అయినా.. మనిషి మారలేదు

27 Jun, 2019 09:52 IST|Sakshi

సాక్షి, కాకినాడ(తూర్పు గోదావరి) : అధికారంలో ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా ఆయన తీరులో మాత్రం మార్పు రాలేదు. గతంలో అధికారంలో ఉన్నామనే దర్పాన్ని ప్రదర్శించగా... ఇప్పుడేమో ఓడిపోయామన్న అక్కసుతో గొడవకు కాలు దువ్వినట్టుగా వ్యవహరించారు. గతంలో జరిగిన జెడ్పీ సమావేశాలు ఓ సారి గుర్తు చేసుకుంటే ఆయనెవరో ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇంకెవరు ఆయనే శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం సారు. టీడీపీ ఓడిపోయాక, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం మంత్రులు నిర్వహించిన తొలి సమావేశంలో ఆయన వ్యవహరించే తీరు చూస్తే ఎవరికైనా డీఆర్సీ ఆశ్చర్యం కలగక మానదు. సమావేశానికి రావడమే తరువాయి గొడవకు దిగేలా మాట్లాడారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 18 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. ఆ ఆలస్యానికే ‘డిప్యూటీ’ సారు వీరంగం సృష్టించారు. అది అయిపోయిన కాసేపటికి కుర్చీ కోసం గొడవకు దిగారు. ఆయనొచ్చేసరికి వేదికపై డిప్యూటీ చైర్మన్‌ కుర్చీ ఖాళీగా ఉన్నా కూర్చోలేదు. ఇంతలో ఆ కుర్చీ ఎవరిదో చూడక, గమనించక రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, ఐఎఫ్‌ఎస్‌ అధికారి నందిని సలారియా  కూర్చుండిపోయారు. ఇంకేముంది నా కుర్చీ కబ్జా చేసేశారని గలాటాకు దిగారు. ఇంకాసేపటికి వేదికపై కూర్చొన్న తనకు ప్రారంభ ఉపన్యాసం చేసే అవకాశం ఇవ్వలేదని  హల్‌చల్‌ చేశారు. ఇదంతా చూసిన వారంతా గొడవ పడేందుకే రెడ్డి సుబ్రహ్మణ్యం వచ్చినట్టుగా ఉందని చర్చించుకున్నారు.

నాడు అధికారంలో ఉండగా 
గతంలో జరిగిన ఒక  జెడ్పీ సమావేశంలో మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావుపై ఫైర్‌ అయ్యారు. ఎంపీలు, శాసన సభ్యుల అనుమతితో స్థానిక సంస్థల సభలను గతంలో నిర్వహించిన సంప్రదాయం ఉందని,  దాన్ని పాటించాలని ఎమ్మెల్యే జోగేశ్వరరావు ప్రస్తావించగా రెడ్డి సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకుని ఊరకనే నోరు పారేసుకున్నారు. ఈ సందర్భంగా  సుబ్రహ్మణ్యం, జోగేశ్వరరావు మధ్య వ్యక్తిగతంగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక, మరో జెడ్పీ సమావేశంలో అందరి సమక్షంలో విచక్షణ మరిచిపోయి వ్యవహరించారు. ఇసుక విధానంపై ప్రస్తావిస్తుండగా సభలో గౌరవంగా చూడాల్సిందిపోయి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని పరుష పదజాలంతో దూషణకు దిగుతూ, చేతికందిన వాటిని విసురుతూ అసహనంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేశారన్న విమర్శలు వినిపించాయి. గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా దురుసుగా వ్యవహరించడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు నిర్ఘాంతపోయారు.  ఇసుక అక్రమ తవ్వకాలపై వైఎస్సార్‌సీపీ నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు కలెక్టర్‌ వివరణ ఇవ్వనున్న నేపథ్యంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గలాటా సృష్టించడంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎప్పటిలానే బిగ్గరగా అరుస్తూ, చేతికందినివి విసురుతూ దౌర్జన్యకాండకు దిగారు.

