తిరుపతి సైకిల్‌కి అమరావతిలో రిపేర్‌

29 Apr, 2017 03:45 IST|Sakshi
తిరుపతి సైకిల్‌కి అమరావతిలో రిపేర్‌

నగర అధ్యక్షుని ఎంపికలో బయల్పడ్డ స్పర్థలు
భాస్కర్‌యాదవ్, గుణశేఖర్‌ల మధ్యనే పోటీ
రెండు గ్రూపులుగా విడిపోయిన పార్టీ నేతలు
నేడో రేపో పేరు ప్రకటించనున్న  పార్టీ అధిష్టానం


తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర కమిటీ అధ్యక్షుని ఎంపిక ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. నగర నాయకుల మధ్య సఖ్యత, సమన్వయం లోపించిన కారణంగా అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడింది. పార్టీ ఎమ్మెల్యే ఒకరి పేరు చెబుతుంటే, మెజార్టీ నాయకులు మరొకరి పేరు చెబుతున్నారు. దీంతో పరిశీలకులుగా హాజరైన నాయకులు సైతం తలలు పట్టుకుని నిర్ణయం చెప్పకుండానే ఉడాయించారు. దీంతో రెండు గ్రూపులుగా చీలిన పార్టీ నగర నేతలు మంత్రి అమరనాథరెడ్డి దగ్గర పంచాయితీ పెట్టారు. నేడో రేపో పార్టీ అధిష్టానం నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించే వీలుందని సమాచారం.

సాక్షి ప్రతినిధి, తిరుపతి :  టీడీపీ తిరుపతి నగర కమిటీ ఎంపిక వివాదం అమరావతికి చేరింది. ఇందుకోసం తిరుపతి నగర పార్టీ నాయకుల్ని అమరావతి పిలిపించుకుని మాట్లాడేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైంది. ప్రస్తుతం తిరుపతి నగర టీడీపీ అధ్యక్షునిగా దంపూరి భాస్కర్‌యాదవ్‌ నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు. ఈయన పదవీకాలం ముగియడంతో పార్టీ అధిష్టానం నూతన కార్యవర్గ నియామకానికి శ్రీకారం చుట్టింది.

 ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ పది రోజుల కిందట పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటుచేసి పార్టీ ప్రముఖుల అభిప్రాయాలను అడిగారు. కొంతమంది దంపూరి భాస్కర్‌యాదవ్‌ పేరును, మరికొంత మంది పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గుణశేఖర్‌నాయుడు పేరును ప్రస్తావించారు. మెజార్టీ నాయకులు గుణశేఖర్‌ పేరును చెప్పడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని దంపూరి భాస్కర్‌యాదవ్‌నే మళ్లీ అధ్యక్షునిగా కొనసాగించాలని చెప్పారు.  మెజార్టీ నాయకులు ఈ నిర్ణయాన్ని విభేదించారు.

పరిశీలకుల రాజీ చర్చలు
టీడీపీ తిరుపతి నగర అధ్యక్ష పదవికి ఒక పక్క దంపూరి భాస్కర్‌యాదవ్, మరోపక్క గుణశేఖర్‌ నాయుడు పోటీ పడటంతో పార్టీ రాజీచర్చల కోసం పరిశీలకులను పంపింది. వారం కిందట తిరుపతి చేరుకున్న పార్టీ పరిశీలకులు, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి స్థానిక హోటల్లో డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శుల అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడ కూడా గుణశేఖర్‌నాయుడి వైపే మొగ్గు కనిపించింది. అయినప్పటికీ ఎమ్మెల్యే సుగుణమ్మ దంపూరి భాస్కర్‌ యాదవ్‌ పేరునే సూచిస్తుండటంతో పార్టీ జిల్లా నాయకులు సందిగ్ధంలో పడ్డారు.

విషయాన్ని గుర్తించిన గుణశేఖర్‌నాయుడు గ్రూపు నాయకులందరూ గురువారం మంత్రి అమరనాథరెడ్డిని కలిసి సమస్యను పరిష్కరించాలన్నారు. నగర పార్టీ ప్రముఖులు నరసింహయాదవ్, తిరుపతి కోఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పులిగోరు మురళి తదితరులు గుణశేఖర్‌నాయుడు పక్షాన నిలబడ్డారు.∙ఎమ్మెల్యే నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తున్నారు. నాలుగేళ్ల పాటు పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన వ్యక్తిని మళ్లీ అధ్యక్షుడిగా చేయాలనుకోవడం ఎంతమాత్రమూ సబబు కాదనీ, కొత్త వారికి అవకాశం కల్పించాలని వీరు గట్టిగా పట్టుబడుతున్నారు.

ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో  ఎంపిక
తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడిని ఐవీఆర్‌ఎస్‌ పద్ధతిలో ఎంపిక చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. నగర పార్టీ నాయకులు, వివిధ డివిజన్ల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులకు సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం అందించి వారి నుంచి అభిప్రాయాలను∙సేకరించే పద్ధతినే ఐవీఆర్‌ఎస్‌ పద్ధతి అంటారు. ఎక్కువమంది ఎవరి పేరును సూచిస్తే వారి పేరునే ప్రకటిస్తామని పార్టీ అధిష్టానం చెబుతోంది. అయితే ఎమ్మెల్యే వర్గం మాత్రం దంపూరి పేరునే ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి పార్టీ ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే.

మరిన్ని వార్తలు