ఖాకీలపై ఖద్దరు కక్ష

3 May, 2018 03:33 IST|Sakshi

సాక్షి, గుంటూరు: క్రికెట్‌ బెట్టింగ్‌ మహమ్మారి దెబ్బకు ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది క్రికెట్‌ బెట్టింగ్‌లో సర్వం కోల్పోయి, అప్పుల పాలై ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ సీహెచ్‌ వెంకటప్పలనాయుడు క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బుకీలపై దృష్టి సారించారు. జిల్లాలో పలువురు బుకీలను అదుపులోకి తీసుకుని విచారించారు.

ఇంటి దొంగల పాత్రపై ఆధారాలు లభ్యమయ్యాయి. నరసరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలో ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, పలువురు ఎస్సైలకు క్రికెట్‌ బుకీలతో సంబంధాలున్నట్లు ఆధారాలు దొరికాయి. క్రికెట్‌ బుకీల స్టేట్‌మెంట్‌తోపాటు అధికారులకు మామూళ్లు వసూలు చేసి ఇచ్చిన  డ్రైవర్లు, గన్‌మెన్‌లు, హోంగార్డుల నుంచి లిఖితపూర్వక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. దీంతో ఇద్దరు ఎస్సైలు, ఓ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు.

ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించారు. క్రికెట్‌ బుకీలు తమ పేర్లు బయటపెట్టారని తెలుసుకున్న కొందరు అవినీతి పోలీసు అధికారులు తమపై వేటు పడకుండా రక్షించాలంటూ గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ముఖ్యనేతలను ఆశ్రయించారు. పోలీసులకు చిక్కిన క్రికెట్‌ బుకీల్లో పిడుగురాళ్ల మున్సిపల్‌ కౌన్సిలర్‌తోపాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. సత్తెనపల్లిలో దొరికిన బుకీల్లోనూ ‘అధికార’ నేతలుండడం గమనార్హం.

బెట్టింగ్‌ మాఫియా జోలికి వెళ్లొద్దంటూ అధికార పార్టీ ముఖ్యనేతల ఒత్తిడి మేరకు ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు రావడంతో పోలీసులు విచారణను నిలిపివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ఓ అధికారిని టీడీపీ నేతలు బదిలీ చేయించారు. ఆయన్ని వీఆర్‌లో ఉంచేలా చేసి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీపై సైతం బదిలీ వేటు చేయించేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు