సార్‌.. సార్‌.. ప్లీజ్‌

2 Jun, 2019 13:29 IST|Sakshi

‘సార్‌.. సార్‌.. ప్లీజ్‌ ఎన్నికల్లో మేం మీ గెలుపు కోసమే బాగా పనిచేశాం. మా డివిజన్‌లో మీకు మెజార్టీ వచ్చింది. మేం తెలుగుదేశంలో ఉన్నా మీరంటే మాకు ఎంతో అభిమానం. దయచేసి మమ్మల్ని మీ పార్టీలోకి తీసుకోండి. ఒకవేళ కుదరకపోతే మమ్మల్ని మీ మనుషులుగా భావించి జాగ్రత్తగా చూసుకోండి. మాకు కార్పొరేషన్‌లో రావాల్సిన బిల్లులు ఇప్పించండి సార్‌.’ ఇది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు నిత్యం చేస్తున్న విన్నపం. వారం రోజులుగా టీడీపీ కార్పొరేటర్లు నెల్లూరు సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు వారిని కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండడం నెల్లూరు నగర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత నెల వరకు అధికార పార్టీ కార్పొరేటర్లుగా చలామణి అయిన ఎక్కువ మంది కార్పొరేటర్లు మాజీ మంత్రి నారాయణ సిఫార్సుతో  వారి డివిజన్లలో సబ్‌ కాంట్రాక్టులు తీసుకుని భారీగా పనులు చేశారు. ప్రతి డివిజన్‌లోనూ సబ్‌ కాంట్రాక్టల ద్వారా సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల పనులు చేసిన కార్పొరేటర్లు ఉన్నారు. ప్రభుత్వం మనదే కదా మనల్ని ఎవరు అడగరనే ధీమాతో 80 శాతానికి పైగా నాసిరకం పనులు నిర్వహించారు. అలాగే ఎన్నికల కోడ్‌ ముందు నెలలోనూ భారీగా వర్కులు తీసుకున్న కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఇప్పుడు వారందరి బిల్లులు నగర పాలక సంస్థ ఖజానా ఖాళీగా ఉండడం, ఇతర కారణాలతో నిలిచిపోయాయి. నగరంలో కార్పొరేటర్లు నిర్వహించిన పనులకు సంబంధించి రావాల్సిన బిల్లులు సుమారు రూ.50 కోట్ల వరకు ఉన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ఆఖండ మెజార్టీతో గెలిచి, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఈ క్రమంలో జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించారు. నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌. కోటంరెడ్డి శ్రీధరరెడ్డి రెండో పర్యాయం గెలపొంది అధికార పార్టీ శాసనసభ్యులు అయ్యారు. అలాగే నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు కౌంటింగ్‌ ముగిసిన రోజు నుంచి ఎమ్మెల్యేలకు టచ్‌లోకి వెళ్లేందుకు బలంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

గత 23వ తేదీ రాత్రి నుంచి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ల కార్యాచరణ మొదలైంది. మొదటగా నేరుగా ఎమ్మెల్యేను కలవడానికి ప్రయత్నించి కొందరు విఫలం అయిన క్రమంలో రకరకాల సిఫార్సులతో రంగంలోకి దిగారు. సామాజిక కోణం మొదలుకుని పాత స్నేహలు అంటూ కొందరు మాట కలిపే యత్నాలు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న క్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీ ముఖ్యుల వద్దకు కార్పొరేటర్లు క్యూ కడుతున్నారు. ప్రధానంగా 80 శాతం మంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకు పనులకు సంబంధించిన బిల్లుల రావాల్సింది. ఈ క్రమంలో పార్టీలో చేరికకు ఎమ్మెల్యేలు, ఎంపీ పూర్తిగా మాట్లాడని క్రమంలో కనీసం బిల్లులు ఇప్పించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఐదుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కలిసే యత్నం
ఇక నెల్లూరు నగరంలో ఐదుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యేను కలిసే యత్నం చేసి పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ పి.రూప్‌కుమార్‌ యాదవ్‌ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్‌లో అయితే ఇద్దరు కార్పొరేటర్లు మినహా మిగిలిన వారందరు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వచ్చి వెళుతుండడం, ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో స్పందించకపోవడంతో పార్టీ నేతలు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, తాటి వెంకటేశ్వర్లు, మురళీకృష్ణను కలిసేందుకు  ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఎంపీ కార్యాలయం వద్ద అయితే పార్టీ సీనియర్‌ నేత వైవీ రామిరెడ్డిని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద టీడీపీ కార్పొరేటర్లు అందరూ క్యూ కడుతున్న క్రమంలో ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తుండటం వారిలో టెన్షన్‌ పెరుగుతోంది. ఈ పరిణామాలు అన్నీ చూస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలే అవాక్కవుతున్నారు.

మరిన్ని వార్తలు