ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు

8 Apr, 2019 12:59 IST|Sakshi
నగదు తీసుకొచ్చి పంపిణీ చేసిన వాహనం ,66వ వార్డు గణపతినగరంలో పోలీసులు పట్టుకున్న చీరలు

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ చేయని ప్రయత్నాలు లేవు. పట్టపగలే టీడీపీ నాయకులు పంపకాలు మొదలెట్టారు. దీనిపై ప్రజలు ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి గవర వీధిలో విజయపగరం జిల్లా నుంచి ఏపీ 35 జె 3333 ఎక్స్‌యూవీ వాహనంలో నగదు తీసుకొచ్చి వలస ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.40,760 నగదు స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్‌ సీట్ల కింద నగదు, సెల్‌ఫోన్లు దాచి పెట్టినట్టు సమాచారం. ఈ నగదు రూ.90వేలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎయిర్‌పోర్టు పోలీసులు చెబుతున్న సమాచారం మరోలా ఉంది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తమకు 40,760 నగదుతో పాటు చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి కిమిడి నాగార్జున బ్యాలెట్‌ నమూనా పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ దాడిలో నక్క సింహాచలం, చిట్టి రమేష్, కెల్ల రమేష్, పి.చిట్టిబాబులను అదుపులోకి తీసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ కొల్లి సతీష్‌ తెలిపారు.

66వ వార్డులో చీరల పంపిణీ
66వ వార్డు గణపతినగర్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు పట్టపగలే చీరలు పంపిణీ చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రెండు బ్యాగులతో చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో కొందరి టీడీపీ నాయకుల ఇళ్లల్లో చీరలు డంప్‌ చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు