మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ

21 Jan, 2020 17:23 IST|Sakshi

సాక్షి, అమరావతి :  నాలుగు గంటల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన ఏపీ శాసన మండలి కొద్దిసేపటికే మరో సారి వాయిదా పడింది. మండలిని 10నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. కాగా, ప్రభుత్వ బిల్లులను మండలిలో ప్రవేశపెట్టకుండా టీడీపీ గందరగోళం సృష్టిస్తోంది. టీడీపీ సభ్యుల తీరును అధికారం పక్షంతో పాటు బీజేపీ, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. సభలో ముందు బిల్లులపై చర్చ జరగాలని, ఆతర్వాతే రూల్‌ 71పై చర్చ జరపాలని చైర్మన్‌ను పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం కోరారు.

చర్చ నిర్వహించే ముందు.. నిబంధనల ప్రకారం ముందు బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని చైర్మన్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పరిగణలోకి తీసుకున్నాక చర్చకు తాము అంగీకరిస్తామని తెలిపారు. రూల్‌ 71పైచర్చ జరిగాకనే బిల్లులను పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పట్టుబడుతున్నారు.

కాగా, ప్రతిపక్ష నేతలు ఇచ్చిన 71 నోటీసు అసలు వర్తించదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయం జీవో కాకుండా పాలసీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ నోటీసు వర్తించదు కానీ చైర్మన్‌ మాట మీద గౌరవంతో ముందు బిల్లును పరిగణలోకి తీసుకొని తరువాత చర్చ చేపట్టాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ ప్రభుత్వ బిల్లులను సభలో ప్రవేశపెట్టకుండా చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. చైర్మన్‌ అన్ని పార్టీలను సమానంగా చూడాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. 

సమయాన్ని వృధా చేయడం మంచి కాదు
ప్రభుత్వ బిల్లులను పరిగణలోకి తీసుకొని చర్చ జరపాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ విజ్ఞప్తి చేశారు. మండలి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు. బిల్లును పరిగణలోకి తీసుకున్న తర్వాత రూల్‌ 71పై చర్చ జరగాలని కోరారు. సభలో ఎప్పుడులేని పరిస్థితి ఈ సారి నెలకొందని అసహనం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు