చర్చన్నారు.. తోకముడిచారు

22 Dec, 2018 13:02 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ నాయకులతో చర్చిస్తున్న పోలీసులు

వైఎస్సార్‌సీపీ, టీడీపీ చర్చకు పోలీసుల బ్రేక్‌

పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్‌ అరెస్టు చేయించిన టీడీపీ నేతలు

మాజీ ఎంపీ అనంతతో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్పొరేటర్ల గృహ నిర్బంధం

సాయంత్రం నీరు–ప్రగతి వనానికి తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలు

విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పలువురు టీడీపీ కార్యకర్తలు

అందరినీ అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించిన పోలీసులు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘అనంత’ అవినీతి, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమైన వైఎస్సార్‌ కాంగ్రెస్, టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి చర్చ జరగకుండా అడ్డుకున్నారు. మేయర్‌ మదమంచి స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి విసిరిన సవాల్‌కు ‘సై’కొట్టిన సమన్వయకర్త అనంత వెంకట్రామిరెడ్డితో పాటు పార్టీ నేతలు ‘అనంత’ అభివృద్ధి, అవినీతి, నాలుగున్నరేళ్లలో ఖర్చు చేసిన నిధులు, దుర్వినియోగమైన తీరు, అవినీతిలో ఎవరిపాత్ర ఎంత అనే అంశాలపై ససాక్ష్యాలతో చర్చకు సిద్ధమయ్యారు. శుక్రవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఉండటంతో అవి ముగించుకుని సాయంత్రం 4.30 గంటలకు మేయర్‌ సూచించిన ‘నీరు–ప్రగతి’ వనంలో చర్చకు వెళ్లేందుకు బయలుదేరారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కుమారై వివాహం కోసం గోవాకు వెళ్లిన ‘అనంత’ చర్చలో పాల్గొనేందుకు సిద్ధపడ్డారు. అయితే పోలీసులు శుక్రవారం ఉదయం 7 గంటలకే ‘అనంత’తో పాటు ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, పార్లమెంట్‌ సమన్వయకర్త తలారి రంగయ్య, మాజీ మేయర్‌ రాగేపరుశురాం, కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వైటీ శివారెడ్డితో పాటు కార్పొరేటర్లను హౌస్‌ అరెస్టు చేశారు. చర్చ సాయంత్రమని, జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని అంతా విన్నవించారు. దీంతో పార్టీ కార్యాలయంలో జరిగే జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు మాత్రమే అనుమతించారు. తర్వాత తిరిగి అందరినీ గృహనిర్భందంలో ఉంచారు. మరోవైపు మేయర్‌ స్వరూప, డిప్యూటీ మేయర్‌ గంపన్నలను కూడా హౌస్‌ అరెస్టు చేశారు.

నీరు–ప్రగతి వనం వద్దకు వెళ్లిన     వైఎస్సార్‌సీపీ నేతలు
ముఖ్యనేతలు గృహ నిర్బంధంలో ఉండటంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు జానకి, హిమబిందు, వైఎస్సార్‌సీపీ మాజీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి నీరు–ప్రగతి వనం వద్దకు వెళ్లారు. అప్పటికే డీఎస్పీ వెంకట్రావ్‌ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మొహరించారు. వైసీపీ నేతలు కన్పించగానే అందరినీ అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పెన్నోబులేసు, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, మునీరా, శ్రీదేవి వచ్చారు. వీరిని అరెస్టు చేశారు. దీంతో తప్పించుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు యత్నించగా తోపులాట జరిగింది. చివరకు వైటీ శివారెడ్డి కూడా పోలీసుల కళ్లుగప్పి వచ్చారు. ఆయన్ను కూడా అరెస్టు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల రాక తెలిసి మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ ఆదినారాయణ, పట్టణాధ్యక్షుడు లింగారెడ్డి కొంతమంది అక్కడికి చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా సాయంత్రం ఆరు గంటల వరకూ అక్కడికి వచ్చిన వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.

‘అనంత’ను అడ్డుకున్న పోలీసులు
బహిరంగ చర్చ ఉందని, శాంతియుతంగా చర్చకు వెళతామని పోలీసులను ‘అనంత’ కోరారు. అయితే ఇంటి నుంచి పంపకుండా గేట్లు మూసేశారు. భారీగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ‘అనంత’ నివాసానికి చేరుకున్నారు. దీంతో ఆయన నినాదాలు చేస్తూ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. మహిళానేతలు కృష్ణవేణి, మునీరాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఆ తర్వాత మాజీ ‘అనంత’ విలేకరులతో మాట్లాడారు. ‘అనంత’ అవినీతిలో కూరుకుపోయిందని మరోసా రి పునరుద్ఘాటించారు. ససాక్ష్యాలతో చర్చకు సిద్ధమయ్యామన్నారు. బహిరంగచర్చకు పిలిచిన టీడీపీ నేతలు ప్రశాంత వాతావరణంలో చర్చ జరుపుకుం టామని పోలీసుల అనుమతి తీసుకోవాలని, కానీ అలా చేయకుండా బయటికి చర్చ అంటూ లోపల రాకుండా ఉండేందుకు కుయుక్తలు పన్ని తప్పించుకున్నారన్నారు. ‘అనంత’ అవినీతిపై ప్రతీ వార్డులో,     వేదికలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రూ.70కోట్లు ఖర్చు చేశామని చెబుతున్నారని, వారు ఆరగించడం తప్ప నగరవాసులకు ఒరిగిందేమీ లేదన్నారు.

పథకం ప్రకారమే చర్చను అడ్డుకున్నారంటున్న వైఎస్సార్‌సీపీ
ఎమ్మెల్యే, మేయర్‌.. అధికారపార్టీ నేతలు.. బయటకు చర్చ అని సవాళ్లు విసిరారు. కానీ చర్చ జరిగితే ఎక్కడ తమ అవినీతి బట్టబయలవుతుందోనని పక్కా పథకం ప్రకారమే పోలీసులను ఉసిగొల్పి ముందస్తు అరెస్టు చేసేలా ఎమ్మెల్యే స్కెచ్‌ వేశారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా తాము చర్చకు సిద్ధమైతే, ఎమ్మెల్యే సూచనలతో పోలీసులు తమను హౌస్‌ అరెస్టు చేశారన్నారు.

బహిరంగ చర్చలకు అనుమితివ్వం
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే బహిరంగ చర్చలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చే పరిస్థితి ఉండదు. రెండు రాజకీయ పార్టీల నాయకులు బహిరంగంగా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటే వాటిని అదుపు చేయడం కష్టతరం. కావున ఇలాంటి బహిరంగ చర్చలకు సవాళ్లు విసురుకోరాదని రాజకీయపక్షాలకు మనవి. అలాగే నగరంలో సెక్షన్‌ 30 యాక్టు అమల్లో ఉంది. సభలు, సమావేశాలు జరుపుకునే వారు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలి.– జె.వెంకట్రావ్, డీఎస్పీ, అనంతపురం 

మరిన్ని వార్తలు