పచ్చ 'ధన్‌'దా..!

27 Aug, 2018 13:28 IST|Sakshi

కమీషన్‌ లేకపోతే బిల్లులు రావు

మరోసారి టెండర్‌ వేయలేరు

కాంట్రాక్టర్లను వేధిస్తున్న ప్రజాప్రతినిధులు

ముందుకు సాగని డెల్టా ఆధునికీకరణ టెండర్లు

ప్రజా ప్రతినిధులే కమీషన్‌కింగ్‌లుగా మారారు. పచ్చనోట్ల దందాకు దిగుతున్నారు. కాంట్రాక్టర్‌ ముందుగా కమీషన్‌ చెల్లిస్తేనే బిల్లులు మంజూరవుతున్నాయి. లేకపోతే ఏదో విధంగా వేధించడం, అవసరమైతే కేసుల వరకూ వెళ్లడం ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది. దీనికి శనివారం పాలకొల్లులో జరిగిన   ఘటనే నిదర్శనం.

సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు:  డెల్టా ఆధునికీకరణ పనులకు మూడు నాలుగుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడానికి ముడుపుల కోసం ప్రజాప్రతినిధులు చేస్తున్న వేధింపులే కారణమన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నా యి. ఒకసారి జెడ్పీ చైర్మన్‌ బాపిరాజు కూడా ‘కొందరు ప్రజాప్రతినిధుల్లా చేసే ప్రతిపనికీ కమీషన్లు తీసుకోను’ అంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో పనికి 8 నుంచి 20 శాతం వరకూ  కమీషన్లు ఇవ్వాల్సిందేనని జిల్లాలోని మెజారిటీ ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లను డిమాండ్‌ చేస్తున్నారు. కొంత మంది అయితే ఒక అడుగు ముందుకేసి అసలు టెండర్లు ఎవరు వేయాలో కూడా నిర్ణయిస్తున్నారు.

ఇదేమి‘రామా’!
పాలకొల్లులో డెల్టా ఆధునికీకరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు కేసు పెట్టించి అరెస్టు చేయించడం వివాదాస్పదంగా మారింది. విజయవాడకు చెందిన పీఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కాంట్రాక్టర్‌ పాకనాటి పృథ్వీరాజ్‌ పాలకొల్లు పట్టణంలోని దమ్మయ్యపత్తి మురుగుకోడు పనులు చేపట్టారు. అందులో భాగంగా  టెండర్‌ వేసి గత ఏడాది నవంబర్‌లో పనులు ప్రారంభించారు. మొత్తం  210 మీటర్ల పనికి రూ.1.46 కోట్లకు టెండర్‌ వేశారు. ఇందులో 95 మీటర్ల పని పూర్తి కాగా రూ.60 లక్షల కోసం బిల్లులు పెట్టారు. అయితే బిల్లులు ఇవ్వకపోవడంతో  ఎమ్మెల్యేను కలిశాడు. ఎమ్మెల్యే తనకు 20శాతం కమీషన్‌ ఇస్తేనే బిల్లులువస్తాయని చెప్పారని కాంట్రాక్టర్‌ ఆరోపిస్తున్నారు. తాను ఐదు శాతం కన్నా ఎక్కువ ఇవ్వలేనని, అది కూడా బిల్లు ఇస్తేనే ఇస్తానని చెప్పడంతో ఇరిగేషన్‌ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పోలీసు స్టేషన్‌లో కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు చేయించారు. ఒక్క రామానాయుడే కాదు.. జిల్లాలోని చాలామంది ఎమ్మెల్యేలూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. తమవారికే కాంట్రాక్టులు దక్కేలా చేస్తున్నారు. ఒక వేళ బయట వారికి వెళ్లినా కమీషన్లు దండుకుంటున్నారు. 

ఇవిగో ఉదాహరణలు  
డెల్టాలోని ఓ ఎమ్మెల్యే  అన్ని పనులూ తన వారికే ఇప్పిస్తుంటారు. ఆ నియోజకవర్గంలో బయటవారు పని చేసే అవకాశం ఉండదు. వేసిన రోడ్లు  ఏడాదికే పాడైపోయాయి. కమీషన్లు తీసుకుని నాసిరకం పనులు చేయడంతో అధ్వానంగా తయారయ్యాయి.
జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉండే మరో ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఎవరైనా తనని కలిసి ముడుపులు చెల్లించిన తర్వాతే టెండర్లు వేయాల్సి ఉంటుంది. అక్కడ అన్ని టెండర్లూ ఎక్సెస్‌కు వేయాల్సిందే. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో లెస్‌ టెండర్లు పడితే ఇక్కడ ఒక్కచోట మాత్రం ఎక్సెస్‌కి వేస్తారు. అదీ ఎమ్మెల్యే చెప్పిన వారే  వేయాలి.
ఏలూరు కార్పొరేషన్‌లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. ఇక్కడ కూడా రూ.30 కోట్లతో అభివృద్ది పనులకు టెండర్లు పిలిస్తే ఏ టెండరు ఎవరు వేయాలో ముందుగానే నిర్ణయించేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో సింగిల్‌ టెండర్ల బదులు కొన్నింటికి డమ్మీ టెండర్లు వేయించారు. సింగిల్‌ టెండర్లు వచ్చినప్పుడు మరోసారి టెండర్‌ పిలవాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను పక్కన పెట్టి సుమారు వందకు పైగా సింగిల్‌ టెండర్లను అనుమతించేశారు. డమ్మి టెండర్లు కూడా ఒక సొసైటీ పేరు మీద  వేయించారు. వడ్డెర సొసైటీకి రూ.20 లక్షల వరకూ డిపాజిట్‌ (ఈఎండీ) లేకుండా టెండర్‌ వేసే అవకాశం ఉంటుంది. అంతకు మించి అయితే వారు కూడా డిపాజిట్‌ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇదే సంస్థ పేరుతో సుమారు నాలుగు కోట్ల రూపాయల వరకూ డిపాజిట్లు లేకుండానే డమ్మీ టెండర్లు వేసేశారు. టెండర్లు కేటాయించకుండానే ఇప్పటికే చాలా పనులు పూర్తికాగా, మరికొన్ని పనులు 50 శాతం వరకూ అయిపోయాయి.  నగరంలోని నూకాలమ్మ గుడి నుంచి సుబ్బమ్మదేవి స్కూల్‌ వరకూ రోడ్డు వేసి ఏడాది కూడా కాలేదు. ఈ రోడ్డును మనుషులతో తవ్వించాల్సి ఉండగా, మిషన్లు ఉపయోగించడంతో ఈ రోడ్డు గడువు పూర్తి కాకుండానే పాడైపోయింది.

మరిన్ని వార్తలు