కేసుల కుతంత్రం

7 Mar, 2019 07:48 IST|Sakshi

ఓట్లు తొలగింపు కుట్రదారు టీడీపీయే

అదే పార్టీ వైఎస్సార్‌సీపీపై ఫిర్యాదులు

ఓట్లు పోయి.. కేసుల్లో ఇరుక్కొని ఆ పార్టీ శ్రేణుల ఆందోళన

22 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 41 కేసులు

ఒక్క సబ్బవరంలోనే 15 కేసులు

వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోని పోలీసులు

దొంగే.. దొంగా దొంగా అని అరుస్తున్నాడు.. నానా యాగీ చేస్తున్నాడు.. ఫిర్యాదులతో అటు పోలీసులను.. ఇటు ప్రజలను గందరగోళంలో పడేస్తున్నాడు..ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ తతంగాన్నే విశాఖ జిల్లాలోనూ టీడీపీ శ్రేణులు రక్తికట్టిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌సీపీ ఓట్లను దొంగపేర్లతో తొలగించే కుట్రలకు తెగిస్తున్న టీడీపీ నేతలు.. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలే ఆ పనికి పాల్పడుతున్నారని దబాయిస్తూ కేసులు నమోదు చేయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గత రెండురోజులుగా సాగుతున్న ఈ తంతు ఆందోళన.. ఆలజడి సృష్టిస్తోంది. పోలీసులు సైతం ఫిర్యాదు అందిన వెంటనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసు స్టేషన్లకు పిలిపించి వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా బుధవారం నాటికి 22 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 41 కేసులు నమోదయ్యాయి. ఒక్క సబ్బవరం స్టేషన్‌ పరిధిలోనే 15 కేసులు నమోదయ్యాయంటే పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీవారి తీరు ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ప్రతి కేసులోనూ 20 నుంచి 30 మంది కార్యకర్తలను పిలిపించి విచారణ పేరుతో వేధిస్తున్నారు. అదే సబ్బవరం తదితర స్టేషన్లలో ఓట్ల అక్రమ తొలగింపుపై వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం పోలీసులు స్పందించడం లేదు.

సాక్షి, విశాఖపట్నం: నా ఓటు గల్లంతయ్యిందంట. నా ఓటు తొలగించమని ఎవరో నా పేరిట ఫారం–7 అప్లయ్‌ చేశారట. మా అందరి ఓట్లు తొలగించమని ఆన్‌లైన్‌లో ఎవరో ఫిర్యాదు చేశారట. జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఏ మూలకెళ్లినా.. ఏ నలుగుర్ని కదిపినా ఇదే అలజడి. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదవుతుండడం పట్ల జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

తమ సానుభూతిపరుల ఓట్లను దొంగలిస్తున్నారు. దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారంటూ గడిచిన ఆర్నెళ్లుగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ ఫిర్యాదులపై రాష్ట్ర, జాతీయ ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా స్పందిస్తున్నప్పటికీ ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్‌ కనుసన్నల్లో పనిచేయాల్సిన జిల్లా స్థాయి అధికారులు మాత్రం అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. కారణం జిల్లా, మండల స్థాయిల్లో వైఎస్సార్‌సీపీ ఇచ్చిన ఫిర్యాదుల కంటే టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఇచ్చిన ఫిర్యాదులకే ఎక్కువగా స్పందిస్తున్నారు. వారు ఫిర్యాదు ఇవ్వడం పాపం కేసులు కట్టేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను స్టేషన్లకు పిలిపించి విచారణ పేరుతో హంగామా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో బుధవారం నాటికి 41 కేసులు నమోదు చేశారు. వీటిలో అత్యధికంగా సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఏ.కోడూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు, అనకాపల్లి టౌన్, మునగపాక పోలీస్‌స్టేషన్లలో రెండేసి చొప్పున కేసులు నమోదు కాగా, మిగిలిన 20 పోలీస్‌ స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కాగా మెజార్టీ కేసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని పెట్టినట్టుగానే తెలుస్తోంది. ఈకేసులన్నింటిని ఆయా పోలీస్‌స్టేషన్లు జిల్లా సైబర్‌ క్రైం విభాగానికి బదలాయించారు. కాగా వైఎస్సార్‌సీపీకి చెందిన మండల, గ్రామ, బూత్‌ కమిటీ నేతలను స్టేషన్లకు పిలిపించుకుని విచారించిన పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పెట్టిన కేసుల్లో మాత్రం టీడీపీ శ్రేణులను విచారణకు పిలిచే సాహసం చేయలేకపోతున్నారు.

