టీడీపీ నేతల్లో కంగారు

5 Jan, 2019 06:38 IST|Sakshi
హత్యాయత్నం ఘటన జరిగిన వెంటనే నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్ద హల్‌చల్‌ చేసిన టీడీపీ నేతలు

వైఎస్‌ జగన్‌ హత్యాయత్నం కేసు ‘ఎన్‌ఐఏ’కి అప్పగించడంతో టీడీపీ నేతల్లో కంగారు

కుట్ర బయటపడుతుందేమోనని వణుకు

సాక్షి ప్రతినిధి, కాకినాడ : విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కి అప్పగించడంతో కుట్రకోణం బయటపడుతుందన్న చర్చ జిల్లాలో ప్రారంభమైంది. ఇన్నాళ్లూ వాస్తవాలు తొక్కి పెట్టి కుట్రదారులు బయటపడకుండా జరిగిన విచారణ గుట్టు రట్టు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైకోర్టు ఆదేశాలు రావడమే తరువాయి టీడీపీ నేతల్లో గుబులుతోపాటు ఆందోళన ప్రారంభమయింది. జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేసు ఎన్‌ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందేమో మొహంలో ఆందోళన కనిపించింది. కాకినాడలో శుక్రవారం జరిగిన జన్మభూమి సభలో ఆయన టెన్షన్‌తోనే గడిపారు. 

గతమంతా ఇలా...
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం తర్వాత నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు స్వగ్రామమైన ఠాణేలంకలో సిట్‌ విచారణ అంతా ‘పెద్దల’ సూచనమేరకే తూతూ మంత్రంగా చేసింది. తమకు ఏం కావాలో వాటిని మాత్రమే తీసుకుని, మిగతా కుట్ర కోణాన్ని విస్మరించిందన్న విమర్శలున్నాయి. ఎంతసేపూ నిందితుడు శ్రీనివాసరావును వైఎస్సార్‌సీపీ అభిమానిగా చిత్రీకరించేందుకు యత్నించారే తప్ప వారి వెనుక అసలు వ్యక్తులెవరనేది తేల్చడానికి ప్రయత్నించలేదు.

అనుమానాలెన్నో...
హత్యాయత్నం జరిగిన రోజున తన స్వగృహం వద్ద నిందితుడు శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు తొలుత మీడియాతో మాట్లాడుతూ తాము టీడీపీలో ఉన్నట్టు  వెల్లడించారు. ఆ తర్వాత వచ్చిన ఒత్తిళ్ల కారణంతో మాట మార్చాడు. వైఎస్సార్‌ సీపీ అభిమానిగా చెప్పడం మొదలు పెట్టాడు. దీనివెనకున్న వ్యూహమేంటి?  

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై కత్తితో హత్యాయత్నం చేసిన వ్యక్తి జనుపల్లి శ్రీనివాసరావు అని తెలియగానే టీడీపీ నేతలు నడింపల్లి శ్రీనివాసరాజు, మట్టపర్తి వెంకటేశ్వరావు, ఇసుకపట్ల వెంకటేశ్వరావు తదితరులు ఆయన ఇంటి వద్దకు వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వీరంతా కలిసి మాట్లాడాక  వైఎస్‌ జగన్‌ అభిమానులమంటూ మీడియా ముందుకొచ్చి  చెప్పడం ప్రారంభించారు. వీరి వ్యవహారం దావానంలా వ్యాపించడంతో నిందితుడి ఇంటివైపు ఆ తర్వాత రావడం మానేశారు. దీంట్లో లోగుట్టు ఏంటి?

నిందితుడు శ్రీనివాసరావు ఏర్పాటు చేశారని ప్రభుత్వ పెద్దలు చెప్పుకొచ్చిన ఫ్లెక్సీ తొలిరోజు ఎక్కడా కనిపించలేదు. ఆ ఫ్లెక్సీ ఎప్పుడో పోయిందని, ఎక్కడుందో తెలియదని శ్రీనివాసరావు సోదరుడు తొలి రోజు చెప్పుకొచ్చాడు. ఆ మరసటి రోజున ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఓ ఇంటి ముందు ఉన్న ఇసుక దిబ్బపై ఉందని చెప్పి బయటికి తీశారు. ఆ ఫ్లెక్సీపై గతంలో ప్రకటించిన దానికి భిన్నంగా రోజా ఫ్లవర్‌ బొమ్మ ఉంది.  

ముమ్మిడివరం మండల పరిషత్‌ అధ్యక్షుడు పితాని సత్యనారాయణ రావుతో  శ్రీనివాసరావుకు సన్నిహిత సంబంధాలున్నాయి.  శ్రీనివాసరావు తండ్రి తాతారావు కుటుంబీకులకు చెందిన భూములను సత్యనారాయణ కౌలు చేస్తున్నాడన్న వాదనలున్నాయి. ఆ దిశగా ఆరా తీయలేదన్న వాదనలున్నాయి.

