పెద్ద చెరువులో ‘పచ్చ’గద్దలు..!

8 Oct, 2017 11:56 IST|Sakshi

అధికార బలంతో రూ.కోట్ల విలువైన పనులను ముక్కలుగా చేయించారు.. నామినేషన్‌ పద్ధతిలో తమవారికి కట్టబెట్టించారు. నాణ్యతలేని పనులతో ప్రజాధనాన్ని లూటీ చేయిస్తున్నారు. విజయనగరం పెద్దచెరువు సాక్షిగా జరుగుతున్న అక్రమాలను అధికారులూ గుర్తించారు. పదికాలాల పాటు శాశ్వతంగా ఉండాల్సిన పనుల్లో నాణ్యత లోపించినా ఎదురు చెప్పలేక.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్పనంగా బిల్లులు చెల్లించేస్తున్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఏకమై నిధులు కొల్లగొడుతున్న తీరుపై ‘సాక్షి’ ఫోకస్‌.  

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం పట్టణ నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువు అభివృద్ధి పేరుతో అధికార పార్టీ పెద్దలు దోపిడీకి తెరలేపారు. రూ.కోట్ల విలువైన పనులను నామినేటెడ్‌ పద్ధతిలో దక్కించుకున్నారు. ఇదేమిటని అడిగేవారు లేక పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేశారు. అధికార బలంతో అధికారులపై ఒత్తిడి పెంచి ప్రజల సొమ్మును అప్పనంగా మేసేస్తున్నారు. పనుల్లో నాణ్యత లేదని ఆ విభాగం అధికారులు ప్రశ్నిస్తే రాజకీయపలుకుబడితో వారి నోరు నొక్కేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడే పనుల పేరుతో ఇల్లు చక్కబెట్టుకుంటున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు.   

ఇదీ పనుల తీరు...
నీరు–చెట్టు పథకం కింద విజయనగరం పట్టణం నడిబొడ్డున ఉన్న పెద్దచెరువు అభివృద్ధి కోసం రూ.1.60 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.80 లక్షలు మట్టి పనులకు మంజూరు చేయగా, మరో రూ.80 లక్షలు కల్వర్టుల నిర్మాణానికి కేటాయించారు. మట్టి పనుల్లో భాగంగా గతేడాది కొంత, ఈ ఏడాది కొంత మట్టి తీయడం, బండ వెడల్పు చేయడం వంటి పనులు చేశారు. సిమెంట్‌ పనుల్లో భాగంగా ఎనిమిది కల్వర్టులు నిర్మించారు. ఇందులో ఇప్పటివరకు మట్టి పనులకు, కాంక్రీట్‌ పనులకు రూ.70 లక్షలకు పైగా ఖర్చు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా...
చెరువు అభివృద్ధి పనుల కేటాయింపులో నిబంధనలను అధికారులు గాలికొదిలేశారు. నీరు–చెట్టు పథకం కింద రూ.10లక్షల పనుల వరకే నామినేటెడ్‌ విధానంలో సాగునీటి సంఘాలకు ఇవ్వాలి. లేకుంటే జన్మభూమి కమిటీలకు నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నారు. రూ.10 లక్షలు విలువ దాటిన పనులను మాత్రం తప్పనిసరిగా టెండరు పద్ధతిపై కేటాయించాలి. ఈ నిబంధన ప్రకారం చూస్తే పెద్ద చెరువు అభివృద్ధికి రూ.1.60 కోట్లు కేటాయించడంతో టెండరు విధానంలో పనులు కేటాయింపు జరగాలి. అలా చేయకుండా అధికారులు పనులను ముక్కలుగా చేసి 16 పనులుగా మంజూరు చేశారు. ఒక్కోపని విలువ రూ.10 లక్షలుగా చేసి నామినేషన్‌ పద్ధతిపై సాగునీటి సంఘానికి కేటాయించారు.

