ఆక్రమణల దందా!

4 Jun, 2018 12:06 IST|Sakshi
వైఎస్సార్‌నగర్‌లో కబ్జాకు గురవుతున్న గృహాలు

రూ.6 కోట్ల విలువైన స్థలాల ఆక్రమణ

ఓ హౌసింగ్‌ అధికారి సహకారం

అధికారపార్టీ నాయకులే సూత్రధారులు

మంత్రి నారాయణ, ఆదాలపేర్లు చెప్పి హల్‌చల్‌

నమ్మిమోసపోతున్న పేద, మధ్య తరగతి ప్రజలు

నెల్లూరు(వేదాయపాళెం): నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 31వ డివిజన్‌ వైఎస్సార్‌ నగర్‌లో అధికారపార్టీ నాయకులు, వారి అనుచరులు ఇళ్ల పేరిట భారీ వసూళ్ల దందాకు తెరలేపుతున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే తపన కలిగిన నిరుపేదలు నాయకుల మాటలు నమ్మి దగా పడుతున్నారు. అతి తక్కువ ధరకే ఇక్కడ ఖాళీగా ఉన్న గృహాలను ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారు. దీంతో పలు ప్రాంతాల పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు పోటాపోటీగా డ బ్బులు కడుతున్నారు. ఈ విషయంలో స్థానిక అధి కారపార్టీ చోటానేతలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 300 గృహాల స్థలాలకు గాను సు మారు రూ.6 కోట్ల మార్కెట్‌ విలువ ఉంది. కాగా అధికార పార్టీ నాయకులు కారుచౌకగా ఒక్కో ప్లా టు(9 అంకణాలు)ను రూ.20 వేల నుంచి రూ.50 వేలకు బేరం పెడుతున్నారు. యథేచ్ఛగా బేరసారాలు జరుగుతున్నప్పటికీ ఆ శాఖ అధి కారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

అధికారుల అలసత్వం
దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరెడ్డి ప్రతి కుటుంబానికి సొంతిల్లు ఉండాలనే సంకల్పంతో కొత్తూరు వద్ద 2007లో వైఎస్‌ఆర్‌ నగర్‌ను ఏర్పాటు చేశారు. 6,734 గృహాలను విడతల వారీగా నిర్మించేందుకు కార్యాచరణ రూపొం దిం చారు. మహానేత మరణం తరువాత అప్పటి కాం గ్రెస్‌ పాలకులు, అధికారులు ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో కాంట్రాక్టర్‌లు అవినీతికి తెరలేపి ఇష్టారాజ్యంగా నిర్మాణాలను కొనసాగించారు. దీంతో నిర్మాణాలు పూర్తి నాసిరకంగా జరిగాయి. నిర్మాణాలు పూర్తయిన తర్వాత లబ్ధిదారులు గృహాల్లో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా ఇళ్లన్నీ నిరుపయోగంగా మారాయి. కొద్దికాలం తరువాత ఇళ్లు కూలేందుకు సిద్ధమయ్యాయి. రెండు బ్లాకుల్లో రెండు సార్లు మూడిళ్లు కుప్పకూలాయి.

బాధ్యులపై చర్యలు శూన్యం
నాసిరకం నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిగినప్పటికీ అధికారులు కాంట్రాక్టర్‌లపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారే తప్ప ఇప్పటివరకూ దుర్వినియోగమైన నిధులను వారి వద్ద నుంచి రికవరీ చేయలేకపోయారు. కులేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను తొలగించాలని విచారణ నివేదికలో ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు తొలగించిన దాఖలాలు కూడా లేవు.

నెరవేరని మంత్రి హామీ
వైఎస్సార్‌ నగర్‌లో లబ్ధిదారులంతా నివాసం ఉండాలని కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో ఆ ఇళ్లలో చేరకుంటే ఇళ్లను రద్దు చేస్తామని హౌసింగ్‌ అధికారులు పదేపదే హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గత్యంతరం లేక 2 వేల గృహాల లబ్ధిదారులు ఇళ్లలో చేరారు. వీరికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు.

లబ్ధిదారుల గృహాల్లో కబ్జాదారుల పాగా
లబ్ధిదారులకు కేటాయించిన 400 నుంచి 500 గృహాలు కబ్జాదారుల ఆధీనంలో ఉన్నాయి. ఆక్రమణ చెరలో నుంచి తమ ఇళ్లను కాపాడాలని పలువురు బాధితులు ఆ శాఖ అధికారులకు, కలెక్టర్‌కు పలుమార్లు విన్నవించుకున్నారు. కాగా తాజాగా జియోట్యాగ్‌ కాని 300 గృహాలు ఖాళీగా ఉండడంతో వీటిపై అధికారపార్టీ నేతల కన్నుపడింది. బినామీ పేర్లతో తమ అనుచరులకు కొన్ని, బయట వ్యక్తులకు కొన్ని విక్రయాలు సాగించేలా వ్యూహం పన్నారు. ఈ గృహాలన్నీ దాదాపు లెంటల్‌ లెవల్‌లో ఉన్నాయి.

అంతా మాఇష్టం
టీడీపీ నాయకుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మంత్రి నారాయణ తమకు అండగా ఉన్నారంటూ తాము చెప్పిన వారికే స్థలాలు ఖరారవుతాయంటూ స్థాని క కార్పొరేటర్‌ భర్త, అతని అనుచరులు ఇష్టారాజ్యంగా ఇళ్ల కేటాయింపుల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. రూ.2 లక్షల విలువైన ప్లా టును రూ.50 వేలకు అప్పజెబుతున్నారు. వీరు అప్పజెప్పిన గృహాలను, ఖాళీ స్థలాలను కొనుగో లు చేసిన వారు తాత్కాలిక పనులు చేసుకుంటూ రేకు తలుపులను బిగించుకుంటున్నారు. అలాగే హరనాథపురం ప్రాంతానికి చెందిన రాఘవరెడ్డి అనే చోటా నాయకుడు రూ.10 వేల నుంచి రూ. 20 వేలకు బేరంపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ జియోట్యాగ్‌ కానివి 154, గృహాల్లో చేరనివి 200 వరకూ కబ్జాదారుల ఆక్రమణల్లో ఉన్నాయి.

విద్యుత్‌ మీటర్లకు హౌసింగ్‌  ఏఈ అనుమతులు
ఒకసారి లబ్ధిదారులకు కేటాయించిన గృహాలను రద్దు చేయాలంటే హౌసింగ్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం నుంచి అనుమతులు తప్పనిసరి. ఈక్రమంలో గృహాలు రద్దు కాకుండానే అధికారపార్టీ నాయకులు సూచించిన వారికి స్థానిక హౌసింగ్‌ ఏఈ ప్రలోబాలకు గురై సిఫార్సులు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకూ అధిక సంఖ్యలో విద్యుత్‌ మీటర్లు పొందనట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చోద్యం చూస్తుండడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కాని పరిస్థితి.

మరిన్ని వార్తలు