ముమ్మిడివరం నియోజకవర్గంలో జరిగే కోడి పందాల్లో కత్తులు కడుతుంటాడు. ఓ టీడీపీ నేత తరుచూ తీసుకెళ్తుండేవాడు. ఆయనతో ఉన్న సత్సంబంధాలు ఎక్కడికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే సోదరుడు ఈయన్ని అన్ని విధాలుగా వినియోగించుకుంటాడన్న ఆరోపణలున్నాయి. ఆ దిశగా విచారణ జరగలేదు.   

నిందితుడు శ్రీనివాసరావు కుటుంబీకులు పందెం కోళ్లు పెంచుతారు. వాటిని పందాల కోసం విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో పెద్దవాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అవి ఏ రకమైన పరిచయాలు. ఎక్కడి వరకు తీసుకెళ్లాయన్నదానిపై కనీసం ఆరాతీయలేదు.

శ్రీనివాసరావుపై 2017లో కేసు నమోదైంది. ప్రస్తుతం ట్రయల్‌లో ఉంది. నేర చరిత్ర ఉన్న శ్రీనివాసరావుకు నో అబ్జక్షన్‌ సర్టిఫికేట్‌ ఎవరిచ్చారు. ప్రస్తుత ఎస్సై ప్రభాకర్‌ తన హయాంలో ఇవ్వలేదని చెప్పగా, పూర్వపు ఎస్సై అప్పలనాయుడు ఎన్‌ఓసీ ఇచ్చారా...? లేదా? అనేది  తనకు గుర్తు లేదని చెబుతున్నారు. అసలు స్వగ్రామం ఉన్న ఏరియాకు చెందిన పోలీసు స్టేషన్‌ ఎన్‌ఓసీ లేకుండా ఎయిర్‌పోర్టులో ఎలా పెట్టారు? దీని వెనకున్నదెవరు? అనే దానిలో లోతుగా పరిశీలన చేయలేదు.

సాధారణంగా హోటల్‌లో పెట్టుకునే చెఫ్‌కే నాలుగు రకాలుగా ఆరాతీసి పెట్టుకుంటారు. అలాంటిది ముక్కు మొఖం తెలియని శ్రీనివాసరావును ఎయిర్‌ పోర్టులోని రెస్టారెంట్‌ను నడుపుతున్న టీడీపీ నేత హర్షవర్ధన్‌ చౌదరి ఎలా పెట్టుకున్నారు.ఆయన వద్దకు తీసుకెళ్లిందెవరు? మధ్యలో ఉన్న వ్యక్తులెవరు?

నిందితుడు తన స్వగ్రామానికొచ్చినప్పుడు స్నేహితులకు, కుటుంబీకులకు భారీ పార్టీ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. లైఫ్‌ సెటిలైపోయిందని...కోటి రూపాయలతో భూమి కొంటానని...నాలుగు ఎకరాలు చూడండని తన స్నేహితులకు చెప్పాడని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆ దిశగా శోధన జరుగుతున్నదా?

వైఎస్‌ జగన్‌ను హతమార్చేందుకు వినియోగించిన కోడి పందేలకు ఉపయోగించే కత్తిని ఎక్కడ నుంచి తెచ్చాడు? కొనుగోలు చేసిందెక్కడ ? అనే దానిపై స్థానికంగా విచారణ జరగలేదు.  
ఈ దిశగా విచారణ జరగకపోగా కాల్‌డేటాలో ఉన్న నెంబర్ల ఆధారంగా సంబంధిత వ్యక్తులు పిలిచి, కాసేపు విచారించి వదిలేశారు. అసలు ఎయిర్‌పోర్టు రెస్టారెంట్‌లో చేర్పించేందుకు ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారన్న దానిపై కూడా కనీసం నిగ్గు తేల్చలేదు. అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు చేయడం గాని, వారి కదలికలపై నిఘా పెట్టడం గాని జరగ లేదు. ఇవన్నీ గాలికొదిలేసి శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ అభిమాని అని, అందుకు తగ్గ ఆధారాలు ఇవని చెప్పేందుకు సిట్‌ అధికారులు దాదాపు విచారణ జరిపారు కానీ, కుట్ర కోణంలో ఆరా తీయలేదు.

శ్రీనివాసరావు నేరం వెనక ఉన్న సూత్రధారులపై కనీసం విచారణ చేయలేదు. దీంతో సిట్‌ విచారణపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే సిట్‌ అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు బయటికి రావన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసును ఎన్‌ఐఎకి కేంద్రం అప్పగించడంతో కుట్ర గుట్టు రట్టవుతుందన్న నమ్మకం కలిగిస్తోంది. దీంతో  టీడీపీ నేతల్లో మేకపోతు గాంభీర్యం కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు