టీడీపీ నేతలకు బిగుస్తున్న కేసుల ఉచ్చు

21 Oct, 2019 11:14 IST|Sakshi
ఫొటో, తేదీ, ఆర్సీ, ఎల్‌డీ నంబర్లు లేకుండా పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు (ఇన్‌సెట్‌) నకిలీ పట్టాలు చూపుతున్న తహసీల్దార్‌

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన కుటిల యత్నాలు ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంటున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలో ఆయన అనుచరులు పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి మోసగించిన వ్యవహారంపై అందిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఇళ్ల పట్టాల పంపిణీతో ఎన్నికల కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘించడం, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, తహసీల్దార్‌ స్థాయి అధికారి సంతకం, నకిలీ స్టాంపులు సృష్టించి దుర్వినియోగం చేయడంపై వివిధ సెక్షన్ల కింద హనుమాన్‌జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ ఎమ్మెల్యే  వల్లభనేని వంశీతో పాటు మరో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. చీటింగ్, ఫోర్జరీ, ఎన్నికల నియమావళి ఉల్లంఘన అభియోగాలపై కేసు రిజిస్టర్‌ చేశారు.

సాక్షి, గన్నవరం(విజయవాడ): కృష్ణా జిల్లా బాపులపాడు మండంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ, పోరంబోకు స్థలాలు, చెరువు గట్లపై స్థిర నివాసాలు ఏర్పరుచుకుని జీవిస్తున్న పేదలకు ఏప్రిల్‌ 7న అర్ధరాత్రి నకిలీ ఇళ్ల పట్టాలను తెలుగుదేశం నాయకులు పంపిణీచేయడం అప్పట్లో స్థానికంగా కలకలం రేపింది. బాపులపాడుతో పాటు కొయ్యూరు, పెరికీడు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రి వేళలో ఇంటింటికీ వెళ్లి 3 వేల మందికి పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్లుగా పేదలకు చెబుతూ వాళ్లకు ఆ పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని, గన్నవరం టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీకి ఓటు వేయాలని నకిలీ ఇళ్ల పట్టాలను పంచుతూ ఓటర్లను మభ్యపెట్టారు. ఇళ్ల పట్టాలపై మంజూరు చేసిన తేదీ, లబ్ధిదారుని ఫొటో, ఆర్సీ నంబరు, ఎల్‌డీ ఫైల్‌ నంబర్లు లేకపోవడంతో పలువురు లబ్ధిదారులకు అనుమానాలు రేకెత్తడంతో అసలు విషయం బయటపడింది. గత ఏడాది ఆగస్ట్‌లో బదిలీ అయిన తహసీల్దార్‌ సంతకాన్ని రబ్బరు స్టాంపు చేయించి ఇళ్ల పట్టాలపై ముద్రించి ఉండటం వారి అనుమానాలను మరింత బలపరిచాయి.

స్పందనలో ఫిర్యాదుతో కదలిక 
తాజాగా గన్నవరానికి చెందిన ముప్పలనేని రవికుమార్‌ అనే వ్యక్తి సార్వత్రిక ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌కు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, నియోజకవర్గ ఎన్నికల అధికారులను విచారించి నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. ఇప్పటికే బాపులపాడు తహసీల్దార్‌ సీహెచ్‌ నరసింహారావును సుమారు 100 మందికిపైగా కలిసి నకిలీ ఇళ్ల పట్టాలపై ఫిర్యాదుచేశారు. టీడీపీ నేతలు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలపై ఉన్న తహసీల్దార్‌ పాస్‌ మెయిల్‌ సంతకం, కార్యాలయం స్టాంపు పూర్తిగా ఫోర్జరీ చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించి, వీటిపై సమగ్రంగా విచారణ జరిపించాలని హనుమాన్‌జంక్షన్‌ పోలీ సులకు ఆయన ఫిర్యాదు చేశారు.

పదిమంది టీడీపీ నేతలపై కేసు నమోదు
బాపులపాడు మండలంలోని కొయ్యూరు, పెరికీడులో చేపట్టిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై తహసీల్దార్‌ సీహెచ్‌ నరసింహారావు హనుమాన్‌జంక్షన్‌ పోలీసులకు ఈనెల 17న ఫిర్యాదు చేశారు. గన్నవరం ఎమ్మె ల్యే వల్లభనేని వంశీ, ఆయన ప్రధాన అనుచరులు ఓలుపల్లి మోహన రంగా, కాట్రు శేషు, జాస్తి ఫణి, టీడీపీ నాయకులు కొల్లి రంగారావు, వేగి రెడ్డి పాపారావు, కొత్తూరి ఆంజనేయులు, సింగవరపు దుర్గాప్రసాద్, లావేటి నారాయణ, బం డారు సత్యనారాయణలపై ఎస్‌ఐ కె.అశోక్‌కుమార్‌ శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. 

‘నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఫణిశేఖర్‌ పాత్ర ఉంది’
గన్నవరం : ఎన్నికల ముందు ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి ప్రజలను మోసగించిన వ్యవహారంలో ముమ్మాటికీ టీడీపీ నాయకుడు జాస్తి ఫణిశేఖర్‌ హస్తముందని మాజీ సైనిక ఉద్యోగి ముప్పనేని రవికుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎమ్మెల్యే వంశీమోహన్‌ 20 వేలకుపైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు ఫణిశేఖర్‌ స్వయంగా తనకు చెప్పారన్నారు. ఈ విషయమై తను ‘స్పందన’లో ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు నకిలీ పట్టాల తయారీలో ఫణిశేఖర్‌ పాత్ర కూడా ఉన్నట్లు నిర్ధారించి కేసు నమోదు చేశారని చెప్పారు. ఈ నకిలీ పట్టాలపై ఉన్న తహసీల్దారు సంతకంతో కూడిన స్టాంప్, కార్యాలయ స్టాంప్‌ కూడా నకిలీవిగా అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. ఫణిశేఖర్‌ ఆరోపిస్తున్నట్లుగా అతనికి, తనకు ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవని, పాత గన్నవరంలో నిర్మిస్తున్న భవనం కూడా తనకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా