చిట్‌ఫండ్‌ మోసగాళ్లకు భరోసా..

31 Mar, 2019 08:31 IST|Sakshi

చిట్‌ఫండ్‌ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులకు ఆయన అండగా నిలుస్తాడు. చిట్‌ఫండ్‌ మోసాల్లో నష్టపోయిన బాధితులంతా కాళ్ల బేరానికి వచ్చే విధంగా  మంత్రి పేరు చెప్పి బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తాడు. రూ.లక్షల నుంచి మొదలుకుని రూ.కోట్ల వరకు పేద, సామాన్య వర్గాలను మోసం చేసిన చిట్‌ఫండ్‌ వ్యాపారస్తులకు భరోసా ఇస్తూ సింగిల్‌సెటిల్‌మెంట్‌ వ్యవహారాలతో ఒక్కో సెటిల్‌మెంట్‌లో లక్షల నుంచి కోట్ల  రూపాయలు ఆర్జిస్తుంటాడు. ఎవరైనా ఎదురు తిరిగితే మంత్రి  అండతో తనకు అనుకూలమైన దారుల్లో బెదిరిస్తుంటాడు. ఇవే కాకుండా పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. అమాయకులైన యువకుల్ని పేకాట ఉచ్చులోకి దింపుతూ వారిని అప్పులపాలు చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో లక్షల రూపాయలు ఆర్జిస్తుంటాడు. 


సాక్షి, టెక్కలి: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు సర్వ సాధారణంగా ఉన్న ఆ వ్యక్తి 2014 తరువాత టీడీపీ అధికారంలోకి రావడం. టెక్కలి నియోజకవర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి హోదా సాధించడంతో మంత్రి పేరు చెప్పుకుని దందాలు కొనసాగిస్తూ ‘షాడో మంత్రి’గా అవతారం ఎత్తాడు. సెటిల్‌మెంట్‌ వ్యవహారాలు, అవినీతి పరులు, మోసగాళ్లకు అండగా నిలుస్తూ తన సామ్రాజ్యాన్ని పదిల పరుచుకుంటున్న ఓ సాధారణ వ్యక్తి నేడు జిల్లా ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాడు. 


‘భూం’ఫట్‌ స్వాహా..!
ప్రభుత్వ స్థలాలకు చెందిన సర్వే నంబర్లు మార్చుకుని తనకు అనుకూలంగా  రిజిస్ట్రేషన్లు చేసుకోవడం ఆయన స్పెషల్‌. ఇంత జరుగుతున్నప్పటికీ ఎవరూ నిలదీసే సాహసం చేయలేక భయపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే సదరు మంత్రికి ఆ వ్యక్తి బినామీగా వ్యవహరించడమే కాకుండా మంత్రి చేసే ప్రతి కార్యక్రమానికి పెత్తందారీ వ్యవహారం చేయడంతో,  మంత్రికి ఆ వ్యక్తికి ఉన్న సత్సంబంధాలతో ‘షాడో మంత్రిగా’ చెలామణి అవుతున్నాడు. దీంతో  సామాన్య ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా ఇదే వ్యవహారంతో కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు అదే వ్యక్తి మరో అడుగు ముందుకు వేసి రాజకీయ దళారీగా అవతారమెత్తుతున్నాడు. ప్రతిపక్ష పార్టీకి చెందిన చిన్న పాటి కార్యకర్తలను బెదిరించడమే కాకుండా వారిపై దాడి చేసి మరీ టీడీపీలోకి బలవంతంగా లాగే ప్రయత్నాలు చేస్తున్నాడు. 


ఇంకెన్ని అనర్థాలు జరుగుతాయో?
అయితే తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మంత్రికి తెర వెనుక ప్రధాన అనుచరుడిగా ఉండడంతో, తమకు మేలు చేస్తాడనే  విశ్వాసం పెంచుకున్న వారి నమ్మకానికి అడుగడుగునా తూట్లు పొడుస్తూ మోసాలకు  పాల్పడుతుండడంతో వారంతా విస్తుపోతున్నారు. టెక్కలి నియోజకవర్గం మొదలుకుని జిల్లా వ్యాప్తంగా పలు రకాల దందాలకు పాల్పడుతూ మంత్రికి వాటాలు అందిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్న ఆ వ్యక్తి ఎటువంటి ఆగడాలు చేసినా గత నాలుగున్నరేళ్లుగా ఏమీ చేయలేక బాధితులు కుమిలిపోతున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో అచ్చెన్నాయుడికి మరోసారి అవకాశం ఇస్తే ‘షాడో మంత్రిగా’ వ్యహరిస్తున్న ఆ వ్యక్తి వల్ల ఇంకెన్ని అనర్థాలు జరుతుతాయోనని కొంతమంది చర్చించుకుంటున్నారు. 
 

మరిన్ని వార్తలు