ప్రభుత్వ భూమి.. పరిహారమా స్వామి!

18 Jun, 2020 08:18 IST|Sakshi

ఆక్రమణలో సుమారు 50 ఎకరాలు

బినామీ పేర్లతో పట్టాలు

అనుచరుల అనుభవంలో ఉన్నట్లు రికార్డులు

పారిశ్రామిక కారిడార్‌కు ఇచ్చేందుకు యత్నాలు

రూ.కోట్లు నొక్కేందుకు సన్నాహాలు

బొజ్జల అనుచరుడి పన్నాగాలు

ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ముందస్తుగా తైలం చెట్లు నాటాడు. అనంతరం బినామీ పేర్లతో పట్టాలు సృష్టించాడు. అధికారుల సహకారంతో అనుచరులనే అనుభవదారులుగా రికార్డుల్లో నమోదు చేయించాడు. ఇప్పుడు గుట్టుగా సర్కారుకే విక్రయించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. రూ.కోట్ల పరిహారం దిగమింగేందుకు సిద్ధమవుతున్నాడు.

సాక్షి, తిరుపతి: టీడీపీ నాయకులు గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలను ఆక్రమించుకుని అమ్మి సొమ్ముచేసుకున్న సంఘటనలు కోకొల్లలు. నాడు టీడీపీ చేసిన పాపాలు, అన్యాయాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాళహస్తి రూరల్‌పరిధిలో టీడీపీ నాయకుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడు సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని దర్జాగా అనుభవిస్తున్నాడు. కబ్జా చేసిన భూమిని తిరిగి ప్రభుత్వానికే అప్పగించి పరిహారం రూపంలో కోట్ల రూపాయలు నొక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ తహసీల్దార్, గతంలో పనిచేసిన మరో తహసీల్దార్, వీఆర్వో (టీడీపీ నాయకుడి బంధువు) సహకారంతో అక్రమాలకు తెరతీశాడు. శ్రీకాళహస్తి మండల పరిధిలోని ఎంపేడు, వాగివేడు పంచాయతీ వెంగళ్లంపల్లిలో సుమారు 50 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నాడు. 2016లో ఆక్రమించుకున్న ఈ భూముల్లో తైలం చెట్లు నాటాడు. రెండేళ్ల తర్వాత 2018లో బినామీ పేర్లతో పట్టాలు సృష్టించాడు. మరికొందరి పేర్లతో అనుభవంలో ఉన్నట్లు రికార్డులు తయారు చేశాడు. 

పరిహారం కోసం ప్రయత్నం
ఏర్పేడు – వెంకటగిరి మార్గంలో ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు కానుంది. ఇందుకోసం ప్రభుత్వం భూ సేకరణ చేపట్టింది. ప్రభుత్వ భూములతో పాటు డీకేటీ, అనుభవంలో ఉన్న భూములను తీసుకుని వారికి పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఎకరాకు రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షలు చెల్లించే అవకాశం ఉందని గ్రహించిన టీడీపీ నేత గుట్టుచప్పుడు కాకుండా సర్కార్‌ భూములను ప్రభుత్వానికే విక్రయించేందుకు పథకం వేశాడు. పరిహారం రూపంలో మొత్తం రూ.10 కోట్లు జేబులో వేసుకునేందుకు పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వారితో మాట్లాడితే తమ పేరున ప్రభుత్వం భూములు ఇచ్చినట్లు, పట్టాలు మంజూరు చేసినట్లు తెలియదని చెబుతున్నారు. భూస్వామి అయిన టీడీపీ నాయకుడు తన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, తనకు భయపడే వారి పేర్లతో పట్టాలు,   అనుభవదారులుగా పత్రాలు సృష్టించారు.  

విచారణ చేసి న్యాయం చేస్తాం
ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయం నా దృష్టికి రాలేదు. ఆక్రమణ జరిగి ఉంటే విచారణ జరిపించి న్యాయం చేస్తాం. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. –జరీనా బేగం, తహసీల్దార్, శ్రీకాళహస్తి రూరల్‌

మరిన్ని వార్తలు