రాజ్యమేలిన అరాచకం!

20 Apr, 2019 12:04 IST|Sakshi
రవాణా శాఖ కమిషనర్‌ భద్రత సిబ్బందిపై దాడి చేస్తున్న టీడీపీ నేతలు (ఫైల్‌)

ఐదేళ్లలో అధికారం అండతో పేట్రేగిన టీడీపీ నేతలు   

బెజవాడలో వారు చెప్పిందే శాసనం

కాదూ కూడదంటే కక్ష సాధింపు చర్యలు

రవాణా శాఖ కమిషనర్‌పై గూండాగిరి

2017లో ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు ధర్మాసనం

టీడీపీ నేతలు కేశినేని, బొండా, బుద్ధా, నాగుల్‌మీరాకు మళ్లీ నోటీసులు  

కాల్‌మనీ కాలనాగులు..మహిళలు, వ్యాపారులపైదాడులు.. ఐపీఎస్‌ అధికారులకేభద్రత లేని పరిస్థితులు..యథేచ్ఛగా భూఆక్రమణలు..వెరసి ఈ ఐదేళ్ల చంద్రబాబుపాలనలో విజయవాడలోఆరాచక శక్తులు విజృంభించాయి.  ప్రజారాజధానిగా తీర్చిదిద్దుతామన్న విజయవాడనుదౌర్జన్యాలు.. వేధింపులు..  వైట్‌కాలర్‌ నేరాలకు కేంద్రస్థానంగా మార్చేశారు. టీడీపీమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే సూత్రధారులుగా.. వారి మందీమార్బలాలే  పాత్రధారులుగా పేట్రేగిపోయినవైనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాక్షి, అమరావతి బ్యూరో :  2014లో టీడీపీ అధికారంలోకి రావడంతోనే విజయవాడలో కాల్‌మనీ రాకెట్‌ బరితెగించింది. టీడీపీ ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ముఖ్య అనుచరులే అరాచక శక్తులుగా మారి సామాన్యుల ఆస్తులను కొల్లగొట్టారు. ఏడాది కాలంలో విజయవాడలో దాదాపు రూ.2 వేల కోట్ల స్థాయికి కాల్‌మనీ టర్నోవర్‌ చేరుకుందంటే ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. అంతటితో ఆగకుండా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఓ మహిళ పటమట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బట్టబయలైంది. ఒక్కొక్కటిగా కాల్‌మనీ దురాగతాలు వెలుగుచూడటంతో రాష్ట్రం నివ్వెరపోయింది. అయితే ఇందులో సూత్రధారులు, పాత్రధారులు అయిన టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరగణానికి ప్రభుత్వం వత్తాసుగా నిలవడం చీకటి రాజ్యానికి ప్రోత్సాహంగా పరిణమించింది.

దాడులు.. దౌర్జన్యాలు
వాణిజ్య ప్రధాన ప్రాంతమైన విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యే బొండా ఉమా ఆగడాలకు ఈ ఐదేళ్లూ అంతేలేకుండాపోయింది. వ్యాపారుల నుంచి భారీ ఎత్తున బలవంతపు వసూళ్లకు   పాల్పడ్డారు. నెలకు దాదాపు రూ.కోటి వరకు వసూళ్లతో హల్‌చల్‌ సృష్టించారు. ఈ నేపథ్యంలోనే బలవంతపు వసూళ్ల వ్వవహారంలో ఎమ్మెల్యే బోండా ఉమా వైఖరిని కోగంటి సత్యం ప్రశ్నించారు. కానీ పోలీసులు ఆయనపైనే తిరిగి కేసు నమోదు చేసి అరెస్టు చేయడం గమనార్హం. రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసు ముసుగులో సెటిల్‌మెంట్ల దందాకు తెరతీశారు. వ్యాపారులను అక్కడకు పిలిపించి వసూళ్లకు పాల్పడ్డారు. ఆ ప్రజాప్రతినిధి తనయులు అక్కడ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్‌ రాకెట్‌ను నిర్వహించారు. 

ఐపీఎస్‌పైనే గూండాగిరీ
విజయవాడలో సాక్షాత్తూ ఐపీఎస్‌ అధికారులకు రక్షణలేదని నిరూపించారు టీడీపీ ప్రజాప్రతినిధులు. రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బొండా ఉమా తమ అనుచరులతో దాడికి తెగబడ్డారు. కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై ఎంపీ నాని, ఎమ్మెల్యే బొండా నడిరోడ్డుపై విరుచుకుపడ్డారు. దాదాపు 200 మంది అనుచరులతో చుట్టుముట్టి తీవ్రంగా దూషించారు. కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపై దాడికి యత్నించారు. అడ్డుకున్న ఆయన గన్‌మెన్‌పై ఎమ్మెల్యే బొండా ఉమా చేయి చేసుకున్నారు. ఓ ఐపీఎస్‌ అధికారికి ఇంతటి అవమానం జరిగినప్పటికీ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రతివాదులందరికీ అప్పట్లో నోటీసులు జారీ చేసింది. ఈ గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. తమ క్లయింట్‌ ఎంపీ కేశినేనికి నోటీసులు అందలేదని అతని తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో ఎంపీ కేశినేనితో పాటు అందరికీ నగర పోలీసు కమిషనర్‌ ద్వారా మళ్లీ నోటీసులు అందజేయాలని ఆదేశించడంతో ఇప్పుడా ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది. 

