దేన్నీ వదల్లేదు.. మొత్తం మింగేశారు

15 Mar, 2019 14:47 IST|Sakshi
ఈ గుంతకు కూడా నిధులు మంజూరు చేయించుకున్న టీడీపీ నాయకులు

‘మరుగుదొడ్ల’లోనూ వేలుపెట్టిన టీడీపీ

పెద్దారవీడు మండలం ఒక్క మద్దలకట్ల పంచాయతీలోనే రూ. 27,15,500 అవినీతి

ఏడాది నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు

సాక్షి, పెద్దారవీడు (ప్రకాశం​): తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఐదేళ్లలో అందినకాడికి అవినీతి సొమ్మును వెనకేసుకున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ పాలకుల జేబులు నింపేందుకే అన్నట్లు వ్యవహరించారు. నీరు–చెట్టు, నీటికుంటలు, మరుగుదొడ్లు, ఉపాధి హామీ ఇలా అన్ని పథకాలకు అవినీతి మరకలు అంటించారు. ప్రజలను అమాయకులను చేసి వారికి అందాల్సిన నగదును తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. పెద్దారవీడు మండలంలోని ఒక్క మద్దలకట్ట పంచాయతీలోనే మరుగు దొడ్ల పేరుతో  రూ. 27,15,500 సొమ్మును కాజేశారు. సగం సగం పనులు చేయించుకున్న లబ్ధిదారులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ ఖాతాల్లో నగదు జమ అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరగుదొడ్ల పథకం టీడీపీ అవినీతికి ఓ మచ్చు తునక. లబ్ధిదారులకు తెలియకుండానే వారికి రావాల్సిన నగదును దొడ్డిదారిన నాయకులు తమ అకౌంట్లలోకి జమ చేసుకున్నారు. మండలంలోని మద్దలకట్ట గ్రామంలో లబ్ధిదారుల మరుగుదొడ్ల నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుంది. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమం కింద ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 15 వేలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మద్దలకట్ట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన 538 మందికి మరుగుదొడ్లు నమోదయ్యాయి. అధికారులు కూడా ధ్రువీకరించడంతో లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించారు. కొంత మంది లబ్ధిదారులు గుంతలు తీయగా మరోకొంత మంది రింగులు, గోడల వరకు నిర్మాణం పూర్తి చేశారు. కానీ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. అవి దారిమారి నాయకుల ఖాతాల్లో జమ అయ్యాయి. విషయం తెలుసుకున్న బాధితులు ఏడాదిగా అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం విశేషం.

ఎవరెవరు ఎంత దోచుకున్నారంటే..!
మద్దలకట్ట పంచాయతీలో 181 మంది లబ్ధిదారుల పేరుతో - రూ. 27,15,500  అవినీతి
యమా దాసయ్య 53 మందివి - రూ. 7,88,000 
పత్తి శ్రీనివాసరావు 65 మందివి - రూ.9,88,500
ఔకు వెంకటేశ్వర్లు (ఎంపీటీసీ సభ్యుడు) 31మందివి - రూ. 4,70,000
ఏర్వ రామాంజనేయరెడ్డి 12 మందివి - రూ. 1,80,000
దొడ్డా భాస్కరరెడ్డి 20 మందివి - రూ. 2,89,000

అంతా అవినీతిపరుల ఖాతాల్లోకి
మద్దలకట్ట పంచాయతీలో 538 మంది లబ్ధిదారులకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. వాటిలో 181 మంది లబ్ధిదారుల మరుగుదొడ్ల నిర్మాణ నిధులు పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు కాజేశారు. మద్దలకట్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు దొడ్డా భాస్కరరెడ్డి 20 మంది రూ 2,89,000, చాట్లమడ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు యమా దాసయ్య 53 మంది రూ 7,88,000 , మాచరాజుకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పత్తి శ్రీనివాసరావు 65 మంది రూ 9,88,500, చాట్లమడ గ్రామానికి చెందిన మద్దలకట్ట ఎంపీటీసీ సభ్యులు ఔకు వెంకటేశ్వర్లు 31 మంది రూ 4,70,000, చట్టమిట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఏర్వ రామాంజనేయరెడ్డి 12 మంది రూ. 1,80,000 నిధులను వారి సొంత బ్యాంక్‌ ఖాతాలో జమ చేసుకున్నట్లు బాధితులు తెలిపారు.

కొంత మంది తమ బ్యాంక్‌ ఖాతాలలో నిధులు జమకాలేదన్న కారణంతో లబ్ధిదారులు మరుగుదొడ్ల నిర్మాణాలను మధ్యలోనే అపివేసినప్పటికీ అదికారులు, టీడీపీ నాయకులు కుమ్మక్కై మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయినట్లు రికార్డుల్లో నమోదు చేసి, నిధులను తమ బ్యాంక్‌ ఖాతాలలో జమ చేసుకున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు పలు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని లబ్ధిదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పంధించి బిల్లులు ఇప్పించాలని లబ్దిదారులు కోరుతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో సైతం అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ నేతల తీరును అసహ్యించుకుంటున్నారు.

బిల్లు ఇప్పించండి 
మరుగుదొడ్డి నిర్మాణం కోసం గుంతలు తీసి రింగులు వేశాను. బిల్లుల గురించి అధికారులను అడిగితే పట్టించుకోవడంలేదు. మొత్తం 48 మంది గుంతలు, రింగులు, గోడలు నిర్మించాం. జనవరిలో జరిగిన జన్మభూమి గ్రాభసభలో కూడా ఫిర్యాదు చేశాం. స్థానిక టీడీపీ నాయకులు  దొడ్డా భాస్కరరెడ్డి, యమా దాసయ్య, పత్తి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఔకు వెంటేశ్వర్లు, ఏర్వ రామాంజనేయరెడ్డి, అధికారులు కలిసి అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేసినట్లుగా రికార్డుల్లో చూపించి బిల్లులు చేయించుకొని వారి బ్యాంక్‌ ఖాతాలో జమ చేసుకున్నారు. మాకు మాత్రం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయ ఇవ్వలేదు.
– జడ్డా దానియేలు, మద్దలకట్ట గ్రామం ఎస్సీ కాలనీ

మరిన్ని వార్తలు