పద్మనాభం పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో 36 మందిపై కేసులు నమోదు చేయగా, ఈరోజు 31 మందిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. వారిలో 30 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన వారే. వీరిలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శిరుగుడి ఆదిబాబుతో సహా మాజీ సర్పంచ్‌లుచందక శ్రీను, పల్లంటి చిన్నారావు, అలమండ ఇలామహేశ్వరిలు ఉన్నారు. పాడేరులో ఫారం–7 తొలగింపు అంశంపై ఏ రాజకీయ పార్టీ నుంచి ఫిర్యాదులందకపోయినప్పటికీ స్థానిక తహసీల్దార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. మునగపాక మండలం మేలిపాక గ్రామానికి చెందిన గుంట్ల అప్పారావు, పురుషోత్తపురానికి చెందిన కర్రిగంగయ్యఈశ్వరరావులు తమ ప్రమేయం లేకుండానే తప్పుడు సంతకాలతో ఓట్లు తొలగించాలని అందిన దరఖాస్తులపై విచారణ చేపట్టాలని తహసీల్దార్‌ ఈశ్వరమ్మకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఈశ్వరమ్మ స్పందించి విచారణ చేపట్టాలని ఎస్సై కుమారస్వామిని ఆదేశించారు.

కానీ ఈ కేసులో టీడీపీకి చెందిన ఏ ఒక్కర్ని స్టేషన్‌ పిలిచి విచారించలేదు. ఇలా వైఏస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదుచేస్తూ వార్ని విచారణ పేరుతో స్టేషన్లకు పిలిపిస్తూ ఒకింత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ పక్కా ఆధారాలతో టీడీపీ శ్రేణులపై ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం పోలీసులు ఆ స్థాయిలో స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొత్తమ్మీద జిల్లా వ్యాప్తంగా అరెస్టలు, విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేసే కుట్ర జరుగుతోంది. ఓట్ల గల్లంతుపై ఇప్పటికే ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలను, ప్రభుత్వం ఒత్తిడిపై అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మేధావులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బండారు దాష్టీకం
దొంగ ఓట్ల నమోదులోనే కాదు..వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఓట్లను తొలగించడంలో చక్రంతిప్పుతున్న పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు తమ నేతలు పాల్పడిన అవకతవకలను పక్కదారి పట్టించేందుకు వైఎస్సార్‌ సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ఫిర్యాదులు చేశారు. అప్పలనాయుడు తమ అనుచరుల ద్వారా ఇచ్చిన ఫిర్యాదుల మేరకే అమృతపురంలోని టీడీపీ వారి ఓట్లు తీసేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు వడిశల అప్పారావు, బైలపూడి రామారావు, చీపురుపల్లి సూర్యనారాయణ, వనం వెంకటరమణ, కర్రి అప్పారావు, కండిపల్లి ఈశ్వరరావు, వన్నెల శ్రీరాములు నాయుడు, సూరెడ్డి అప్పలనాయుడులపై ఫిర్యాదు చేశారు. ఒక్క çసబ్బవరంలోనే ఏకంగా 15 కేసులు నమోదైతే అప్పలనాయుడు ఆదేశాల మేరకు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే పోలీసులు చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌ సీపీ నేతలిచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఆరోపణలను ఎదుర్కొంటున్న టీడీపీ నేతలను మాత్రం విచారించకపోవడం విమర్శలకు తావి స్తోంది. సబ్బవరం మండలంలో 1610 ఓట్లు తొలగించా రంటూ వైఎస్సార్‌సీపీ నాయకులు దరఖాస్తులు చేశారంటూ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచిత్రమేమిటంటే ఇవే ఓట్లు గల్లంతుపై గతంలోనే వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌ అదీప్‌రాజు ఫిర్యాదు చేశారు.

టీడీపీ నేతలవికుట్రపూరిత రాజకీయాలు
వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల ఆందోళన

కంచరపాలెం(విశాఖ ఉత్తర): విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నేతలు బీఎల్‌వోలతో కలిసి ఓట్లు తొలగించేందుకు కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ.. అక్రమ అరెస్టులకు పూనుకుంటున్నారని వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ ఆరోపించారు. జ్ఞానాపురం జోన్‌–4 కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ ఆర్‌వో టి.ఈ.ఎం.రాజును బుధవారం కలిశారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు హల్‌చల్‌ చేస్తూ.. వైఎస్సార్‌సీపీ నాయకులపై ఓట్లు తొలగించారంటూ అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 238 బూత్‌ల్లో సుమారు 600 మంది ఓట్లు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరికి ముందు ఓటర్ల జాబితాలో పేర్లు ఉండగా, జనవరి తరువాత వచ్చిన జాబితాలో స్వయాన తన కుటుంబ సభ్యుల పేర్లను తొలగించటంలో టీడీపీ కుట్ర తెలుస్తుందన్నారు. నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదులోనూ, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఓట్లు తొలగింపులో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ఆర్‌వోకు మళ్ల ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను వెంటనే తొలగించకుంటే జిల్లా కలెక్టర్‌ ద్వారా ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్‌వో రాజు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో సమస్యలు తమ దృష్టికి రావడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా వార్డు అధ్యక్షులు ముర్రు, వాణీనానాజీ, కాయిత పైడిరత్నాకర్‌ యాదవ్, ఆడారి శ్రీను, దొడ్డి సతీష్, మజ్జి నూకరాజు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు