపీ నేత, కాంట్రాక్టర్ గోపాల్‌రెడ్డి అనుచరులు ప్రభాకర్‌రెడ్డి, ధనుంజయ, రాజశేఖర్, విశ్వనాథ్, కులశేఖర్‌రెడ్డి తదితరులు బుధవారం దాడి చేశారు. కొడవళ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేసి గాయపరిచారు. అడ్డొచ్చిన మహిళలనూ ఈడ్చిపడేశారు.

 సమస్య ఏమిటంటే..
కోన రామలింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవానికి తలంబ్రాలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఇవ్వకూడదని టీడీపీ నేతలు ఆంక్షలు విధించారు. అంతటితో ఆగక అడ్డుకున్నారు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఈసారి కూడా పాటించాల్సిందేనని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పట్టుబట్టారు. దేవుడి విషయంలో రాజకీయాలు తగదని చెప్పారు. తమ సొంత పొలంలో బోరు వేసుకోకుండా అడ్డుకుంటున్నారు. దీంతో చెట్లు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కోన రామలింగేశ్వరస్వామి ఆలయంలో పంచాయతీ చేద్దామని ప్రత్యర్థి వర్గీయులు పిలిపించారు. ఆలయం వద్దకు వెళ్లగానే పైన పేర్కొన్న టీడీపీ వర్గీయులు పథకం ప్రకారం దాడి చేశారు. టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడిన వారిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించారు. యాడికి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 దాడులను సహించం
తమ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వ ర్గీయుల దాడులను సహించేది లేదని వైఎస్సార్ సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త  వీఆర్ రామిరెడ్డి, అదనపు సమన్వయకర్త రమేశ్‌రెడ్డి హెచ్చరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ పార్టీ కార్యకర్తలను వారు పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ‘భయపడొద్దు. అండగా ఉంటామని’ భరోసా ఇచ్చారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారి వెంట యాడికి మండల పార్టీ కన్వీనర్ రమేశ్ నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.
 
 
అధికారం అండతో మరోసారి తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. పంచాయితీ పేరుతో పిలిచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. కొడవళ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అడ్డొచ్చిన మహిళలపైనా తమ ప్రతాపం చూపారు. ఇదంతా కోన రామలింగేశ్వరస్వామి సాక్షిగా జరిగింది.     - తాడిపత్రి

మరిన్ని వార్తలు