అన్ని పనులూ ఎమ్మెల్యే సోదరికే..  
నామినేటెడ్‌ పద్ధతిలో పనులెందుకు కేటా యించారనే ప్రశ్నకు.. పనులు వేగంగా చే యడానికే ఇలా చేశామని సాగునీటి శాఖ అధికారులు సమాధానం చెప్పుకొస్తున్నారు. అధికారులు అనుకున్నట్లు చేస్తే పనులు వేర్వేరు వ్యక్తులకు కేటాయించాలి. అలాకా కుండా ఒకే వ్యక్తి పనులు చేస్తున్నారు. పెద్ద చెరువుకు సంబంధించి సాగునీటి కమిటీ అధ్యక్షులుగా విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత సోదరి విజయలక్ష్మి వ్యహరిస్తున్నారు. ఆమె పెద్ద చెరువు పనులు చేస్తుండడంతో అధికారులు టెండర్లు పిలవకుండా పనులు విడదీసి నామినేషను పద్ధతిపై కేటాయించేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివెనుక ఎమ్మెల్యే మీసాల గీత చక్రం తిప్పారని, అధికారులపై ఒత్తిడి పెంచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పనుల్లో నాణ్యతా లోపం..
పనుల మంజూరులో రాజకీయ పెత్తనం పెరగడంతో నాణ్యతలోనూ అదే కనిపించింది. చేసేది అధికారపార్టీ నాయకులు కావడంతో తమనడిగేవారెవరన్న విధంగా పనులు చేశారు. మట్టి పనుల్లో నిబంధలు గాలిలో కలిశాయి. మట్టి వేయడం తప్ప రోలింగ్, వాటరింగ్‌ అసలు లేదు. సిమెంట్‌ పనుల్లో నాణ్యత మరింత ఘోరం. చెరువుకు ఉత్తరవైపు ఎనిమిది కల్వర్టు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కల్వర్టు గోడలు నిర్మాణం అంచెలంచెలుగా వేశా రు. ఒకేసారి వేయడం సాధ్యం కాదు కావున అలా వేశారనుకున్నా కాంక్రీట్‌లో సిమెంట్, మెటల్‌ వాడకం సక్రమంగా లేదు. దీంతో గోడలపై ఎక్కడక్కడ పెచ్చులూడి కనిస్తున్నాయి. కాం క్రీట్‌ శ్లాబ్‌కు శ్లాబ్‌కు మధ్య గోనె సంచులు, ఎక్కడక్కడ అతుకులు స్పష్టంగా కనిపించడం నాణ్యత లోపాన్ని తెలియజేస్తున్నా యి. ఇసుక, సిమెంట్, మెటల్‌ మిక్సింగ్‌లో లోపం తెలుస్తోంది.

జలవనరుల శాఖ అభ్యంతరాలకు వివరణ..
జలవనరులశాఖ క్వాలటీ కంట్రోల్‌ అధికారులు ఇటీవల పనులను పరిశీలించి నాణ్యతపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నాణ్యత లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ విజయనగరం డివిజన్‌ ఇరిగేషన్‌ అధికారులకు లేఖ రాశారు. ఎలాంటి లోపాలు లేవని, పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయని వారి లేఖకు జిల్లా అధికారులు సమాధానం ఇచ్చేశారు. ఇప్పటికిప్పుడు ఉన్న ఫళంగా పెద్ద చెరువు వద్దకు వెళ్లి చూస్తే ఎవరికైనా పనుల నాణ్యత ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది. మరి ఈ విషయాన్ని జిల్లా అధికారులు ఎందుకు మరుగున పెట్టాలనుకుంటున్నారా తెలియడంలేదు. కలెక్టర్‌ కనీసం కన్నెత్తి ఎందుకు చూడటం లేదనే విషయాలపై ఆరాతీస్తే కలెక్టరే పరిపాలనానుమతి ఇచ్చారని తెలిసింది.

మరిన్ని వార్తలు