బరి తెగించిన టీడీపీ నాయకులు

11 Apr, 2019 10:54 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ఎన్నికల సంగ్రామం చివరి దశకు చేరింది. మరి కొద్ది గంటల్లో జరిగే పోలింగ్‌కు ఇటు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల అభ్యర్థులు సర్వం సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు పోటా పోటీగా ప్రచారం చేసిన అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి జరిగే పోలింగ్‌లో ఓటర్లను ఎక్కువగా ప్రభావితం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

కొందరు డబ్బు, మద్యం, చీరలు, క్రీడా సామగ్రి, ఇతర వస్తువులతో ఓటర్లను ఆకట్టుకున్నారు. మరి కొందరు సాధారణ ఓట్లతో పాటు కులాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలకు చెందిన ఓట్లను గుంపగుత్తుగా పొందేందుకు పకడ్బందీగా ముందుకు సాగారు. ఈ మేరకు ఆయా వర్గాలకు వారం రోజుల ముందే అన్ని వనరులను సమకూర్చారు. పోలింగ్‌ రోజున ఎక్కువ మొత్తంలో ఓట్లను సంపాదించుకునేందుకు వ్యూహరచనలు పన్నారు. అయితే ఎన్నికల వేళ ఓటర్లకు పలు ప్రశ్నలు సంధిస్తున్నాయి.

అభ్యర్ధులు ఇచ్చే నోటు(డబ్బు)తీసుకుంటే భవిష్యత్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది..తీసుకోకుండా నిజాయితీగా ఓటేస్తే ఏ విధంగా వ్యవహరించవచ్చు.. అనే అంశాలు ఓటర్లలో ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండింటి మధ్య తేడా, స్వార్థ, నిస్వార్థపరులను గమనించి ఓటేస్తే బాగుంటుందని మేధావులు చెబుతున్నారు.

టీడీపీ కుయుక్తులు
స్వార్ధ రాజకీయాలతో.. ధనార్జనే ధ్యేయంగా రాష్ట్రంలో టీడీపీ పాలన సాగించింది. ఐదేళ్ల టీడీపీ పాలనలో భూకబ్జాలు, వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడింది. 2014 ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన 630 హామీలను నెరవేర్చక పోవడంతో టీడీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

దీంతో అధికారంలో ఉంటేనే ఏదైనా సాధ్యమని, ఏదైనా చేయగలమని గురువారం జరగనున్న సాధారణ ఎన్నికలలో ఎలాగైనా గెలిచేందుకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. జిల్లాలోని అన్ని  నియోజకవర్గ అభ్యర్థులతో రూ.1500 నుంచి రూ.10 వేల వరకు ఓటుకు వెలకడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంది. మాట వినకుంటే బెదిరింపులకు పాల్పడుతోంది.

ప్రశ్నించే హక్కు ఉండదు
ఎన్నికల సందర్భంగా జిల్లాలోని నియోజకవర్గాల్లో అభ్యర్థులు నోట్లు వెదజల్లుతున్నారు. ప్రత్యర్థి పార్టీకి ధీటుగా డబ్బు మూటలను ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి గెలుపుకోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల నేతలు ఇచ్చే రూ.500, రూ.1000 డబ్బును తీసుకుంటే తర్వాత మన సమస్యలను వారికి చెప్పే పరిస్థితి ఉండదు. 

నిజాయితీ పాలకులు అరుదు
శాసన సభ ఎన్నికలు అంటేనే రూ.లక్షలు, కోట్లు ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటి పోటీకి సాధారణ వ్యక్తులు రావడం అరుదుగా ఉంటుంది. అయితే ఆర్థికంగా స్థిరపడిన వారే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రూ.కోట్లు కుమ్మరించిన వారు తర్వాత ప్రజల కోసం నిజాయితీగా పని చేస్తారనే విషయంలో నమ్మకం తక్కువ. కొంతమంది మాత్రం ఎన్నికల ఖర్చుతో సంబంధం లేకుండా ప్రజా సేవ కోసం ముందుకు సాగుతారు. 

చులకనభావం
ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గెలిచిన వారిలో కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటర్లను చులకనభావంగా చూసే అవకాశముంది. ఎన్నికల్లో మీరు నోటు తీసుకుని ఓటు వేశారు కదా.. అనే భావనతో ఓటర్లను పట్టించుకోరు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన అవసరముంది.

సమస్యలతో సహజీవనం..
ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల్లో కొందరు మంచి వారుంటారు. మరి కొందరు పదవిని అడ్డుపెట్టుకుని పెత్తనం చెలాయించేవారుంటారు. అయితే డబ్బులు తీసుకుని ఓటేస్తే తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేను గట్టిగా అడగే పరిస్థితి ఉండదు. తద్వారా సమస్యలతో సహజీవనం చేయాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అభివృద్ధి సాధ్యం
ఓటర్లకు డబ్బులు పంచకుండా గెలిచిన వారు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపుతారు. అన్ని వర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. మరోసారి గెలవాలనే తాపత్రయంతో సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతారు. 

మరిన్ని వార్తలు