ప్రభుత్వం మారినా కుర్చీలు వీడని టీడీపీ నేతలు 

21 Jun, 2019 11:55 IST|Sakshi

కొత్త ప్రభుత్వం ఏర్పడినా నామినేటెడ్‌ పదవులపై మోజు

సిగ్గుచేటంటున్న మేధావులు, వైసీపీ నాయకులు

సాక్షి, దెందులూరు : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడి మూడు వారాలు దాటినా నామినేటెడ్‌ పదవులను టీడీపీ నేతలు వదలటం లేదు. ఎన్నికల ముందు ప్రతిపక్షం హోదా కూడా దక్కదు.. వైఎస్సార్‌సీపీకి పుట్టగతులుండవు.. మళ్లీ వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అంటూ బీరాలు పలికి పందేలు కట్టి భుజాలు దాకా చేతులు కాల్చుకున్న వారు ఏం మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో అసలు ఏం చేయాలో తెలియక నానాటికీ నైతిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి..

మరోవైపు తమగోడు చెప్పుకుందామంటే బూతద్దం పెట్టి వెతికినా చెప్పుకోవడానికి ఏ ఒక్క నాయకుడు గెలవలేదు. ఈ దశాబ్ధపు యోధుడు, ప్రజా నేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 3,648 కిలోమీటర్ల పాదయాత్ర, నవరత్న పథకాల రూపకల్పన ముందు గాలిలో సునామీ మాదిరిగా చాలెంజ్‌లు విసిరిన టీడీపీ నేతలంతా ఘోర ఓటమిని చవిచూశారు. అయితే దెందులూరు నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్‌ పదవి కాలం ముగిసింది.

ఏఎంసీ డైరెక్టర్‌లు, పాఠశాలల ఎస్‌ఎంసీ కమిటీలు, వైద్యశాలల అభివృద్ధి కమిటీలు, నీటి సంఘాలు, దేవదాయ శాఖ దేవాలయాల అధ్యక్షులు, కమిటీ సభ్యులతో పాటు ఇతర నామినేటెడ్‌ పదవులను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన టీడీపీ నేతలు నేటికీ ఆ పదవుల కుర్చీలను వదలటం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రభుత్వం మారిన వెంటనే ఆ ప్రభుత్వ హయంలో నామినేటెడ్‌ పోస్టులన్నీ ముందస్తుగా స్వచ్ఛందంగా పదవుల్లో నియమితులైన నేతలు రాజీనామా చేయటం సంప్రదాయం.

గతంలో ఏ ప్రభుత్వ శాఖకు అయినా అపవాదు లభిస్తే ఆ శాఖా మంత్రులు రాజీనామా చేసిన సంఘటనలు కోకొల్లలు. ఇందుకు భిన్నంగా సంప్రదాయాలు, ఆదర్శాలు, సంస్కృతిని అవహేళన చేస్తూ టీడీపీ నాయకులు కుర్చీలను పట్టుకు వేళాడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని, పార్టీ నాయకులను చులకనగా, హేళనగా, అగౌరవంగా మాట్లాడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నేడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎలా కొనసాగుతారని గ్రామగ్రామాన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నిస్తున్నారు.

ఒకవైపు టీడీపీ ప్రభుత్వం ఘోర ఓటమి పాలవటంతో నేటికీ షాక్‌ నుంచి తేరుకోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు టీడీపీ రాజ్యసభ సభ్యులు కొందరు బీజేపీలోకి చేరడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందాన ఉంది. ఎంపీలే భవిష్యత్తు కోసం దారి వెతుక్కుంటుంటే గ్రామ శివారు ప్రాంతాల్లో ఐదేళ్లపాటు ఒంటరిగా ఏ అండా లేకుండా ఎలా ఈదుతామన్న బలమైన వాదన ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో పాటు కార్యకర్తలందరిలో స్పష్టంగా ఉంది.

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర పార్టీల్లో చేరితో టీడీపీ మొత్తం ఖాళీ అవటం ఖాయమని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానించటం గమనార్హం. తమ ప్రభుత్వంలో సైతం నామినేటెడ్‌ పదవుల్లో ఉన్న టీడీపీ నేతలు ఇంకా రాజీనామా చేయకపోవడం పట్ల వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా