నువ్వా.. నేనా..?

30 Jul, 2014 04:18 IST|Sakshi
నువ్వా.. నేనా..?

సాక్షి, ఒంగోలు: ప్రజాసమస్యల్ని గాలికొదిలేసిన అధికార టీడీపీ.. సొంత కుంపటిని చల్లార్చుకునే పనిలో పడింది. కొన్నాళ్లుగా నడుస్తోన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు ఎన్నిక వ్యవహారం తాజాగా ఆ పార్టీలో చిచ్చురేపింది.  సీనియర్, జూనియర్‌ల వివాదాన్ని తెరమీదికి తెచ్చింది.

తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెండు వర్గాలుగా చీలి కత్తులు దూసుకుంటున్నారు. పార్టీని నడపటంలో ఇరువురి ఆధిపత్యపోరు ఆది నుంచి కొనసాగుతూనే ఉన్నా.. అధినేత వద్ద తేలాల్సిన పంచాయితీల విషయమై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఈదర హరిబాబును ఇప్పటికే అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. అయితే, ఆయన్ను మరలా పార్టీలోకి చేర్చుకోవాలని కరణం బలరాం ప్రయత్నిస్తోండగా, మరోవైపు దామచర్ల జనార్దన్ తీవ్రంగా అడ్డుకుంటున్నారు. మిగతా నేతలను కలుపుకుని వర్గపోరును పోషిస్తున్న వీరిద్దరూ ‘ఈదర’ పంచాయితీ నేపథ్యంలో నువ్వా..నేనా..? అన్నట్టు తలపడుతున్నారు. అధిష్టానం వద్ద తమ మాటే  నెగ్గించుకోవాలనే పట్టుదలతో కసరత్తు చేస్తున్నారు.
 
పార్టీ పగ్గాల కోసమే సిగపట్లు..
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఈదర హరిబాబు స్వతంత్రంగా పోటీ చేయడంతో  వైఎస్సార్‌సీపీ సభ్యులు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే.. అదేవిధంగా ఆయన కూడా వైస్‌చైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థికే ఓటేశారు. ఈ వ్యవహారంలో హరిబాబు విప్‌ను ధిక్కరించారా..? లేదా..? అనే వ్యవహారం కొద్దిరోజుల్లో అధికారులు తేల్చనున్నారు. ఇదిలా ఉండగా, ఆయనపై అనర్హత వేటు వేయడానికి వీల్లేదంటూ కరణం బలరాం తనవర్గాన్ని తోడుగా తీసుకుని చంద్రబాబుతో మాట్లాడారు.
 
మరోవైపు దామచర్ల జనార్దన్ సైతం బాబు వద్దకెళ్లి ఈదరను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోరాదంటూ.. నమ్మకద్రోహం కారణంగా పరువు పోగొట్టుకున్నామని చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం. ఇరువురి వాదనలు విన్న చంద్రబాబు మాత్రం బలరాం నిర్ణయం వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి వర్గం ఈ విషయాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.

పార్టీ వ్యవహారాల్లో జనార్దన్ నిర్ణయాలకు అడ్డుతగులుతున్న కరణం బలరాంకు.. తాజాగా ఈ పంచాయితీ మరింత గుర్తింపును తెస్తోందని ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాను జిల్లాలో ఎవరికీ పోటీదారుడ్ని కాదని.. గొట్టిపాటి హనుమంతరావు సన్నిహితుడ్ని అని విలేకరుల సమావేశంలో చెప్పుకున్న ఈదర హరిబాబుకు కరణం బలరాం మద్దతివ్వడాన్ని పార్టీవర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. గొట్టిపాటి కుటుంబంతో బద్ధవైరం నడుపుతున్న బలరాం ఇప్పుడిలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
 
జెడ్పీచైర్‌పర్సన్‌పై అనర్హత వేటు వేసినప్పటికీ.. ఎటూ ఆ పదవి అధికారపార్టీకి దక్కదనే ఉద్దేశాన్ని అధినేతకు వివరించి.. జిల్లాపార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలనే ఆలోచనతో బలరాం పావులు కదుపుతున్నట్టు చర్చ జరుగుతోంది. సమీపంలో ఉన్న ఒంగోలు నగరపాలకసంస్థ ఎన్నికల్లో జనార్దన్ ప్రాభవాన్ని పూర్తిగా తగ్గించుకునే ఎత్తుగడలో భాగంగానే ఈదర పంచాయితీని బలరాం భుజానికెత్తుకున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.    
 
ఇరువర్గాలకు దూరంగా మంత్రి శిద్దా..
పార్టీలో సీనియర్‌గా ఉంటూ జిల్లా రాజకీయాలు కొనసాగిస్తున్న కరణం బలరాం వైఖరిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సందర్భానుసారం అధినేత చంద్రబాబు కూడా బలరాంను కాదని ఇక్కడ వ్యవహారాలకు సంబంధించి దామచర్ల జనార్దన్‌ను సమర్ధిస్తున్న సంగతి తెలిసిందే.. బలరాం తనకు సంబంధంలేని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడాన్ని జనార్దన్ తరచూ అధినేత దృష్టికి తెస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిపదవి పొందిన శిద్దా రాఘవరావును అడ్డం పెట్టుకుని జనార్దన్ హవాకు చెక్‌పెడదామనే వ్యూహంతో కరణం బలరాం రాజకీయం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.
 
ఇందులో భాగంగానే ఇటీవల వరుస ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారు, సీట్లపంపకం, బీఫారంల పంపిణీ తదితర పనులన్నింటినీ శిద్దా రాఘవరావుతోనే నడిపించారు. మంత్రి అయిన తర్వాత కూడా శిద్దా రాఘవరావును తన నివాసానికి పిలిపించుకుని మరీ బలరాం మంతనాలు సాగించారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు, కార్యకర్తలతో పాటు సామాన్యజనం సైతం మంత్రిని కలవకుండా.. కరణం బలరాంతో సంప్రదించడం.. ఆమేరకు ఆయన ఆదేశాలతో మంత్రి శిద్దా అధికారులకు ఫోన్‌లు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
 
ఆదిలోనే విషయం గుర్తించిన మంత్రి.. కొద్దికాలంగా బలరాంకు దూరంగా ఉంటున్నట్టు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఈదర హరిబాబు వ్యవహారంలో కూడా ఇరువర్గాల అభిప్రాయాలకు భిన్నంగా చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమంటూ తేల్చేసి ముందుకెళ్తున్నారు. నిన్నటిదాకా జనార్దన్ పక్కనే ఉన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావులు సైతం పార్టీ అధినేత నిర్ణయానికే కట్టుబడతామన్నారు.

కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాత్రం జనార్దన్ వర్గంలో ఉంటూ బలరాం ప్రయత్నాల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏది ఏమైనా, అధికార నేతలు జిల్లాలో రైతాంగ, డ్వాక్రాసంఘాల రుణ సమస్యల్ని గాలికొదిలేసి.. స్వపక్ష కుమ్ములాటలకు అధికప్రాధాన్యమిచ్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు