మరుభూమి మాయం!

23 Sep, 2017 02:43 IST|Sakshi

ఆ గిరిజనులకు పెద్ద చిక్కొచ్చి పడింది. చస్తే  దహనానికి కాసింత జాగా కరువైంది. ఎన్నో ఏళ్లుగా తాము వినియోగిస్తున్న జాగా కాస్తా పెద్దల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఆ పెద్దలకు పాలకుల అండ మెండుగా ఉండటంతో ఇక అమాయక గిరిజనులకు ఆసరా కల్పించేవారు కరువయ్యారు. ఏం చేయాలో తెలీక వారు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం: బొబ్బిలి పట్టణ పరిధిలో ఐటీఐ కాలనీకి కమలా చెరువు ఒడ్డున ఎన్నో ఏళ్లుగా ఓ శ్మశానం ఉంది. అక్కడ నివసిస్తున్న  వంద గిరిజన కుటుంబాలకు చెందినవారెవరైనా కాలం చేస్తే ఇదే శ్మశానంలో దహన సంస్కారాలు చేసేవారు. ఈ చెరువుకు ఎదురుగా కందుల అపార్ట్‌మెంట్స్‌ను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. అపార్ట్‌మెంట్‌ ఎదురుగా శ్మశానం ఉంటే తనకు నష్టం వస్తుందని భావించిన బిల్డర్‌ దానిని అక్కడి నుంచి తొలగించాలనుకున్నారు. అతని ఆలోచనకు కొందరు టీడీపీ నాయకులు.... అధికారులు అండగా నిలిచారు. కమలా చెరువుకు రూ.6.80 లక్షలతో నీరు–చెట్టు కింద నిధులు మంజూరుచేయించి, నిబంధనలకు విరుద్ధంగా చెక్‌డ్యాం కట్టారు. దానివల్ల శ్మశానంలోకి నీరుచేరింది. దా నిని సాకుగా చూపించి శ్మశానాన్ని మూసేశారు. శ్మశానం రోడ్డును రాత్రికి రాత్రే తొలగించేశారు.

గిరిజనుల మధ్య చిచ్చు
ఐటీఐ కాలనీవాసులు శ్మశానం కోసం పోరాడితే రెవెన్యూ వర్గాలు, టీడీపీ నాయకులు పెద్దరికం వహించి చెరువుకు 50 అడుగుల దూరంలో ఉన్న పోలవానివలస గిరిజనుల శ్మశానాన్ని వినియోగించుకోమని సలహా ఇచ్చారు. అయితే తమ గ్రామానికి చెందిన శ్మశానంలోకి ఇతరులు ఎలా వస్తారని, తమకే ఆ స్థలం చాలదని పోలవానివలస గిరిజనులు అభ్యంతరం చెబుతున్నారు. ఇది కాస్తా గిరిజను ల మధ్య చిచ్చుకు దారితీస్తోంది. కాగా చెరువులో శ్మశానానికి ఇబ్బంది కలుగుతుంటే తాము రోడ్డు మార్చామని తహసీల్దార్‌ కోరాడ సూర్యనారాయణ అంటున్నారు.

రాస్తే రాసుకోండి..ఏటవుద్ది
ఆ గిరిజనులు మీకు కంప్‌లైంట్‌ చేశారా.? రాస్తే రాసుకోండి... ఏటైపోద్ది.. మినిష్టర్‌ చెపితే పనులు చేశాం. రూ.6లక్షలతో చెరువు పనులు చేశాం. రాసుకో ఏటవుద్ది.
– సింగనాపల్లి ఈశ్వరరావు,
సర్పంచ్, ఎం.బూర్జవలస

మా శ్మశానాన్ని మాకివ్వాల్సిందే...
మా శ్మశానాన్ని కందుల అపార్టుమెంట్స్‌ యజమాని రాత్రికి రాత్రే కప్పించారు. అప్పట్లో గొడవ పడ్డాం. రెవెన్యూ అధికారులు కలుగజేసుకుని పోలవానివలస శ్మశానంలో çస్థలం కేటాయించారు. కానీ మా శ్మశానమే మాకు కావాలి.
– వాడపల్లి రజని, బొద్దాన అప్పారావు, ఐటీఐ కాలనీ.

నాకేం తెలియదు
నీరు–చెట్టు పనులు బాగానే జరిగాయి. చెక్‌డ్యాంను మధ్యలో అడుగుమేర తొలగించాం. మిగతా విషయాలు నాకేమీ తెలియవు.
– విద్యాసాగర్, జేఈ, నీటిపారుదలశాఖ

సర్పంచ్‌ చేయించారు
అపార్టుమెంట్‌కు శ్మశానం తొలగింపునకు ఎలాంటి సంబంధం లేదు. జేసీబీ తెస్తే ఎం.బూర్జవలస సర్పంచ్‌ ఈశ్వరరావు దానిని తీసుకెళ్లి పనులు చేయించారు.
– కందుల వినోద్, కందుల అపార్టుమెంట్స్‌ యజమాని

మరిన్ని వార్తలు