నేడు ప్రతిపక్షంలో ఉండగా
ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయామన్న అక్కసో, గతంలో మాదిరిగా అధికార దర్పం ప్రదర్శించలేకపోతున్నానన్న ఆవేదనో తెలియదు గానీ బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన మంత్రుల సమీక్షా సమావేశంలో రావడమే తరువాయి గొడవకు వచ్చినట్టుగా సిద్ధమయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 11.18 గంటలకు మొదలైంది. దీన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం సాకుగా తీసుకొని, మమ్మల్ని ఎందుకు 11 గంటలకని పిలిచారని, కలెక్టర్‌ ఇంతవరకు రాకపోవడమేంటని, దీనికి సమాధానం ఎవరు చెబుతారని, 18 నిమిషాల ఆలస్యంగా మొదలు పెట్టడమేమి టంటూ రాద్ధాంతం సృష్టించారు.  అప్పటికే కలెక్టర్‌ సమావేశ ప్రాంగణం దిగువన మంత్రుల కోసం వేచి చూస్తున్నారు. అదేమీ పట్టించుకోకుండా ఘర్షణకు దిగేలా రెడ్డి సుబ్రహ్మణ్యం వ్యవహరించారు.

 మంత్రులు, కలెక్టర్‌ వేదిక వద్దకు వచ్చేసరికి వాగ్వాదానికి దిగారు. సమావేశం ప్రారంభంలోనే గందరగోళ పరిస్థితులకు దారితీయించారు. వాస్తవానికైతే, ఒక అధికారిక సమావేశానికి 18 నిమిషాల ఆలస్యం పెద్ద విషయమేమీ కాదు. ఇలా చూస్తే గతంలో జెడ్పీ సమావేశాలు నిర్దేశించిన సమయం కన్నా గంటకుపైగా ఆలస్యంగా ప్రారంభమైన దాఖలాలున్నాయి. ఈ వివాదం అయిపోగానే జిల్లా పరిషత్‌ చైర్మన్‌ను ఎందుకు పిలవలేదని నిలదీశారు. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశమని, మరోసారి నిర్వహించే సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ తదితర ప్రజాప్రతినిధులను పిలుస్తామని చెప్పుకొచ్చినా తన బాణీలో మార్పు రాలేదు. ఇది అయ్యాక వేదికపై ఉన్న తన కుర్చీలో రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ çసుమిత్‌ కుమార్‌  గాంధీ కూర్చొని కబ్జా చేసేశారని గొడవకు కాలు దువ్వారు. వాస్తవానికైతే, సదరు అధికారికి ఆ కుర్చీ డిప్యూటీ చైర్మన్‌దని తెలియదు. వారికి కేటాయించిన కుర్చీ అని గమనించలేదు.

రెండు కుర్చీలు ఖాళీగా ఉండటంతో ఐఎఫ్‌ఎస్‌ అధికారి నందిని సలారియాతో కలిసి వేదికపై కూర్చొండిపోయారు.  వారిని అక్కడి నుంచి వేరొక కుర్చీకి వెళ్లిపోమని సున్నితంగా చెబితే సరిపోయేది. ఈ సారి ఆలస్యం సమస్యను వదిలేసి కుర్చీ వ్యవహారాన్ని అందుకొని గొంతు చించుకున్నారు. పేచీ అక్కడితో అయిపోలేదు తరువాత ప్రారంభ ఉపన్యాసం విషయంలో ప్రాధాన్యతలను గుర్తించకుండా తనను అవమానించారని మరోసారి గొంతుకు పని చెప్పారు. ఇలాంటి పరిస్థితులు ఇక ముందు పునరావృతం కావని మంత్రులు పిల్లి సుబాష్‌చంద్రబోస్, కన్నబాబు, విశ్వరూప్‌ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా  తన వైఖరిని వీడలేదు.

మరిన్ని వార్తలు