సైనికుడి భూమికి రక్షణ కరువు

1 Apr, 2018 07:21 IST|Sakshi
పొలాన్ని తవ్వి పసుపు స్తంభాలతో ఫెన్సింగ్‌ వేసిన టీడీపీ నాయకులు (ఇన్‌సెట్‌) వై.ఎస్‌.జగన్‌కు సమస్య వివరిస్తున్న షేక్‌ షబీరున్నీసా

మాజీ సైనికుడి భూమిని తవ్వి  మట్టి అమ్ముకున్న టీడీపీ నేతలు 

నీరు–చెట్టు పథకం పేరుతో ఆక్రమణ

 అధికార పార్టీకి అండగా నిలిచిన రెవెన్యూ అధికారులు

 నోటి దగ్గర కూడు లాక్కున్నారుఅంటూ గోడు వెళ్లబోసుకున్న సైనికుడి కుటుంబసభ్యులు

సాక్షి, అమరావతి బ్యూరో: దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి శత్రువులను జయించిన సైనికుడి కుటుంబం అధికార పార్టీ ఆక్రమణల దెబ్బకు తల్లడిల్లుతోంది. మాజీ సైనికుని సేవలు గుర్తించి భారత ప్రభుత్వం మంజూరు చేసిన భూమిపై టీడీపీ నేతల కన్ను పడడంతో రాత్రికి రాత్రే పొక్లెయిన్ల ద్వారా తవ్వేశారు. అడ్డుకోవాల్సిన అధికారులు అండగా నిలవడంతో ఆ కుటుంబం న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఏటా 100 బస్తాల ధాన్యం పండించుకుని దర్జాగా బతికిన ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్ర గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు గ్రామానికి చేరుకోవడంతో బాధిత సైనికుని కుటుంబ సభ్యులు జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... 

గుంటూరు జిల్లా మేడికొండూరుకు చెందిన షేక్‌ ఆదం (మిలటరీ ఆదం) 1942 ఆగస్టు 13వ తేదీన భారత సైన్యంలో చేరాడు. 1946లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఆదంకు కాలిలో బుల్లెట్‌ దిగడంతో ప్రత్యేక విమానంలో ఆస్పత్రికి తరలించారు. కాలికి గాయం అయిన ఆయన ఉద్యోగ విరమణ చేసి తిరిగి 1959లో డిఫెన్స్‌ సెక్యూరిటీ ఫోర్సులో చేరాడు. 1970 వరకు భారత ఆర్మీలో సేవలు అందించిన ఆదం ఉద్యోగ విరమణ పొందారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన సేవలను మెచ్చిన భారత ప్రభుత్వం 1965లో రక్ష మెడల్‌ ఇచ్చి గౌరవించింది. 1966లో అప్పటి కలెక్టర్‌ ఆయన జీవనోపాధికి సర్వే నంబరు–364లో 2.59 ఎకరాల భూమిని ఇచ్చారు. ఐదుగురు సంతానం ఉన్న ఆదాం అప్పటి నుంచి ఆ పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. 

మాజీ సైనికుని భూమిపై పెద్దల కన్ను
మేడికొండూరు గ్రామ శివారులో 1974 నుంచి 2014 సంవత్సరం వరకూ క్రమం తప్పకుండా ప్రభుత్వానికి శిస్తు కడుతూ ఆదాం కుటుంబం పొలం సాగు చేసుకుంటోంది. 2016లో ఆ భూమిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. నీరు చెట్టు పథకం పేరుతో పొలాన్ని తవ్వేందుకు అధికారులతో పావులు కదిపారు. రాత్రికి రాత్రే పొలంలో పొక్లెయిన్లు, లారీలతో రెండు రోజుల్లోనే మట్టిని తవ్వి అమ్ముకున్నారు. తాము జీవనాధారం కోల్పోతున్నామని, రక్షణ కల్పించాలని వారు పలుమార్లు ప్రభుత్వ అ«ధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కరువైంది. గత్యంతరం లేక ఆ మాజీ సైనికుని కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 

న్యాయస్థానం తీర్పును సైతం లెక్క చేయని అధికారులు
మట్టి తవ్వకాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని విచారణ అనంతరం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు నుంచి ఆదేశాలు జారీ అయినా టీడీపీ నాయకులు కానీ, అధికారులు కానీ లెక్క చేయకుండా మట్టి తవ్వుకుని సొమ్ము చేసుకున్నారు. దీంతో ఆదాం కుటుంబసభ్యులు శనివారం ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడు మొరపెట్టుకున్నారు.

>
మరిన్ని వార్తలు