దుకాణంలో  దొంగలు.!

20 Aug, 2019 10:10 IST|Sakshi
వేలం నిర్వహించకుండా టీడీపీ నేతలు దక్కించుకున్న దుకాణాలు

చీపురుపల్లిలో టీడీపీ వ్యాపార రాజకీయం 

పంచేసుకున్న పంచాయతీ దుకాణాలు

పంచాయతీ ఆదాయానికి గండి 

న్యాయస్థానం ఆదేశాలు బేఖాతరు

ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్న దుకాణానికి తాళాలు

బహిరంగ వేలం కోసం  కలెక్టర్‌కు సూచించిన ఎంపీ

సాక్షిప్రతినిధి, విజయనగరం:  వ్యాపారులకు మంచి జరగాలి.. పంచాయతీకి ఆదాయం రావాలన్న సదుద్దేశంతో పంచాయతీ, వ్యాపారుల భాగస్వామ్యంతో నిర్మించిన దుకాణాలపై టీడీపీ నేతల కన్ను పడింది. అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని  దుకా ణాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల పంచాయతీ ఆదాయానికి గండికొ డుతున్నారు. తక్కువ అద్దెలు చెల్లిస్తూ ప్రశ్నించే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాతైనా వారిలో మార్పువచ్చిందా అంటే అదీ లేదు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్న దుకాణాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఇదే చీపురుపల్లిలో అనేక అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు నేటికీ అదే ధోరణిని కొనసాగి స్తుండడాన్ని చూసి జనం విస్తుపోతున్నారు. అయితే, దుకాణాలకు బహిరంగ వేలం నిర్వహించడం ద్వారా పంచాయతీకి ఆదాయం చేకూర్చవచ్చని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ జిల్లా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌కు సూచించారు.

ఇదీ కథ... 
చిరువ్యాపారుల సంక్షేమం దృష్ట్యా చీపురుపల్లి పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, మెయిన్‌ రోడ్డును ఆనుకుని ఉన్న పయంచాయతీ స్థలంలో 26 దుకాణాల నిర్మాణానికి 2009లో అప్పటి కాంగ్రెస్‌ పాలకులు ప్రణాళికలు వేశారు. దుకాణాల నిర్మాణానికి  చిరు వ్యాపారుల నుంచి కొంత వరకు  నిధులు సమీకరించి ఆ డబ్బుతో దుకాణాలను నిర్మించారు. సాధారణ అద్దె నిర్ణయించి ఏడు సంవత్సరాలు లీజుకు దుకాణాలను కేటాయించారు. తరువాత 2016లో పంచాయతీ తిరిగి ఆ దుకాణాలను తీసుకుని బహిరంగ వేలం నిర్వహించాల్సి ఉంది. అప్పటికి టీడీపీ అధికారంలో ఉండడంతో రెండేళ్లు తాత్సారం చేసింది. 2018లో స్థానిక టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి బహిరంగ వేలం లేకుండా 30 శాతం అద్దెలను పెంచుతూ తమ వర్గీయులకు దుకాణాలను కేటాయించుకున్నారు. ఆ సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడొకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ‘ఇంజక్షన్‌ ఆర్డర్‌’ను ఇచ్చింది.

దుకాణాలను బహిరంగ వేలం నిర్వహించకుండా టీడీపీ పాలకులు తమ అనుయాయులకు, ఇష్టులకు తక్కువ అద్దెలకు దుకాణాలను కట్టబెట్టి మొదటి నుంచీ ఉన్న వారికి దుకాణాలు కేటాయించకుండా అన్యా యం చేశారు. అలా అన్యామైపోయిన వారిలో కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు ఒకరు. అయితే, కోర్టు ఆర్డర్‌ ఉన్నప్పటికీ మెయిన్‌ రోడ్డులో వైఎస్సార్‌ సీపీ నాయకుడికి చెందిన దుకాణానికి టీడీపీ మాజీ జెడ్పీటీసీ వర్గీయులు సోమవారం దౌర్జన్యంగా తాళం వేశారు. ఇదేమిటని అడిగిన వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువార్గాల వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అద్దెల లెక్క ఇలా... 
ప్రస్తుతం ఒక్కో దుకాణం నుంచి రూ.2వేల నుంచి రూ.2,800 వరకు మాత్రమే పంచాయతీకి అద్దెలు వస్తున్నాయి. కానీ అక్కడ మార్కెట్‌లో మాత్రం ఒక్కొక్క దుకాణానికి రూ.20వేల నుంచి రూ.25 వేల వరకూ అద్దెలు పలుకుతున్నాయి.ఈ లెక్కన ఏడేళ్లకు రూ.5.46 కోట్ల ఆదాయం పంచాయతీకి రావాల్సి ఉంది. టీడీపీ నాయకుల చేతివాటంతో పంచాయతీ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో పంచాయతీలో ఉద్యోగులకు జీతాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, వీధి దీపాలు అంటూ అనేక పనులకు నిధుల కొరత ఏర్పడింది. ఇప్పటికైనా టీడీపీ నేతలు ప్రజలు, పంచాయతీ బాగు కోసం ఆలోచించి బహిరంగ వేలానికి మద్దతిస్తే ఎలాంటి వివాదాలకు తావులేకుండా అర్హులకు దుకాణాలు దక్కే అవకాశం ఉంది.  

వేలంతో పంచాయతీకి ఆదాయం..
చీపురుపల్లి దుకాణాల అంశంపై కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌తో ఇప్పటికే చర్చించాం. దుకాణాలకు ప్రస్తుతం అతి తక్కువ అద్దెలు వస్తున్నాయి. దీనివల్ల పంచాయతీకి ఆదా యం రావడం లేదు. ఈ విధానం మారాల్సిన అవసరం ఉంది. అందుకే బహిరంగ వేలం నిర్వహించాల్సింది గా కలెక్టర్‌ను కోరాం. అదే జరిగితే పంచాయతీకి ఏడాదికి దాదాపు రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. పంచాయతీ అవసరాలకు ఆ సొమ్ము ఉపయోగపడుతుంది. 
– బెల్లాన చంద్రశేఖర్, ఎంపీ, విజయనగరం 

ఉన్నతాధికారుల  సూచనల మేరకే... 
వ్యాపారులు దుకాణాల కోసం గ్రీవెన్సుసెల్‌ను గతేడాది ఆశ్రయించారు. దీంతో ప్రతిపాదనలు పంపించాల్సిందిగా జిల్లా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు ప్రతిపాదనలు పంపించాం. 30 శాతం అద్దె పెంచుతూ దుకాణాలను కేటాయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ ప్రకారం అద్దెలు పెంచుతూ దుకాణాలను కేటాయించాం.
 – డి. శ్రీనివాస్, మేజర్‌ పంచాయతీ అధికారి, చీపురుపల్లి  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు