యువతి అదృశ్యంలో టీడీపీ నేతల హస్తం?

24 May, 2015 01:17 IST|Sakshi
యువతి అదృశ్యంలో టీడీపీ నేతల హస్తం?

 ఓ నేతను తప్పించేందుకు
 పోలీసులపై ఒత్తిడి
 పోలీసు ఉన్నతాధికారులను
 ఆశ్రయించినా ఫలితం శూన్యం

 
 కాకినాడ లీగల్ :కాకినాడకు చెందిన ఓ యువతి అదృశ్యమైన ఘటనలో టీడీపీ నేతల హస్తం ఉన్నట్టు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక నేతపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఆ నేతను తప్పించేందుకు మరో నేత పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలి తం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా వున్నాయి. కాకినాడ వినుకొండవారి వీధికి చెందిన చప్పా శివమ్మ, అప్పారావుకు నలుగురు కుమార్తెలు. రెండో కుమార్తె రామలక్ష్మి 10వ తరగతి వరకు చదివింది. ఆమెకు విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయం చేశారు. జూన్ 10న పెళ్లి చేసేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు.
 
  ఇదిలా వుండగా టీడీపీకి చెందిన కృష్ణ అనే వ్యక్తి కొంతమంది యువతులను నియమించుకుని ఎన్నికల డ్యూటీ కోసం వారితో ఫీల్డ్ వర్క్ చేయించేవాడు. రామలక్ష్మి కూడా అతడి వద్దకు పనికి వెళ్లేది. ఆమెను డ్యూటీ అనంతరం కృష్ణ ఆమె ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించి వెళ్లేవాడు. ఈక్రమంలో గత నెల 24 ఉదయం 11 గంటలకు ఆమెను డ్యూటీకి రమ్మని కృష్ణ ఫోన్ చేశాడు. పింఛను పుస్తకాలు పట్టుకుని రమ్మని ఆమెకు చెప్పాడు.  ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పి పుస్తకాలు తీసుకుని వార్ఫు రోడ్డులోని మున్సిపల్ స్కూల్ వద్దకు బయలుదేరిం ది. ఆ రోజు రాత్రి వరకూ ఆమె ఇంటికి రాకపోవడంతో  కుటుంబ సభ్యులు కృష్ణకు ఫోన్ చేసి రామలక్ష్మి గురించి అడిగారు. డ్యూటీ అయిపోయిన వెంటనే వెళ్లిపోయిందని,  ఏమైందో తనకు తెలియదని అతడు బదులిచ్చాడు.
 
  కొంత సమయం తర్వాత ఆమె కుటుంబ సభ్యు లు మళ్లీ కృష్ణకు ఫోన్ చేయగా కంగారు పడవద్దు, ఎక్కడా ఫిర్యాదు చేయవద్దు, సాయంత్రానికల్లా ఆమెను అప్పగించే బాధ్యత తనదని హామీ ఇచ్చాడు. కుటుంబసభ్యులు ఆమె గురించి బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వాకబు చేశారు. ఫలితం లేకపోవడంతో మళ్లీ కృష్ణకు ఫోన్ చేశారు. రామలక్ష్మి ఏమైందో తనకు తెలియదని,  మీ ఇష్టమొచ్చింది చేసుకోం డంటూ అతడు బదులిచ్చాడు.దీంతోతల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గత నెల 29న యువతి అదృశ్యంపై కేసు నమోదు చేశారు.  టీడీపీ నేత కృష్ణపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఆ పార్టీ వాణిజ్య విభాగానికి చెందిన నేత ఒకరు పోలీసులపై తీవ్ర ఒత్తిడి తేవడంతో పోలీసులు కృష్ణపై కేసు నమోదు చేయలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు వారు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎస్పీ రవిప్రకాష్ సెలవులో ఉండడంతో కింది స్థాయి అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్టుచెప్పారు. తమ కుమార్తె ఏమైందోనని తమకు భయంగా ఉందంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
 

>
మరిన్ని వార్తలు