టీడీపీలో ‘రేషన్’ గోల !

16 Jul, 2014 03:31 IST|Sakshi
టీడీపీలో ‘రేషన్’ గోల !

 కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అంటే ఇదే! ‘అధికారంలోకి వచ్చాం.. అనుచరగణాన్ని అందలమెక్కిద్దాం’ అని టీడీపీ పాతనేతలు ఆలోచిస్తుంటే.. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినంత మాత్రాన తమ వర్గానికి అన్యాయం జరిగితే సహించేది లేదని గల్లా వర్గం గట్టిగా వాదిస్తోంది. దీంతో చంద్రగిరి, తిరుపతిలో ‘రేషన్ డీలర్ల’ తొలగింపు.. కొత్త వారి నియామకం టీడీపీలో చిచ్చు రేపుతోంది. తమ్ముళ్ల తగువులాటతో ఎటు అడుగు వేయాలో తెలీక జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరకు ఈ పంచాయతీ చంద్రబాబు దృష్టికి వెళ్లిందంటే టీడీపీలో ఇంటిపోరు ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది.  
 
సాక్షి, చిత్తూరు : అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీలో ఇంటిపోరు మొదలైంది. కొన్నేళుగ్లా పార్టీకోసం పనిచేసినవారికి... అధికారం కోసం కాంగ్రెస్ నుంచి టీడీపీకి అరువొచ్చిన వారికి మధ్య వైరం తారస్థాయికి చేరింది. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న రేషన్ డీలర్లను తొలగించి వారి స్థానంలో తాము సూచించిన వారిని నియమించాలని వలపల దశరథనాయుడు, మాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఇందు శేఖర్‌లు పాత జిల్లా కలెక్టర్ రాంగోపాల్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీధర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అయితే పాతవారంతా తాను నియమించినవారని, వారంతా తన అనుచరవర్గమని, వారి జోలికి వస్తే ఊరుకునేది లేదని మాజీమంత్రి గల్లా అరుణకుమారి కూడా తనదైన శైలిలో జిల్లా యంత్రాంగానికి హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది.
 
అయితే అధికారులు మాత్రం ఇద్దరి సిఫార్సులను పక్కకునెట్టారు. సీఎం చంద్రబాబుతో విషయం చర్చించి ఆయన చెప్పినట్లు నడుచుకునేందుకు అధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో రెండువర్గాలు తమ పంచాయితీని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మొదటినుంచి టీడీపీలోకి గల్లా అరుణకుమారి రాకను వ్యతిరేకిస్తున్న  మాజీమంత్రి గాలిముద్దుకృష్ణమనాయుడు, ఇందుశేఖర్, దశరథనాయుడు ఓవైపు ఉంటే గల్లా అరుణకుమారి ఒక్కరే ఓ వైపు ఉన్నారు. తిరుపతిలో సైతం చదలవాడ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే వెంకటరమణ మధ్య కూడా రేషన్‌డీలర్ల వివాదం ముదరుతోంది.
 
ఎవరి వాదన వారిది

పదేళ్లుగా కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉంది. ఈ కాలంలో మంత్రిగా చెలామణి అయిన గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బందిపెట్టారని దశరథనాయుడు వర్గం ఆరోపిస్తోంది. తప్పుడు కేసులు, ఆర్థికంగా అణిచివేయడం లాంటి చర్యలతో టీడీపీ శ్రేణులను గడగడలాడించారని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలకు అండగా నిలిచి, పార్టీ ఉన్నతి కోసం శ్రమించామని, గల్లాకు వ్యతిరేకంగా పోరాటం చేశామంటున్నారు. పంచాయతీ, సింగిల్‌విండో ఎన్నికల్లో పార్టీ విజయానికి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేసి తాము అప్పులపాలయ్యారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో  తనను కాదని కాంగ్రెస్ నుంచి గల్లా అరుణకుమారిని అరువు తెచ్చుకుని టిక్కెట్టు ఇవ్వడంపై చంద్రబాబుపై దశరథ గుర్రుగా ఉన్నారు.
 
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో పాతడీలర్లను తొలగించి, కొత్తవారిని నియమించాలని దశరథ, ఇందుశేఖర్ ఓ జాబితా జేసీకి ఇచ్చినట్లు తెలిసింది. వీరికి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా మద్దతు పలుకుతున్నారు. కొన్నేళ్ల నుంచి కార్యకర్తలు తనను నమ్ముకుని ఉన్నారని, అలాంటి వారిని తొలగించేందుకు వీళ్లేదని గల్లా కూడా గట్టిగా వాదిస్తున్నారు. పైగా ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన బడి సుధాయాదవ్‌ను గాలి, దశరథ, శేఖర్ ఓడించారని, వారి మద్దతుతోనే రెబల్ అభ్యర్థి మునికృష్ణయ్య గెలిచారని గల్లా వర్గం అంటోంది. ఇలా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారి సిఫార్సులను పట్టించుకోవాల్సిన పనిలేదని ఇప్పటికే ఫోన్‌లో చంద్రబాబుకు చెప్పినట్లు తెలిసింది.
 
తిరుపతిలోనూ ఇదే రగడ

తిరుపతి తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే రచ్చ నడుస్తోంది. పాత డీలర్లను తొలగించేందుకు మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యే వెంకటరమణ అడ్డుపడుతున్నారని తెలిసింది. ఆయన కూడా గల్లా వాదననే విన్పిస్తున్నారు. తనకు అండగా ఉన్న నేతలు, కార్యకర్తలే డీలర్లుగా కొనసాగుతున్నారని, అలాంటి వారిని తొలగించేందుకు వీల్లేదని అంటున్నారు. దీంతో టీడీపీ అధికారంలోకి రాకముందు గల్లా, వెంకటరమణ పెత్తనమే కొనసాగిందని, వారి మద్దతుదారులే డీలర్లుగా ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారే ఉంటే తమ సంగతేంటని పాత టీడీపీ కార్యకర్తలు వారి నాయకుల వద్ద వాదిస్తున్నారు. మరి చంద్రబాబు ఏవైపు మొగ్గుతారో.. ఏ నేతకు అండగా నిలుస్తారో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు