నాడెప్‌ తొట్లకు అవినీతి తూట్లు

27 Aug, 2018 08:57 IST|Sakshi
నాసిరకంగా నిర్మించిన నాడెప్‌ తొట్టి, నిరుపయోగంగా  నాడెప్‌ తొట్టి

సేంద్రియ ఎరువుల ఉత్పాదనని ప్రోత్సహించేందుకు.. రైతులు ఇంటి వద్దనే ఎరువులు తయారు చేసుకోవాలనే ఉన్నత లక్ష్యంతో స్వచ్ఛభారత్‌ స్వచ్ఛత్‌లో భాగంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్, వాటర్‌షెడ్‌ శాఖల ద్వారా నిర్మించిన నాడెప్‌ తోట్లు అవినీతి, అక్రమాలకు పరాకాష్టగా మారాయి. నేతల, అధికారుల అవినీతి, లబ్ధిదారులకు అవగాహన వైఫల్యంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. నాడెప్‌ తొట్ల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిధులు చెల్లిస్తున్నా... ఎన్‌ఆర్‌ఈజీఎస్, వాటర్‌షెడ్‌ల శాఖ పర్యవేక్షణలో నిర్మాణాలు చేపట్టారు.

కనిగిరి (ప్రకాశం): జిల్లాలోని  56 మండలాల్లో 2016–17 సంవత్సరానికి 47,218 నాడెప్‌ తోట్లు  మంజూరు కాగా ఇప్పటికి  16,664 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇందుకు గాను రూ.1657.34 లక్షలు ఖర్చు పెట్టినట్లు నివేదికలున్నాయి.  అందులో 5,489 ఇన్‌ ప్రోగ్రస్‌లో ఉన్నాయి. 2017–18 ఏడాదికి గాను 17,893 మంజూరు కాగా, 5,436 పూర్తయ్యాయి. దీనికి గాను రూ.342.52 లక్షలు ఖర్చు పెట్టినట్లు నివేదికలున్నాయి. 3,775 ఇన్‌ ప్రోగ్రస్‌లో ఉన్నాయి.
 
కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 2016–17లో 7,040 మంజూరు కాగా, 2,283 పూర్తియ్యాయి. వీటికి గాను 221.41 లక్షలు ఖర్చుపెట్టినట్లు నివేదికలున్నాయి.  2017–18లో 2,760 మంజూరు కాగా, 1,088 పూర్తయ్యాయి. వీటిలో 30 శాతం నాడెప్‌ తొట్ల నిర్మాణాలు వాటర్‌షెడ్‌ పరిధిలో జరగ్గా, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పరిధిలో 70 శాతం పనులు జరిగాయి.
 
ఉపయోగం ఇలా.. 
10/6 సైజులో కట్టిన నాడెప్‌ తొట్టిలో ఒక వరుస చెత్త, దానిపై మరో వరుస పుట్టమట్టి, దాని పేడ వేస్తారు. 40 రోజులు అలా వేస్తే సుమారు రెండున్నర టన్నుల సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది. వీటిని పొలాలకు ఎరువులుగా వాడటం వల్ల రసాయనిక ఎరువుల వాడకం తగ్గుతుంది. అయితే దీనిపై ఎక్కడా ఎన్‌ఆర్‌ఈజీఎస్, వ్యవసాయ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.

అక్రమం జరుగుతుంది ఇలా.. 
సన్న, చిన్న కారు రైతులకు, ఎస్సీ, ఎస్టీలకు నాడెప్‌ తొట్ల నిర్మాణాలకు అర్హులు.  ఒక జాబ్‌ కార్డుకు ఒక నాడెప్‌ తొట్టిని శాంక్షన్‌  చేస్తారు. ఒక్కో దానికి (పొడవు 10 అడగులు, 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, 9 ఇంచెల మందంలో గోడ) రూ.10,159లు ఇస్తారు. అందులో  రూ.194లను మాత్రమే కూలి పేరుతో నగదు చెల్లింపు ఉంటుంది. మిగతా రూ.9,965లను మెటీరియల్‌ కాంపోనెంట్‌ (ఇసుక, ఇటుక, సిమెంట్, వగైరా వస్తువుల కొనుగోలు) కింద చెల్లిస్తారు.  వీటిని జాబ్‌ కార్డ్‌ హోల్టరే  నిర్మించుకోవచ్చు. కానీ కొన్ని చోట్ల రైతులు నిర్మించుకోలేని పరిస్థితి.  దీంతో ప్రభుత్వ సప్లయర్స్‌ విధానంలో నిర్మించుకునే అవకాశం కల్పించింది. దీన్ని ఆసరా చేసుకుని అధికార పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై సప్లయర్స్‌ పద్ధతిలో 60 శాతంకు పైగా నాడెప్‌ తొట్ల నిర్మించి అక్రమార్జన చేసినట్లు తెలుస్తోంది.
 
లక్షల్లో అవినీతి.. 
సప్లయర్స్‌ విధానాన్ని అసరాగా లక్షల్లో అవినీతి చోటు చేసుకుంటుంది. నాడెప్‌ తొట్టి శాంక్షన్‌ పొందిన లబ్ధిదారునికి అధికారులు వర్క్‌ కమిట్‌మెంట్‌ లెటర్‌ ఇస్తారు. సప్లయర్స్‌ విధానంలో నాడెప్‌ తొట్టిని నిర్మించుకునేందుకు ఇష్టపడుతున్నట్లు విల్లింగ్‌ లెటర్‌ను లబ్ధిదారుని నుంచి తీసుకుంటారు. ఈ క్రమంలో నాడెప్‌ తొట్టి నిర్మాణానికి వచ్చే రూ.10,159ని సప్లయర్స్‌ (కాంట్రాక్టర్‌) ఖాతాలోకి జమ చేస్తారు. అయితే నాడెప్‌ తొట్టి నిర్మాణానికి రూ.5 నుంచి రూ.6 వేలు మాత్రమే ఖర్చవుతుంది. మిగిలిన నగదును పర్సంటేజీల ప్రకారం అధికారులు, అధికార పార్టీ నాయకులు (సప్లయర్స్‌) పంచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈక్రమంలో ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే  2016–17లో మొత్తం 2,283 నాడెప్‌ తొట్లకు రూ.221.41 లక్షలు చెల్లించినట్లు నివేదికలున్నాయి. ఇటీవల జరిగిన సామాజిక తనిఖీల్లో ఆడిట్‌ బృందం గ్రామాల్లో తిరిగి పరిశీలించగా.. కొన్ని చోట్ల నిర్మాణాలు కనిపించకపోగా.. మరి కొన్ని చోట్ల వాటి ఆనవాళ్లు మాత్రమే కన్పించడం గమనార్హం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా