ఉచిత దోపిడీ

11 Apr, 2016 05:25 IST|Sakshi
ఉచిత దోపిడీ

యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
ట్రాక్టర్ ఇసుక రూ.4వేలు
అనుమతి లేని రీచ్‌ల నుంచీ తరలింపు
ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ఇసుక డంప్
రోజుకు 50వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్ముకుంటున్న తమ్ముళ్లు

 
అధికారికంగా జిల్లాలో మొత్తం రీచ్‌లు                         : 28
 మొన్నటి వరకు అధికారికంగా విక్రయించిన ఇసుక    :    12,65,251 క్యూబిక్ మీటర్లు
 ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం               : రూ.73.04 కోట్లు
 

 
అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న రీచ్‌ల ద్వారా టీడీపీ నేతలు మొన్నటి వరకు సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించినట్లు అంచనా. అక్రమ రవాణా ద్వారా టీడీపీ నేతలు రూ.70 కోట్ల వరకు కొల్లగొట్టారు. డ్వాక్రా సభ్యుల పేరుతో చేసిన దోపిడీ ఇది.
 
 ప్రస్తుతం..
 
జిల్లాలో 21 రీచ్‌లు, 29 వాగులు, వంకల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. అందులో పొట్టేపాళెం, కోలగట్ల, పడమటిపాళెం, అప్పారావుపాళెం, పుచ్చలపల్లి, గొల్లకందుకూరు, చిగురుపాడు, ఎస్వీకండ్రిగ, సజ్జాపురం, మినగల్లు, ముదివర్తి, ముదివర్తిపాళెం, పల్లిపాడు, వేగూరు, జమ్మిపాళెం, లింగంగుంట, మాముడూరు, పడమటికంభంపాడు, పడమటిపాళెం, సూరాయపాళెం, ఇరువూరు రీచ్‌ల నుంచి ప్రస్తుతం ఇసుకను తరలిస్తున్నారు.
 
 
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రస్తుతం జిల్లాలో అనుమతులు ఉన్న రీచ్‌ల ద్వారా రోజుకు 50వేల క్యూబిక్ మీటర్లు ఇసుకను తరలిస్తునట్లు అంచనా. ఒక్క పొట్టేపాళెం రీచ్ నుంచి రోజుకు 200 ట్రాక్టర్ల ద్వారా సుమారు 3వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసుకెళ్తున్నారు. పేరుకు ఇసుక ఉచితమే అయినా ఒక ట్రాక్టర్ రూ.1,800 నుంచి రూ.4వేల దాకా విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇసుక తరలింపులో టీడీపీ ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాయకులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పరసారత్నం, నెలవల సుబ్రమణ్యం, వేనాటి రామచంద్రారెడ్డి, కన్నబాబు అనుచరులు రీచ్‌ల్ వద్ద ట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూళ్లు చేసుకుంటున్నారు. ఈ ఇసుక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మరికొందరు పరిశ్రమలకు ఇసుకను అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు.


 అనుమతులు లేని రీచ్‌ల నుంచి
 చేజర్ల మండల పరిధిలోని కోటితీర్థం, టీకే పాడు, పుట్టుపల్లి, ఉలవపల్లి మడపల్లి, పెరుమాళ్లపాడు రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల నుంచి రాత్రి, పగలు యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కన్నబాబు అనుచరులు బుజ్జినాయుడు, కండే శీనయ్య, చీర్ల వెంకటేశ్వర్లు, లక్ష్మీనరసారెడ్డి, మహేష్‌రెడ్డి, బీజేపీ నాయకులు ప్రేమ్‌చంద్ నుంచి ఇసుకను వాహనాల ద్వారా తరలించి డంప్ చేస్తున్నారు.

అక్కడి నుంచి రాత్రుళ్లు కర్ణాటకకు తరలిస్తున్నారు. టీడీపీకి చెందిన బడా కాంట్రాక్టర్ బొల్లినేని శ్రీనివాసులు (బొల్లినేని కన్‌స్ట్రక్షన్స్)కు చేజర్ల తహసీల్దార్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడు రీచ్‌ల నుంచి ఇసుకను కాంట్రాక్ట్ పనులకు వినియోగించుకుంటున్నారు. చేజర్ల పరిధిలోని రీచ్‌లలో ప్రొక్లైనర్లతో ఇసుకను తోడుకుంటున్నారు. అదేవిధంగా దగదర్తి మండలంలో టీడీపీ నాయకులు మాలేపాటి సోదరులు అటవీ ప్రాంతంలో ఉన్న ఇసుకను అక్రమంగా తీసుకొచ్చి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్టేషన్ వెనుక వైపు డంప్ చేసి ఉన్నారు. ఆ ఇసుకతో ఇటుకలు తయారుచేసి విక్రయిస్తున్నారు.

మరిన్ని వార్తలు