పేదల స్థలాలపై తమ్ముళ్ల పంజా

13 Sep, 2019 12:46 IST|Sakshi
ఇందిరమ్మ కాలనీలో టీడీపీ నేతలు ఆక్రమించిన ఇంటి స్థలాలు

టీడీపీ ప్రభుత్వ పాలనలో చేతివాటం

అర్హులైన పేదలకు అన్యాయం

కర్నూలు, కోవెలకుంట్ల: పట్టణ శివారు ఇందిరమ్మ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటి స్థలాల కబ్జా కొనసాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ పాలనలో అధికారం అండగా కోవెలకుంట్లలోని ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఇంటి స్థలాల పంపిణీలో చక్రం తిప్పారు. అప్పటి తహసీల్దార్‌ను అడ్డం పెట్టుకుని  బోగస్‌ పట్టాలతో స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. 

తమ్ముళ్ల మాయాజాలం..
2009వ సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కోవెలకుంట్ల– నంద్యాల ఆర్‌అండ్‌బీ రహదారి పక్కన ఉన్న ఇందిరమ్మ కాలనీలో రెండు సెంట్ల చొప్పున వెయ్యి మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. ఈ మేరకు అప్పటి తహసీల్దార్‌ రామచంద్రారెడ్డి పక్కాగా రికార్డుల్లో నమోదు చేశారు. అదే ఏడాది 840 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం కింద గృహాలు మంజూరు కావడంతో ఇంటి నిర్మాణా లు చేపట్టారు. ఆ తర్వాత కూడా  కాలనీలో ఖాళీ స్థలాలుండడంతో 2010–11వ సంత్స రంలో అప్పటి బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మరో 400 మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేసి పట్టాలు అందించారు. రెండు విడతల ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత అప్పట్లో ఇక్కడ తహసీల్దార్‌గా పనిచేసిన తిరుపాలు, కోవెలకుంట్లకు చెందిన ఇద్దరు టీడీపీ నేతలు ఇందిరమ్మ కాలనీపై కన్నేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రావడంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆఫీస్‌ రికార్డులను తారుమారు చేశారు. బోగస్‌ పట్టాలు సృష్టించి 400కుపైగా ఫ్లాట్లను కబ్జా చేసినట్లు తెలుస్తోంది. ఆఫీసులో భద్రపరిచిన లబ్ధిదారుల పట్టాలు తొలగించి వాటి స్థానంలో 40 నుంచి 50 పట్టాలను బినామీ పేర్లతో స్వాహా చేశారు. తర్వాత ఆ ఫ్లాట్లను రూ. 50 వేల నుంచి రూ. లక్ష  వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు సంబంధించి విచారణ చేపడితే అక్రమాలు బయటపడే అవకాశం ఉంది.

ఒకే పట్టాను ముగ్గురికి ఇచ్చారు..
కోవెలకుంట్లకు చెందిన పద్మావతమ్మకు పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో 2013లో 1,264 నెంబర్‌  ఫ్లాట్‌ కేటాయించారు. ఇందుకు సంబంధించిన పట్టా కూడా ఇచ్చారు. అయితే ఇదే నంబర్‌పై విమల అనే మరో మహిళ పేరున కూడా పట్టా ఉంది. ఆమె ఆ ఫ్లాట్‌ను రాజు అనే రిటైర్డ్‌ ఉద్యోగికి విక్రయించగా తిరిగి అదే నంబర్‌తో కొన్న వ్యక్తికి పట్టా కేటాయించారు.

మరొకరి పేరున పట్టా..
పట్టణానికి చెందిన సుబ్బరత్నమ్మకు సొంతిల్లు లేకపోవడంతో 2009లో అప్పటి తహసీల్దార్‌ 1,011 నంబర్‌తో పట్టా ఇచ్చారు. కొన్ని నెలలకు ఇదే నంబర్‌పై కోవెలకుంట్లకు చెందిన నాగరా జుకు పట్టా కేటాయించారు. ఈ నెంబర్‌పై తహసీల్దార్‌ కార్యాలయ రికార్డుల్లో సుబ్బరత్నమ్మ పేరుతోనే పట్టా ఉంది. ఇలా రికార్డులతో సం బం«ధం లేకుండా ఇదే నంబర్‌పై డూప్లికేట్‌ పట్టా ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరే కాదు ఇందిరమ్మ కాలనీలో టీడీపీ నాయకులు వందల సంఖ్యలో బోగస్‌ పట్టాలు సృష్టించి ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి.  

విచారణ చేపడతాం..
పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో బోగస్‌ పట్టాల వ్యవహారంపై విచారణ చేపడతాం. వచ్చే మార్చి నాటికి ఇల్లులేని నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి పేద కుటుంబాల జాబితా సేకరణ, వివరాలు అప్‌లోడ్‌ చేసే పనుల్లో నిమగ్నమయ్యాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే బోగస్‌ పట్టాలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తాం.  
– విజయశ్రీ, తహసీల్దార్, కోవెలకుంట్ల

మరిన్ని వార్తలు