హవాలా.. హవాలా..
టీడీపీ పెద్దలు విజయవాడ కేంద్రంగా హవాలా రాకెట్‌ను వ్యవస్థీకృతం చేశారు. జిల్లా కీలక నేత దీనికి అండదండలు అందిస్తుండటంతో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. అక్రమార్జనను విదేశాలకు పంపి అక్కడ నుంచి బ్యాంకుల ద్వారా విజయవాడకు తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో విభేదాలు రావడంతో ప్రైవేటు ఆస్పత్రుల పెద్దలు కొందరు ఓ దళారిపై దాడి చేశారు. దీనిపై విచారిస్తే తమ అక్రమాలు బయటకు వస్తాయని జిల్లా కీలక నేత రాజీ చేసి అప్పట్లో ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చారు. ఆ కీలక నేత కొన్ని బ్యాంకుల అధికారులను కూడా మేనేజ్‌ చేసి వేల కోట్ల నల్లధనాన్ని హవాలా మార్గంలో మళ్లించినట్లు వెల్లడైంది. త్రివేది చంపాలాల్‌ అనే వ్యాపారి ఖాతాలో గుర్తుతెలియని వ్యక్తులు రూ.19 కోట్లు జమ చేయడం, విత్‌డ్రా చేయడం కలకలం సృష్టించింది. ఇలాంటి హవాలా బాగోతాలు దాదాపు 200 ఖాతాల రూ.2 వేల కోట్ల వరకు సాగినట్లు ఆదాయ పన్ను అధికారులు గుర్తించారు. కానీ దీనివెనుక జిల్లా కీలక నేత ఉండటంతో పోలీసులు విచారణ ఊసే ఎత్తడం లేదు.

కలచివేసిన సాయిశ్రీ ఉదంతం
టీడీపీ ఎమ్మెల్యే బొండా దురాగతాలకు పరాకాష్టగా చిన్నారి సాయిశ్రీ ఉదంతం నిలిచిపోయింది. క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తురాలైన సాయిశ్రీకి చికిత్స కోసం ఆమె ఇంటిని అమ్మనివ్వకుండా ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరులు అడ్డుకున్నారు. సాయిశ్రీ  తండ్రి మాదంశెట్టి శివకుమార్‌కు వత్తాసు పలుకుతూ చిన్నారి ఆరోగ్యంతో ఆటలాడుకున్నారు. తన బిడ్డను రక్షించుకునేందుకు ఆమె తల్లి సుమశ్రీ చేసిన ప్రయత్నాలన్నింటినీ అడ్డుకున్నారు. తనను బతికించమని కోరుతూ ఆ చిన్నారి  పంపిన వీడియో సందేశం చూసిన ప్రతి ఒక్కరినీ ఎంతగానో కలచివేసింది. కానీ ఆమె తండ్రి శివకుమార్, ఎమ్మెల్యే బోండా ఉమా మనసు మాత్రం కరగలేదు. దీంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సాయిశ్రీ ప్రాణాలు విడిచింది. ఈ ఘటన విజయవాడలో టీడీపీ పెద్దల అమానవీయ వైఖరికి నిదర్శనంగా  నిలిచిపోయింది.

భూ ఆక్రమణలు.. లీజుల పేరిట భూదోపిడీలు
విజయవాడలో భూ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించేశారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా అనుచరులు నగర శివారులోని కండ్రిగలో ప్రభుత్వ భూములను కబ్జా చేసేశారు. దాదాపు 2 ఎకరాల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని ప్రభుత్వ భూములను టీడీపీ ప్రజాప్రతినిధి హస్తగతం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని విలువైన 6 ఎకరాలను జిల్లా కీలక నేత నకిలీ పత్రాలతో చెరబట్టారు. అధికారిక లీజుల పేరుతో నగరంలోని వేల కోట్ల ప్రభుత్వ భూములపై టీడీపీ పెద్దలు కన్నేశారు. రూ.2,600 కోట్ల విలువైన 26 ఎకరాల స్వరాజ్య మైదానాన్ని విదేశీ కంపెనీల ముసుగులో చినబాబుకు కట్టబెట్టడానికి యత్నించారు. ట్రాన్స్‌కోకు చెందిన రూ.200 కోట్ల విలువైన గుణదలలోని 4 ఎకరాలను స్టార్‌హోటల్‌ పేరిట చినబాబు పరం చేయడానికి స్కెచ్‌ వేశారు. కృష్ణా తీరంలో రివర్‌ఫ్రంట్‌ రిసార్టుల పేరిట అక్కడ ఉన్న పేదలను బలవంతంగా వెళ్లగొట్టారు. వందల కోట్ల విలువైన ఆ భూములను చినబాబు బినామీలకు కట్టబెట్టడానికి పన్నాగం పన్నారు. ఇలా టీడీపీ నేతలు అధికార బలంతో యథేచ్ఛేగా కబ్జాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు పాల్పడ్డారు.

>
మరిన్ని వార్తలు